close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

ఎటు చూసినా సెల్‌ మోహన రంగా!!

ప్రయాణంలో తలే ఎత్తడం లేదు..
మొబైల్‌లో ఆన్‌లైన్‌ వీక్షణతోనే కాలక్షేపం
సాయంత్రం వేళ మరింత ఎక్కువ మంది..
నగరాల సర్వేలో తేలిన సంగతులివీ..

నగరంలో గంటల పాటు బస్సులు, క్యాబ్‌లో ప్రయాణం.. ఇప్పుడు మెట్రో కూడా తోడైందనుకోండి.. గతంలో కిటికీలోంచి రహదారిపై ట్రాఫిక్‌ను పరిశీలిస్తుండేవారు. మరి కొందరు నిద్రపోయేవారు.. పరుగెడుతున్న కాలంతో పాటే అన్నీ మారుతున్నట్టే ఈ అలవాటూ మారిపోయింది.. ఇప్పుడు బయటకు చూసేవారు తగ్గిపోయారు.. ఇంకా చెప్పాలంటే అసలు తలే ఎత్తడం లేదు. మొబైల్‌ డాటా చౌక అయ్యాక.. అందరూ సెల్‌ఫోన్లలోనే తలమునకలై ఉంటున్నారు.. కాలక్షేపం, వినోదం కోసం ఆన్‌లైన్లో వీడియోలు చూసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ప్రయాణించే సమయంలో ఇయర్‌ ఫోన్స్‌, హెడ్‌ఫోన్లు వాడుతూ నచ్చిన వీడియోలను వీక్షిస్తున్నారని ప్రధాన నగరాల్లో కేపీఎంజీ చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఈనాడు, హైదరాబాద్‌

తెల్లవారింది మొదలు నగరంలో ఉరుకులు పరుగులు.. ఎక్కడో హయత్‌నగర్‌లో ఉండేవారు హైటెక్‌సిటీలో కొలువు కోసం వెళుతుంటారు.. వివిధ ఉద్యోగాల్లో ఉన్న వారు నగరంలో ఒక పక్క నుంచి మరోపక్కకు వెళుతుంటారు.. బీహెచ్‌ఈఎల్‌లో నివాసముంటూ ఇబ్రహీంపట్నంలో కళాశాలకు వెళ్లే విద్యార్థులు.. ఇలాంటి వారంతా నిత్యం గంటల సమయం ప్రయాణమంటే బోర్‌గా భావిస్తున్నారు. అందుకే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల నడమ ప్రయాణంలో ఆన్‌లైన్లో వీడియోలు వీక్షణం అధికంగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. 12 శాతం మంది ఈ సమయంలోనే చూస్తున్నారు. అన్ని వృత్తుల వారు వీక్షిస్తున్నవారిలో ఉండటం చెప్పుకోతగ్గ పరిణామం. సాయంత్రం ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువ.. అధిక సమయం ప్రయాణంలో గడపాల్సి వస్తోంది. పైగా అలసిపోయి ఉంటారు కాబట్టి మొబైల్‌లో వీడియోలను ఉదయంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో చూస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల ప్రాంతంలో 29 శాతం మంది ఆన్‌లైన్లో వీడియోలను వీక్షిస్తున్నారు. యూ ట్యూబ్‌లో వీడియోలతో పాటు ఓవర్‌ ది టాప్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌, జీ5, హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటూ కొత్తగా వచ్చిన మరిన్ని వేదికల్లో వీక్షిస్తున్నారు.

30 శాతం రోజూ  చూస్తున్నారు..
థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలో వారం, నెలకో సినిమా చూస్తుంటారు.. టీవీల్లో వారాంతాల్లో, వీలు కుదిరినప్పుడో, నచ్చిన సినిమా వచ్చినప్పుడో చూస్తుంటారు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక రోజూ సినిమాలు చూస్తున్నారు. సినిమాలు, సినిమా ఆధారిత వీడియోలను 30 శాతం వరకు ఓవర్‌ ది టాప్‌(ఓటీటీ) యాప్‌లపై రోజూ వీక్షిస్తున్నారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతా వంటి మెట్రోలతో పాటు బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, అహ్మదాబాద్‌, జైపూర్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో చేసిన సర్వే చెబుతోందిదే.....

70నిమిషాలు.. సగటున రోజూ యాప్‌ల్లో వీడియోలు వీక్షిస్తున్న సమయం
29 శాతం.. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య వీక్షిస్తున్నవారు
14 శాతం.. రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటలలోపు వీక్షించేవారు
78 శాతం.. సినిమా వీక్షణే తొలి ప్రాధాన్యం అంటున్నవారు

మాతృభాషకు మొగ్గు..
ఆన్‌లైన్లో హిందీ, ఇంగ్లిష్‌ వీడియోలు ఉన్నా.. మాతృభాషలో కంటెంట్‌ ఉన్న వీడియోలను ఎక్కువ మంది చూసేందుకు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లో ఆన్‌లైన్లో చూస్తున్నవారిలో 71 శాతం మంది తెలుగు వీడియోలకే మొగ్గు చూపుతున్నారు. 22 శాతం మంది ఇంగ్లిష్‌లో చూస్తున్నారు. చెన్నైలో తమిళమే కావాలనే వారు 90 శాతం మంది ఉన్నారు. బెంగళూరులో కన్నడంపై మొగ్గు చూపుతున్నవారు 91 శాతం మంది ఉన్నారు.

వారంలో 8 గంటలు..
ఆన్‌లైన్లో వీడియోలను చూస్తున్నవారిలో 15 ఏళ్ల నుంచి 50 ఏళ్లు దాటినవారు ఉంటున్నారు. సగటున ఇంచుమించు వీక్షణ సమయం ఒకేలా ఉంది. వారంలో 8 గంటల సమయం వినోదానికే వెచ్చిస్తున్నారు. విజ్ఞానం కంటే కాలక్షేపానికే ఎక్కువమంది చూస్తుండటంతో సమయంతో పాటూ జేబుకు చిల్లు పడుతోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.