close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

ఆ లక్ష గజాలూ..అమ్మేద్దాం!

తాజా బడ్జెట్‌లో హెచ్‌ఎండీఏకు ‘మహా’ నిరాశ ఫలితం
ఓఆర్‌ఆర్‌ చెల్లింపులు, ప్రగతి ప్రాజెక్టుల కోసం.. ‘ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల’పై చూపు
ఈనాడు, హైదరాబాద్‌

రోసారి ఈ-వేలానికి హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సన్నద్ధమవుతోంది. ఉప్పల్‌ భగాయత్‌లో ఫేజ్‌-1 కింద అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో మిగిలిపోయిన లక్ష చదరపు గజాల స్థలాన్ని విక్రయించేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. ముందుగా కోకాపేట్‌ భూములను విక్రయించాలని భావించినా, తాజా పరిస్థితుల కారణంగా అధికారులు ఉప్పల్‌ భగాయత్‌ భూములపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

2005లో 733 ఎకరాలు..
భూ సమీకరణ పథకం(ల్యాండ్‌ పూలింగ్‌) కింద 2005లో ఉప్పల్‌ భగాయత్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో 733 ఎకరాలను సేకరించారు. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి ఎస్టీపీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత భూమిని కేటాయించారు. ఫేజ్‌-1 కింద సకల సౌకర్యాలతోనూ 8.84 లక్షల చదరపు గజాల విస్తీర్ణమున్న భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. 2017లో- భూములు అప్పగించిన రైతులకు నష్టపరిహారం కింద 7.58 లక్షల చదరపు గజాలను కేటాయించారు. ఇవి పోను ఆ లేఅవుట్‌లో మిగిలిపోయిన ప్లాట్లను అలాగే వదిలేశారు. ఫేజ్‌-2 కింద 67 ప్లాట్లతో(1.25 లక్షల చదరపు గజాల విస్తీర్ణం) మరో లేఅవుట్‌ను అభివృద్ధి చేసి, ఈ-వేలం ద్వారా విక్రయించారు. ఇంకా 120 ఎకరాల వరకు హెచ్‌ఎండీఏ వద్దనే అందుబాటులో ఉంది.

కోకాపేట ఆదాయం ప్రభుత్వానికే
అభివృద్ధి ప్రాజెక్టులను పట్టాలకెక్కించేందుకు సొంతంగా నిధులు సమకూర్చుకునేలా హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి భూములను సేకరించి, లేఅవుట్లుగా అభివృద్ధి చేసీ విక్రయించాలని భావించారు. ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను జారీచేసినా, పెద్దగా స్పందన లేదు. హెచ్‌ఎండీఏకు వేలాది ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉంది. ‘రియల్‌’ వ్యాపారం మూడు పూలూ ఆరు కాయలుగా సాగుతున్న ప్రాంతాల్లోని భూములను విక్రయించాలని నిర్ణయించారు. అన్నింటికంటే ముందుగా కోకాపేట్‌లో 146 ఎకరాలు అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భూములను అమ్మితే వచ్చే రూ.4వేల కోట్ల సొమ్మును  ప్రభుత్వం తీసుకుంటుందంటూ సంస్థ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాజా బడ్జెట్‌లో హెచ్‌ఎండీఏకు నిరాశే ఎదురైంది. రూ.1300 కోట్లు అడిగితే ప్రభుత్వం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకుంది. అభివృద్ధి పనుల సంగతి సరే.. ఏటా ఓఆర్‌ఆర్‌ గుత్తేదారు, జైకా రుణ వాయిదాలు, నిర్వహణ కోసం రూ.700 కోట్ల దాకా అవసరమవుతాయి. ఈ డబ్బును ఎక్కడి నుంచి తేవాలంటూ సంస్థ అధికారులు ఆలోచనలో పడ్డారు.

ఆర్థిక కష్టాలు అధిగమించే యత్నం
ఓఆర్‌ఆర్‌పై టోల్‌ రుసుం వసూలు బాధ్యతను హెచ్‌ఎండీఏ ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించింది. సదరు సంస్థ ఏటా రూ.250 కోట్లకు పైగా చెల్లిస్తోంది. ఈ లెక్కన చూస్తే హెచ్‌ఎండీఏకు ఇంకా రూ.400 కోట్ల వరకు అవసరమవుతాయి. అందుకే అధికారుల చూపు ఉప్పల్‌ భగాయత్‌ భూములపై పడింది. కొన్ని నెలల కిందట ఫేజ్‌-2 లేఅవుట్‌లోని 67 ప్లాట్లను విక్రయిస్తే రూ.677 కోట్ల ఆదాయం సమకూరింది. సగటున ఒక్కో గజం రూ.51వేలకు అమ్ముడైంది. మెట్రో రాకతో ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో రియల్‌ వ్యాపారం పుంజుకుంది. ఇదే నేపథ్యంలో ఫేజ్‌-1 లేఅవుట్‌లో మిగిలిపోయిన లక్షకు పైగా చదరపు గజాలను ఈ-వేలం ద్వారానే విక్రయించాలని నిశ్చయించుకున్నారు. ఇందులో 200 గజాల నుంచి 2వేల గజాల వరకు ప్లాట్లున్నాయి. మరింత డిమాండ్‌కు అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కనే రూ.600 కోట్లు సమకూరుతాయన్న ఆశాభావంతో ఉన్నారు. మరి ఓఆర్‌ఆర్‌ చెల్లింపులు పోను మిగిలిన మొత్తంతో అభివృద్ధి ప్రాజెక్టు పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మిగిలిన 120 ఎకరాల్లోనూ లేఅవుట్‌ అభివృద్ధి ప్రణాళికలు వేస్తున్నామంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.