close

సోమవారం, అక్టోబర్ 14, 2019

ప్రధానాంశాలు

కదిలిన బల్దియా!

పారిశుద్ధ్యం, దోమల నివారణ చర్యలపై ఉన్నతాధికారుల తనిఖీ
ఈనాడు కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌, ఆసిఫ్‌నగర్‌: మహానగరంలోని పారిశుద్ధ్య లోపాలపై జీహెచ్‌ఎంసీ స్పందించింది. విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను తనిఖీ చేశారు. మంగళవారం ‘ఈనాడు’లో ‘ఆరోగ్యానికి అవినీతి దోమకాటు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ తక్షణ చర్యలకు ఆదేశించారు. అందులో భాగంగా పారిశుద్ధ్యం, రెవెన్యూ, ఆరోగ్యం, ఐటీ, ఆర్థిక విభాగాల అదనపు కమిషనర్లు, ఆరుగురు జోనల్‌ కమిషనర్లు, 30 మంది ఉపకమిషనర్లు ముమ్మర పర్యటనలు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలను పరిశీలించి పాఠశాలల్లో విద్యార్థులకు దోమల నివారణపై అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య కార్మికుల బయోమెట్రిక్‌ హాజరును, పనిచేస్తున్న ప్రాంతాల్లోని పరిస్థితులు, చెత్తకుప్పలను పరిశీలించారు. నాంపల్లి, కార్వాన్‌ తదితర ప్రాంతాల్లో అదనపు కమిషనర్‌ శృతిఓజా సుడిగాలి పర్యటన చేశారు. చెత్తకుప్పల్లో వ్యర్థాలు విసురుతున్నవారిని ప్రశ్నించారు. బస్తీలు, కాలనీల విషయంలో వర్షాకాలంలో తలెత్తే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు సూచించారు. నీటి వృథా, ప్లాస్టిక్‌ వినియోగం, బహిరంగ స్థలాల్లో చెత్తను వేయడంపై అదనపు కమిషనర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ స్థానికులతో మాట్లాడారు. అసిఫ్‌నగర్‌, విజయనగర్‌కాలనీలో కార్మికుల పనితీరును పరిశీలించారు. మైదానాలు, ఈతకొలను, మార్కెట్లు, బస్టాపుల్లో అధ్వాన పారిశుద్ధ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లేపల్లి సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల, నైస్‌ హైస్కూల్‌, అన్వర్‌ ఉల్‌ ఉన్‌ కళాశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను మెరుగుపరచాలన్నారు. దోమల నివారణ విభాగం సిబ్బందితో కలిసి అంబర్‌పేట సర్కిల్‌లోని నారాయణగూడ, హైదర్‌గూడ, చిక్కడపల్లి, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో అదనపు కమిషనర్‌ సిక్తాపట్నాయక్‌ పర్యటించారు. కిషన్‌బాగ్‌, నంది మస్లాయిగూడ, పురానాపూల్‌, పత్తర్‌గట్టి తదితర ప్రాంతాల్లో అదనపు కమిషనర్‌ సందీప్‌కుమార్‌, కాప్రా సర్కిల్‌లోని చర్లపల్లి, కుషాయిగూడ, మౌలాలి డివిజన్లలో ఏసీ జయరాజ్‌కెనడి తనిఖీలు నిర్వహించారు. జోన్ల పరిధిలో సంబంధిత జోనల్‌ కమిషనర్లు ఉపకమిషనర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.