close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

స్వచ్ఛతలో విద్యార్థుల పాత్ర కీలకం

మేయర్‌ బొంతు రామ్మోహన్‌

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: స్వచ్ఛత కార్యక్రమంలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. ఐటీసీ వావ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ విద్యాలయ’ కార్యక్రమాన్ని బుధవారం జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో మార్పు తీసుకొస్తే వారి ఇంటితోపాటు పరిసరాలు, ఆ కాలనీలోనూ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. నగరంలో 20 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేసినా అంతా పరిశుభ్రంగా మారాలంటే కష్టమన్నారు. మన ఇంటితోపాటు పరిసరాలు, వీధులు, కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం అక్కడ ఉండే ప్రజలదేనన్నారు. పరిసరాల పరిశుభ్రతతో వైరల్‌ జ్వరాలు వ్యాప్తి చెందవన్నారు. విద్యాసంస్థల్లో ఎవరికి వారు స్వచ్ఛదూత్‌లుగా పనిచేయాలని సూచించారు. జపాన్‌, సింగపుర్‌ వంటి దేశాలలో రోడ్లపై చెత్త వేస్తే జరిమానా, జైలుశిక్ష అమలు చేస్తారన్నారు. అలా నిర్బంధ నిర్ణయాలతో కాకుండా ప్రజలే స్వచ్ఛందంగా పరిశుభ్రతను పాటించేలా ముందుకొస్తే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. 40 వేల పాఠశాలలు, 11 యూనివర్సిటీలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యాసంస్థ స్వచ్ఛత విషయంలో 37 అంశాలను పాటించేలా చూడాలన్నారు. ‘స్వచ్ఛ విద్యాలయ’ పర్యవేక్షణకు వాలంటీర్లను నియమించాలన్నారు. పాఠశాలలకు రేటింగ్‌ ఇచ్చి పోటీతత్వాన్ని పెంచి మంచి ఫలితాలు రాబట్టాలని చెప్పారు. రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జడ్సీలు.. వి.మమత, దాసరి హరిచందన, ఐటీసీ వావ్‌ క్లబ్‌ సీనియర్‌ మేనేజర్‌ ఉమాకాంత్‌, ఐటీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా రీసైక్లింగ్‌, వ్యర్థాల నిర్వహణలో ముందు వరుసలో నిలిచిన 17 పాఠశాలలు, 16 మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. వ్యక్తిగత అవార్డుల కింద విద్యార్థులకు సైకిళ్లు, ఆడుకునే స్కూటీలు అందజేశారు.

మూసాపేట సర్కిల్‌కు స్వచ్ఛత అవార్డు
మూసాపేట సర్కిల్‌ను స్వచ్ఛత అవార్డుకు ఐటీసీ వావ్‌ క్లబ్‌ ఎంపిక చేసింది. పారిశుద్ధ్య నిర్వహణ, తడి, పొడి చెత్త వేరు చేయడంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి చేతుల మీదుగా కూకట్‌పల్లి జడ్సీ వి.మమత, మూసాపేట సర్కిల్‌ ఉపకమిషనర్‌ మోహన్‌రెడ్డి అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు.

వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు
మాదన్నపేట, న్యూస్‌టుడే: నగరంలోని బస్తీల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. బుధవారం యాఖుత్‌పురా నియోజకవర్గం తాలాబ్‌ చంచల్‌ డివిజన్‌కు చెందిన ఓవైసీ ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న  హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ వైద్య శిబిరాలను స్థానికులు వినియోగించుకోవాలని సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో యాఖుత్‌పురా శాసనసభ్యుడు అహ్మద్‌ పాషా ఖాద్రి, దక్షిణమండలం జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, సంతోష్‌నగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ అలువేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.