close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

విహార యాత్రలో విషాదగీతిక

గోదావరిలో ఘోరప్రమాదం
‌పర్యాటకులతో వెళ్తూ బోటు జలసమాధి

పర్యాటక కేంద్రమైన పాపికొండలు ప్రాంతంలో మృత్యుగంటలు మోగాయి.. అప్పటి వరకు ఆనందడోలికల్లో తేలియాడిన వారంతా ఆర్తనాదాల్లో మునిగిపోయారు.. ప్రకృతి ఒడిలో మైమరచి ఉన్న వారంతా తేరుకునేలోపే బతుకులు తెల్లారిపోయాయి.. గోదారి ఒడ్డున ఉన్నవారికి టాటాలు చెబుతూనే.. తిరిగిరాని తీరాలకు వెళ్లిపోయారు.. భార్యాపిల్లల్ని కాపాడుకునేందుకు భర్త.. తమ వారిని ఒడ్డుకు చేర్చేందుకు మిత్రులు.. గోదావరిలో చెల్లాచెదురైన వారు కొందరు.. క్షణాల్లోనే జలసమాధైనవారు మరికొందరు.. గోదారి ఒడిలో సరదాగా గడిపి.. తీపి జ్ఞాపకాలతో తిరిగివెళ్దామని వచ్చి జీవన ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించడం తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోని గోదావరిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో పదుల సంఖ్యలో పర్యాటకులు గల్లంతుకాగా.. ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. మిగిలినవారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

రంపచోడవరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు రంపచోడవరంలోని ప్రాంతీయాసుపత్రికి ఆదివారం రాత్రి మాజీ హోంమంత్రి చినరాజప్ప వెళ్లారు. వార్డులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో దేవీపట్నం మండలంలో ప్రమాదంలో మృతిచెందిన వారికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించారన్నారు. అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని, మరి ఇప్పుడు ఎందుకు రూ.10 లక్షలు ప్రకటించారన్నారు. పరిమితికి మించి బోటులో పర్యాటకులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఒక వైపు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంటే పాపికొండలు ప్రయాణానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, జ్యోతుల నెహ్రూ, శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్‌లు ఉన్నారు.

బోటు ప్రమాదానికి సర్కారు నిర్లక్ష్యమే కారణం
మాజీ హోంమంత్రి చినరాజప్ప

 

అడుగడుగునా అతిక్రమణే

ఈనాడు, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో ఆదివారం పర్యాటక బోటు ప్రమాదానికి శాఖల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కృష్ణానదిలో పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. జలాల్లో నడిచే బోట్లకు ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పోర్టు యంత్రాంగం ఇవ్వాలని.. నడిచేందుకు అనుమతులు మాత్రం జలవనరులశాఖ ఇవ్వాలని నిర్దేశించింది. 1890లో పొందుపరిచిన కెనాల్స్‌, పబ్లిక్‌ ఫెర్సీస్‌ చట్టం అనుసరించి మార్గదర్శకాలు జారీచేశారు. బోటు నడిపే యాజమాన్యం ఏడాదికి ఏడాదికి లైసెన్సు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంది. వీటి పరిశీలన, అనుమతులు, భద్రతా ప్రమాణాలు సమర్థంగా అమలు చేస్తున్నారా..? లేదా..? అన్నది తనిఖీ చేసి 15 రోజుల్లో సంబంధిత అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంది.  జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల తనిఖీలు తరచూ నిర్వహించాల్సిఉంది. లైసెన్సులు పొందిన యాజమాన్యం బోటు తాజా పరిస్థితి అంచనాకు మూడు నెలలకోసారి చెకప్‌కు వెళ్లాలి. లైవ్‌ జాకెట్ల, లైఫ్‌ బాయ్స్‌ బోటులో ప్రయాణించే వారికి అనుగుణంగా అందుబాటులో ఉంచాలి. అవేవీ పూర్తిస్థాయిలో పట్టించుకోకపోవడంతో తాజా ప్రమాదానికి కారణమనే వాదన వినిపిస్తోంది.


ఉత్సాహంలో మునిగి ఉండగా..
గోదావరిలో పర్యటకులు వెళ్తున్న బోటు మునిగిన సమయంలో అందులో సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ సమయంలో ఇద్దరు డ్యాన్సర్లు లైఫ్‌ జాకెట్లు లేకుండానే నృత్యాలు చేయడం.. లోపల శీతల గదుల్లో సేదతీరుతున్నవారిలో కొందరు లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌ బాయ్స్‌ అందుబాటులో ఉంచుకోకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. గోదావరి ఉద్ధృతిని వడిని అంచనా వేయడంలో డ్రైవర్లు విఫలమవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

మా వాళ్లను చూశారా..?
తనతోపాటు వచ్చి బోటు ప్రమాదంలో గల్లంతైన మిత్రులు ఏమయ్యారో తెలియక హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో కలియతిరిగాడు. ఆసుపత్రికి వచ్చిన క్షతగాత్రుల వద్దకు వెళ్లి తమ వారి కోసం  ఆరా తీస్తూ కనిపించాడు. తమ వారి ఆనవాళ్లు చెప్పి మీరు చూశారా.. అంటూ అడగడం చూసి అక్కడి వాళ్లు చలించిపోయారు.
మునిగి పైకి తేలడం వల్లే మేమైనా బతికాం...!
కచ్చులూరు మందంలో సుడిగుండాల్లో పడిన పర్యాటక బోటు మునిగి తేలడం వల్లే కనీసం కొంతమందిమైనా బతికాం. బోటు ప్రమాదం జరిగిన సమయంలో నేను ఒక అంచువైపున ఉన్నాను. ఒక్కసారిగా బోటు సుడిగుండాల్లోకి వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో చూసేసరికే బోటు తూటుకుంట వైపు ఒరిగిపోయింది. మేమంతా బోటుతో పాటు మునిగిపోయాం. బోటు మునిగిన వెంటనే పైకి తేలడంతో బోటుకు ఇరువైపులా అంచున ఉన్నవారు. టాపుపై ఉన్నవారం నదిలోకి దూకేశాం. మేము దూకిన నిమిషాల్లో బోటు పూర్తిగా మునిగిపోయింది. లైఫ్‌జాకెట్లు, ఖాళీ నీటి టిన్నులతో బయటపడ్డారు.
-వేదుల నాగు, పోశమ్మగండి, లాంచీలో పనిచేసే వ్యక్తి.


 


 

అది అత్యంత ప్రమాదకర ప్రాంతం
మధ్యాహ్నం 12.15 గంటలకు బోటు ప్రమాదానికి గురైంది. అక్కడి నుంచి మాకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్నాం. వారిలో సుమారు 26 మందిని అతికష్టం మీద కాపాడగలిగాం. వరద పోటు అధికంగా ఉన్న సమయంలో మందంలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం. స్థానికంగా ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న మేమే ఎప్పుడూ  ఇలాంటి సమయాల్లో అక్కడకు వెళ్లం. బోటు మందం మీదుగా వెళ్లడం కారణంగానే ప్రమాదానికి గురైంది. ఒడ్డు వద్దకు చేరినప్పటికీ ముగ్గురు కొనఊపిరితో పోరాడుతూ ప్రాణాలను విడిచారు. వీరిలో లైఫ్‌ జాకెట్లు వేసుకున్నప్పటికీ  కొందరు బతకలేదు. బోటు నడుపుతున్న సరంగులు నీటిలోనే మునిగిపోయారు. వరద ఉద్ధృతి లేకుంటే మరింత మందిని కాపాడగలిగి ఉండేవాళ్లం. 
-కె.వీరచంద్రారెడ్డి
కళ్లెదుటే మునిగిపోయింది
నది ఒడ్డున చేపలు పట్టుకుంటున్నాం. అదే సమయంలో డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాపికొండలలువైపు బోటుపై పర్యాటకులు వెళ్తున్నారు. గట్టుపై ఉన్న వారు కొందరు వారికి చేతులు ఊపుతూ టాటా చెబుతున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా బోటు నీట మునగడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. మునిగిన వెంటనే బోటు పైకి లేవడంతో ప్రమాదం తప్పిందని భావించాం. కానీ ఇంతలోనే కళ్ల ఎదుటే బోటు నీట మునిగిపోయింది. వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకున్నాం. పూర్తిస్థాయిలో కాపాడలేకపోయాం.
-ఓంకార్‌, తూటుకుంట 
కళ్ల ముందే కొట్టుకుపోయారు...!
పర్యాటక బోటు వరద నీటిలో మునిగిపోయిన సమయంలో మేము గోదావరి ఒడ్డునే ఉన్నాం. కొట్టుకుపోతున్న వారంతా కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయడంతో మా గ్రామానికి చెందిన కె.వీరభద్రరెడ్డి ఇంజిను పడవపై వెళ్లి ఇద్దరిని కాపాడాడు. కచ్చులూరు నుంచి గిరిజనులు మూడు పడవలపై వెళ్లి 25 మందిని కాపాడగలిగారు. మరికొంత మంది మా కళ్ల ఎదుటే కొట్టుకుపోతున్నా, వరద ఉద్ధృతి పరవళ్లు తొక్కడంతో ఏం చెయ్యలేని పరిస్థితులు నెలకొన్నాయి.
-కోండ్ల మహేశ్వరి, తూటుకుంట
పాప బోటు చూస్తానంటే తీసుకెళ్లా..
మధ్యాహ్న సమయంలో ఫోన్‌ చేసుకోవడానికి గ్రామం నుంచి గోదావరి గట్టు వద్దకు వచ్చాం. అక్కడ మా పాప  బోటు చూస్తానంటే గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చాను. వెళ్తున్న బోటు ఒక్కసారిగా నీట మునగడంతో ఆందోళనకు గురయ్యాం. వెంటనే ఇవతల గట్టు వారితో పాటు అవతల కచ్చులూరు గ్రామానికి చెందిన వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. 
-దుర్గ, ప్రత్యక్షసాక్షి, తూటుకుంట 
వాళ్లు లేకుండా ఇంటికి ఎలా వెళ్లాలి..?
హైదరాబాద్‌ నుంచి నలుగురు మిత్రులం కలిసి వచ్చాం. ఇద్దరం ప్రాణాలతో బయటపడ్డాం. మరో ఇద్దరి ఆచూకీ లేదు. మా కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తుంటారు. ఎలా ఇంటికి వెళ్లాలి. వారికి ఏం సమాధానం చెప్పాలి. 
-జరినాకుమార్‌, వెస్టీ డిగ్రీ కళాశాల విద్యార్థి, హైదరాబాద్‌
బోటు మునిగిన ప్రాంతంలో భారీ లోతు...!
కచ్చులూరు మందం వద్ద బోటు మునిగిన ప్రాంతంలో సుమారు 150 నుంచి 200 అడుగుల వరకు లోతు ఉంటుంది. వరదల సమయంలో కచ్చులూరు- తూటుకుంటకు మధ్య ప్రయాణాలు సాగించేవారు తూటుకుంట వైపు నుంచి పాపికొండలు విహారయాత్రకు వెళ్లాలి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు కొండల మద్య నుంచి వరద ఉద్ధృతి అమిత వేగంతో ఉండడంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం జరిగిన ప్రమాదం ఇదే విధంగా జరిగింది.
-చింతలాడ గంగిరెడ్డి, తూటుకుంట
1985
శ్రీరామగిరిలో శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్తున్న బోటు ప్రమాదానికి గురైంది. 40 మంది వరకు మృత్యువాతపడ్డారు. 
1990
ఆత్రేయపురం మండల పరిధిలోని వద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంక రేవులో పడవ మునిగిపోయి పది మంది దుర్మరణం పాలయ్యారు.
1996
బోడసకుర్రు-పాశర్లపూడి వైనతేయ నదీపాయపై... కూలీలు పడవ దాటుతున్నారు. ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురు గాలులకు పడవ బోల్తా పడింది. పది మంది గల్లంతయ్యారు.
2004 
యానాం-ఎదుర్లంక వారధి కట్టక ముందు... గౌతమీ గోదావరి నదీపాయపై పడవ దాటింపుల్లో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు పది మంది మృతిచెందిన సందర్భాలున్నాయి.
2007
ఓడలరేవు-కరవాక రేవు మధ్య ప్రయాణికులతో వెళ్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ఇంజిను మరమ్మతులకు గురవడంతో గాలివాటానికి సముద్రం వైపుగా కొట్టుకుపోతుండగా మరోబోటు ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
2008
కొరుటూరు వద్ద రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాదులు పాపికొండలు విహారయాత్రకు వెళ్లిన బోటు ప్రమాదానికి గురైంది. నలుగురు యువ న్యాయవాదులు మృతిచెందారు
2009
అంతర్వేది-బియ్యపుతిప్ప మధ్యలో వశిష్ఠ సాగర సంగమం సమీపంలో పడవ మునిగిపోయి పశ్చిమ గోదావరికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
2011
దేవీపట్నం: గుంటూరుకు చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగి కుటుంబ సమేతంగా పాపికొండలు విహార యాత్రకు వచ్చారు. వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి మునిగిపోయింది. ఆ ప్రమాదంలో ఉద్యోగి గల్లంతై చనిపోగా, కుటుంబ సభ్యులను స్థానికమత్స్యకారులు కాపాడారు
2012
ఐ.పోలవరం మండల పరిధిలోని పశువుల్లంక-సలాదివారిపాలెంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోయిన ప్రమాదంలో సుమారు 40 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. 
2014
తాడివాడ వద్ద వంద మందితో వెళ్లాల్సిన పర్యాటక బోటు 136 మందితో వెళ్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. చోదకుడి స్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది.
2018
దేవీపట్నం-గండిపోశమ్మ ఆలయం మధ్య 120 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటులో తేనీరు కాస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌ మంటలు చెలరేగి అగ్నికీలలు వ్యాపించాయి. సరంగు చొరవతో పెద్ద ప్రమాదం తప్పింది.
2018
మంటూరు వద్ద సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తాపడింది. 16 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.