close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

మూగజీవాలకు రాజభోగం

నూతన సంరక్షణాలయంలో సకల సౌకర్యాలు
వీధి శునకాలు, వానరాలు, పశువులకూ ఆశ్రయం
రోజుకు 30 చొప్పున శస్త్రచికిత్సలు

నాగోలు, న్యూస్‌టుడే: నగర వీధుల్లో సంచరించే మూగ జీవాల కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అధునాతన సంరక్షణాలయం నాగోలు డివిజన్‌ ఫతుల్లాగూడలో ఏర్పాటైంది. ఇటీవలే రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి చేతులమీదుగా ప్రారంభమైంది. గతంలో డంపింగ్‌ యార్డుగా ఉన్న అయిదెకరాల విశాలమైన ఇక్కడి ప్రభుత్వ స్థలంలో రూ.5.50 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో దీనిని నిర్మించారు. ఈస్జ్‌జోన్‌లోని ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, కాప్రా సర్కిళ్లకు చెందిన వీధుల్లో తిరుగుతూ సమస్యగా మారే శునకాలను ఇక్కడికి తరలించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలతోపాటు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లు ఇచ్చి తిరిగి ఆయా ప్రదేశాల్లో వదిలివేసే పనిని ఈ సంస్థ చేపడుతుంది. వీటితోపాటు జనావాసాల్లోకి వచ్చే కోతులను సైతం తరలించేందుకు కృషిచేస్తుంది. యజమానుల పర్యవేక్షణ లేకుండా రోడ్డుపై అడ్డంగా తిరిగే పశువులనూ ఈ సంరక్షణాలయానికి తరలిస్తారు. యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా నియమాలను అనుసరించి ఏర్పాటైన ఈ యానిమల్‌ కేర్‌ సెంటర్‌లో కుక్కలను ఉంచేందుకు నివాసయోగ్యమైన 250 గదులు (కెన్నెల్స్‌), 100 చొప్పున పశువులు, కోతులు ఉండేందుకూ విశాలమైన షెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ నిత్యం సరిపడా గడ్డి, ఇతర దాణా లభించేలా ఏర్పాట్లున్నాయి. డిప్యూటీ డైరక్టర్‌ సుఖ్‌నందన్‌రెడ్డి, అసిస్టెంట్‌ డైరక్టర్‌ రామకృష్ణారావు, వెటర్నరీ అధికారి డాక్టర్‌ సబితతోపాటు మరో ముగ్గురు వైద్యులు ఇక్కడి అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌లో అందుబాటులో ఉంటారు. మేనేజర్‌తోపాటు సుమారు 50మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన ఆపరేషన్‌ థియేటర్లో శస్త్రచికిత్సలు చేస్తుంటారు. కుక్కలు కోలుకునేంతవరకు వాటి బాగోగులకు ఢోకా లేకుండా చూసుకునే ఏర్పాటుచేశారు.

శస్త్రచికిత్స చేసి..
ప్రస్తుతం ఈ సెంటర్‌కి నిత్యం 50 వీధికుక్కలను తరలిస్తున్నారు. రోజుకు 30చొప్పున శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత అయిదేళ్లుగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని వీధి కుక్కల విషయంలో తీసుకుంటున్న చొరవతో రేబీస్‌ వ్యాధి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకొని వేరే ఎక్కడో వదిలేసే ప్రశ్నే ఉండదని.. వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసి, యాంటీ రేబిస్‌ టీకావేసి తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడతామంటున్నారు అధికారులు. తమ పరిసర ప్రాంతాలను స్వచ్ఛంగా ఉంచుకోవడంతోపాటు వదిలేసిన ఆహారాన్ని వీధుల్లో పారేయకుండా ఉంటే వీధి కుక్కల సమస్యను చాలావరకు ప్రజలే పరిష్కరించుకోగలుగుతారని వారు పేర్కొంటున్నారు. ఈస్ట్‌జోన్‌ పరిధిలోని వీధి కుక్కల సమస్యలను 040- 21111111 నంబరుకు ఫోను చేసి తెలపాలని కోరారు.

మున్ముందు మూగజీవాల అంత్యక్రియలూ..
గతంలో ఆటోనగర్‌లోని డంపింగ్‌ యార్డు స్థలంలో వసతుల్లేకుండా నిర్వహించిన ఈ సంరక్షణాలయాన్ని అప్పట్లో కేంద్ర మంత్రి మేనకాగాంధీ సందర్శించారు. యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా నియమాలను అనుసరించి వసతులతో సంరక్షణాలయాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. మూడేళ్లక్రితం నగరంలోని సెంట్రల్‌జోన్‌లోని అలీకేఫ్‌ సమీపంలో, అయిదేళ్లక్రితం పాతబస్తీలోని చుడీబజార్‌లో యానిమల్‌ కేర్‌సెంటర్లు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌ పరిధిలోని గాజుల రామారంలోనూ నూతనంగా ఓ సంరక్షణాలయం నిర్మాణంలో ఉంది. దేశంలోని పలు నగరాల్లోనూ ఈ కేర్‌ సెంటర్లు నడుస్తున్నాయి. కాగా ఫతుల్లాగూడలోనిది అయిదెకరాల్లో విశాలంగా నిర్మించారు. భవిష్యత్తులో ఇక్కడ దహన వాటికలు సైతం నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నగరంలోని పెంపుడు కుక్కలకు ఈ దహన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశమూ కల్పించనున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.