close

సోమవారం, అక్టోబర్ 14, 2019

ప్రధానాంశాలు

విస్తరించలేం.. తొలగించండి!

బృహత్తర ప్రణాళిక-2031లో అయోమయ రోడ్లు
తొలగిస్తే ప్రత్యామ్నాయం చూస్తామంటోన్న బల్దియా
అనుమతి కోసం సర్కారుకు లేఖ

బృహత్తర ప్రణాళిక-2031లోని రహదారులు ‘తాను దూర సందులేదు.. మెడకో డోలు’ అన్న సామెతను తలపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, స్థానికుల అభిప్రాయం తీసుకోకుండా అధికారులు మాస్టర్‌ప్లాన్‌లో విస్తరించాల్సిన రోడ్లను ఎంపిక చేశారు. గూగుల్‌ పటాలను ముందుంచుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా వెడల్పును నిర్ధరించారు. వాస్తవాన్ని పరిశీలిస్తే.. అధికారులు రోడ్డుగా చెప్పిన ప్రాంతాల్లో కాలనీలు ఉన్నాయి. 60 అడుగుల రోడ్డు అవసరమున్న చోట 15 అడుగుల రోడ్డుతో బస్తీలు నిర్మాణమయ్యాయి. రైలు పట్టాల వెంట 100 అడుగుల రోడ్డును ప్రతిపాదించగా.. అక్కడ పది అడుగుల రోడ్డునూ నిర్మించలేని దుస్థితి ఉంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అధికారికంగా ఇళ్లు నిర్మించుకోలేక అప్రయత్నంగా అక్రమ నిర్మాణాలకు పాల్పడాల్సి వస్తుంది. సమస్యను గుర్తించిన ప్రణాళిక విభాగం ప్రాథమికంగా 15 రోడ్డు మార్గాలను మాస్టర్‌ప్లాన్‌ నుంచి తొలగించాలని కోరుతూ సర్కారుకు ఇటీవల లేఖ రాసింది.

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ మహానగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. జనావాసాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు నగరానికి అవసరమైన మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆ శాఖ 2031కి నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలనే అంశంపై ప్రణాళిక రూపొందించింది. అదే బృహత్తర ప్రణాళిక-2031. అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రణాళిక లోపభూయిష్టంగా రూపుదిద్దుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల సర్వే నెంబర్లు పెద్దయెత్తున గల్లంతయ్యాయి. సుమారు 70వేల సర్వే నెంబర్లు మాస్టర్‌ప్లాన్‌లో కనిపించవు. వాటిని చేర్చేందుకు హెచ్‌ఎండీఏ గతంలో ప్రయత్నం చేసింది. మొదటి దశలో 35వేల సర్వే నెంబర్లు, రెండో దశలో మిగిలిన సగం నెంబర్లను ప్రణాళికలో పొందుపరిచేందుకు మునుపటి కమిషనర్‌ కసరత్తు చేశారు. రహదారుల నిర్ధరణలోనూ లోపాలు కనిపిస్తున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేసిన ఏజెన్సీలు గూగుల్‌ పటాలను ముందుంచుకుని అవసరమైన దిశలో రోడ్లను డిజైన్‌ చేశాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఖాతరు చేయలేదు. ఫలితంగా కాలనీల మీదుగా రోడ్లు వెళ్తున్న డిజిటల్‌ పటాలు భవన నిర్మాణ అనుమతుల సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం అయింది. మరిన్ని దోషాలతో కూడిన డిజిటల్‌ పటాలు.. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యేట్లు చేస్తున్నాయి. ఎందుకంటే.. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేపట్టదలచిన ప్రాంతంలో విశాలమైన రోడ్డును నిర్మించాల్సి ఉంది. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న సమస్య అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దాంతో స్థానికులు అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. దీని వల్ల బల్దియా ఆదాయానికి గండి పడుతోంది. అటు పౌరులు అసౌకర్యానికి గురవుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చొద్దంటూ స్థానిక నేతలు, అధికారులకు ముడుపులు చెల్లించుకుంటున్నారు. నగరంలో అలాంటి సమస్య చాలా ప్రాంతాల్లో ఉంది.

ఉదాహరణలు..
* సీతాఫల్‌మండి నామాలగుండు ప్రాంతంలోని శ్రీదేవీ నర్సింగ్‌ హోమ్‌ ఎదురుగా ప్రస్తుతం 15 అడుగుల రోడ్డుంది. మాస్టర్‌ప్లాన్‌లో దాన్ని 30 అడుగుల రోడ్డుగా చూపించారు. ఇప్పటికే అక్కడ ఖాళీ స్థలం లేకుండా నిర్మాణాలు వెలిశాయి. ఒకటి, రెండు అంతస్తుల భవనాలున్నాయి. పలువురు పాత ఇళ్లను కూల్చి అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. నిర్మాణ అనుమతి తీసుకుందామంటే మాత్రం కుదరని పరిస్థితి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం 30అడుగుల రోడ్డుకు, అదనంగా సెట్‌బ్యాక్‌కు స్థలం వదలాల్సి ఉంటుంది.
* ముషీరాబాద్‌ ప్రధాన మార్గం నుంచి బోలక్‌పూర్‌ వెళ్లే రోడ్డు(మల్లిఖార్జున స్వామి టెంపుల్‌ వీధి) మాస్టర్‌ ప్లాన్‌లో ఉంది. క్షేత్రస్థాయిలో చూస్తే వీధితో బోలక్‌పూర్‌ రోడ్డుకు సంబంధం లేదు. వీధి చివర్లో రోడ్డు 10అడుగులకు కుంచించుకుపోయి ఉంది. ప్రణాళిక ప్రకారం దాన్ని 60 అడుగుల మేర విస్తరించాలంటే పదుల కొద్దీ భవంతులను నేలమట్టం చేయాలి.
* ఇవేగాక.. నగరవ్యాప్తంగా కొన్ని వందల రోడ్లు సమస్యాత్మకంగా మారాయి. బోరబండ రైలు పట్టాల వెంట వంద అడుగుల రోడ్డును నిర్మించాలంటే.. కాలనీలకు కాలనీలను తొలగించాలి. అధికారులు వాస్తవాలను చూడకుండా డిజిటల్‌ పటాలతో భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడం వల్ల.. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఇళ్లను అక్రమంగా నిర్మించుకోవడం తప్పనిసరి అయ్యింది.

15 రోడ్లను గుర్తించిన బల్దియా..
బృహత్తర ప్రణాళిక ప్రకారం రోడ్లను విస్తరించేందుకు అవకాశం లేని 15 రోడ్లను బల్దియా తాజాగా గుర్తించింది. వాటి వివరాలను ప్రభుత్వానికి చేరవేసింది. ఆయా రోడ్డు మార్గాలను ప్రణాళిక నుంచి తొలగించాలని, వాటికి ప్రత్యామ్నాయం చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. త్వరలో సర్కారు నుంచి ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సర్కారు ఆదేశిస్తే.. మాస్టర్‌ప్లాన్‌ రోడ్లపై మరోసారి సమీక్ష చేస్తామంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.