close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

ఎప్పుడు మేల్కొంటారేమో..?

హుస్సేన్‌సాగర్‌ చెంత భద్రత కరవు
రద్దీ ఉండే చోట బారికేడ్లు లేని వైనం
రక్షణ ఏర్పాట్లపై హెచ్‌ఎండీఏ నిర్లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలు కురుస్తున్నాయి. హుస్సేన్‌సాగర్‌ చెంత సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ క్రమంలో అనుకోకుండా కాస్త పట్టు తప్పితే ఇక అంతే సంగతులు. ప్రక్షాళన పేరిట రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేసిన హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సందర్శకుల భద్రతను మాత్రం గాలికొదిలేశారు.

దేశ, విదేశీ పర్యాటకులు..!
సెలవు దినాలు, శని, ఆదివారాల్లో హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో కాసేపు సేద తీరేందుకు నగరవాసులు నెక్లెస్‌రోడ్డు బాట పడుతుంటారు. సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కు, లేజర్‌ షో, బోటింగ్‌, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ తదితర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు. దేశ, విదేశీ పర్యాటకులూ విచ్చేస్తుంటారు. హెచ్‌ఎండీఏకు చెందిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీకి ప్రతి నెలా రూ.70లక్షల పైచిలుకు ఆదాయం సమకూరుతోంది. సాధారణ రోజుల్లో 30వేల వరకు, సెలవు, శని, ఆదివారాల్లో 50వేల నుంచి 60వేల వరకు సందర్శకులు వస్తుంటారని అధికారులు పేర్కొంటున్నారు.

పట్టు తప్పితే ఇక అంతే..!
హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, సుందరీకరణ పేరిట హెచ్‌ఎండీఏ రూ.వందల కోట్లు వెచ్చించింది. బీపీపీఏ ఎప్పటికప్పుడు మరిన్ని పర్యాటక హంగులను అద్దుతోంది. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తితింది. సాగర్‌ అందాలను వీక్షించేందుకు ఎక్కువగా మంది సందర్శకులు తరలి వస్తున్నారు. సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఉత్సాహాంగా గడుపుతున్నారు. చిన్నారుల సందడి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, ఎన్టీఆర్‌ స్మారకం, లుంబినీ పార్క్‌ సమీపంలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సాగర్‌ చుట్టూ రక్షణా ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయి. బారికేడ్లు లేకపోవడంతో సందర్శకులు కొద్దిగా లోపలికి వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రాంతమంతా తడితడిగా ఉంది. ఈ నేపథ్యంలో పట్టు తప్పిపోతే నేరుగా సాగర్‌లో పడిపోయే ప్రమాదముందంటూ పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిమజ్జనం పూర్తి కాగానే..!
గణేష్‌ నిమజ్జనం పూర్తి కావడంతో సాగర్‌ చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, ఎన్టీఆర్‌ స్మారకం, లుంబినీ పార్క్‌ సమీపంలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ‘పిల్లలు కాసేపు సరదాగా గడుపుతారని ఇక్కడికి తీసుకొచ్చాం. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ ఎదుట బ్యారికేడ్లు లేకపోవడంతో ఏం జరుగుతుందోనంటూ భయంభయంగా గడపాల్సి వచ్చింది’ అంటూ అల్వాల్‌కు చెందిన ఓ సందర్శకుడు ‘ఈనాడు’తో వాపోయారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.