close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

పరుగులు తీస్తున్నారు

● కొత్త చట్టంతో కనిపిస్తున్న మార్పు

● వాహన పత్రాలు, లైసెన్సు పొందడంపై దృష్టి

● శిరస్త్రాణం వాడేవారు పెరిగారు

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, నిబంధనలు కాపాడటమే లక్ష్యంగా కేంద్రం ఇటీవల నూతన మోటారు వాహనాల చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఈ చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే.. వాహనదారుల్లో మార్పు కనిపిస్తోంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలు నిత్యం కిటకిటలాడుతుండటం ఇందుకు నిదర్శనం. మరోవైపు శిరస్త్రాణం ధరించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఒకవేళ పెరిగిన జరిమానాలు అమల్లోకి వస్తే.. మరింత మార్పు వస్తుందనే చర్చ నడుస్తోంది.

శిరస్త్రాణం ధరిస్తున్నారు

నిజామాబాద్‌లోని ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఇదివరకు ద్విచక్ర వాహనాలు ఆగితే ప్రతి పది మందిలో కనీసం ఇద్దరు కూడా శిరస్త్రాణం ధరించే వారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతి పది మందిలో 5-6 మంది శిరస్త్రాణం వినియోగిస్తున్నారు. రోజురోజుకి ఈ సంఖ్య పెరుగుతుండటం స్వాగతించాల్సిన విషయం.

● ఆగస్టు నెల వరకు ఉభయ జిల్లాల్లో రోజులో 20 వరకు శిరస్త్రాణాలు అమ్ముడుపోయేవి. ఇప్పుడు రోజులో 100కు పైగా విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

మైనర్లకు ఇవ్వట్లేదు●

చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు, కార్లు ఇవ్వకుండా పెద్దలు జాగ్రత్త పడుతున్నారు. ఇదివరకు మైనర్లు వాహనాలు నడిపితే పెద్దగా జరిమానాలు ఉండేవి కావు. ప్రస్తుతం చిన్నపిల్లలు వాహనాలు నడిపి పట్టుబడితే తల్లిదండ్రుల్ని బాధ్యులను చేస్తున్నారు. రూ.25 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడేలా చట్టాన్ని తీసుకొచ్చారు. గతంలో ఇలాంటి కేసులు ఉభయ జిల్లాలో నెలకు 3-5 నమోదయ్యేవి. గడిచిన పక్షం రోజుల్లో ఒక్క కేసు కూడా కాలేదు.

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ఇదివరకు పెద్దగా వాహనదారులు, డ్రైవర్ల రద్దీ ఉండేది కాదు. సెప్టెంబరు ఒకటి నుంచి నూతన మోటారు వాహనాల చట్టం అమల్లోకి వస్తుందనే ప్రచారంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.

స్లాట్‌ దొరకట్లే..

ఇదివరకు ఒకరోజు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొంటే స్లాట్‌ దొరికేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. కనీసం పది నుంచి పక్షం రోజుల పాటు ఆగాల్సి వస్తోంది. నిజామాబాద్‌ రవాణా శాఖ పరిధిలో స్లాట్‌కు పోటీ ఎక్కువైంది. ఇక్కడ స్లాట్‌ పొందేందుకు చాలా మంది ఆన్‌లైన్‌ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

● ఎల్‌ఎల్‌ఆర్‌కు ప్రస్తుతం రోజులో ఐదు రవాణా శాఖ కార్యాలయాల్లో కలిపి సుమారు 280 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో సిబ్బంది సేవలను సైతం పొడిగిస్తున్నారు. అదనపు సమయాన్ని తీసుకొని మరీ వచ్చిన వారందరి దరఖాస్తు ప్రక్రియను ముగిస్తున్నారు.

ఫిట్‌నెస్‌: వాహనాల ఫిట్‌నెస్‌ ప్రక్రియకు కూడా వరుస కడుతున్నారు. ఇదివరకు ఒక్కో కార్యాలయంలో సుమారు 50 వరకు దరఖాస్తులు వస్తే.. ప్రస్తుతం రెండింతలు పెరగడం గమనార్హం.

ఈ చలానాలతో మార్పు

పోలీసులు ఈ చలానాల అమల్లో భాగంగా పెద్దమొత్తంలో జరిమానాలను అమలు చేస్తున్నారు. వాహనదారులకు తెలియకుండానే చిత్రాలు తీసి జరిమానాలు వేస్తున్నారు. ఫలితంగా వాహనదారుల్లో చాలా వరకు మార్పు కనిపిస్తోంది. తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా జాగ్రత్త పడుతున్నారు.

బెల్టులు బిగిస్తున్నారు

సీటు బెల్టు లేని కార్లకు కొత్తగా వీటిని ఏర్పాటు చేయిస్తున్నారు. డ్రైవింగ్‌ చేసే వ్యక్తితో పాటు ముందుభాగంలో కూర్చున్న వారు సీటు బెల్టుని తప్పనిసరిగా ధరించాలనే నిబంధన ఉంది. ఇదివరకు దీనిపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. కొత్త చట్టంలో ఈ ఉల్లంఘన కింద జరిమానాను రూ. వెయ్యికి పెంచారు.

 

● ఉభయ జిల్లాల్లో సీటు బెల్టులను బిగించే దుకాణాల వద్ద కూడా రద్దీ పెరిగింది. సుమారు 30 దుకాణాలుండగా ఒక్కో దుకాణం వద్ద రోజులో కనీసం 20 మంది కార్ల వినియోగదారులు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం.

జరిమానాలు ఇలా..

వాహనదారులకు విధిస్తున్న జరిమానాలు సైతం రూ. కోట్లు దాటుతున్నాయి. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ చలానా కింద ఇప్పటికే రూ.5 కోట్లు దాటడం గమనార్హం. కామారెడ్డిలో రూ. 3 కోట్ల వరకు విధించి ఉంటారని సమాచారం. ఒకవేళ పెరిగిన జరిమానాలు అమలైతే.. ఈ లెక్కలు మరింత పెరుగనున్నాయి.

తాగకుండా జాగ్రత్త పడుతున్నారు

నిజామాబాద్‌ కమిషనరేట్‌, కామారెడ్డిలో నిత్యం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదివరకు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో గతంలో రూ.2 వేలు జరిమానా విధించేవారు. ప్రస్తుతం ఒక్కో కేసులో రూ.10 వేల వరకు జరిమానా వేస్తున్నారు. దీంతో చాలా వరకు మార్పు కనిపిస్తోంది. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి నిజామాబాద్‌లోని ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. దీంతో తాగి వాహనం నడపాలంటే జంకుతున్నారు.

వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదివరకు కేవలం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఎప్పుడో తీసుకొన్న వాహనాలను సైతం రిజిస్ట్రేషన్‌కు తీసుకొస్తున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు 50 శాతం మేర ఉంటున్నట్లు సమాచారం.

నిజామాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన ఆటోలు

వేగాన్ని తగ్గిస్తున్నారు

మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. పలు ప్రధాన రహదారుల్లో స్పీడ్‌ లేజర్‌ గన్‌లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి రహదారి, కామారెడ్డిలో సదాశివనగర్‌ జాతీయ రహదారిపై నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. నిర్ణీత వేగం దాటితే తక్షణమే జరిమానాలు పడుతుండడంతో వాహనాల వేగం తగ్గుతోంది.

● గడిచిన నెలరోజుల్లో నిజామాబాద్‌, కామారెడ్డిలో అధిక వేగంతో వెళ్తున్న సుమారు 400 వాహనాలకు జరిమానాలు విధించారు. ఒక్కో వాహనానికి రూ. వేయి చొప్పున మొత్తం రూ. 4 లక్షల జరిమానా విధించారు.

ఇదీ పరిస్థితి  రోజులో విక్రయాలు:

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.