close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

బోధన సిబ్బంది కొరత..

ప్రత్యేకత కోల్పోతున్న ఓయూ
న్యూస్‌టుడే, ఉస్మానియా యూనివర్సిటీ

వందేళ్ల యూనివర్సిటీ.. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ.. నేడు అధ్యాపకుల కొరతతో ఉనికి కోల్పోయే దిశగా అడుగులు వేస్తోంది. లక్షల మంది తెలంగాణ యువత భవిష్యత్తును నిర్మించాల్సిన యూనివర్సిటీలో ప్రస్తుతం అరకొర అధ్యాపకులతో తరగతులను నిర్వహిస్తున్నారు. దేశంలో ఏడో పురాతన విశ్వవిద్యాలయం.. న్యాక్‌ ఏ+ యూనివర్సిటీ విత్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ (యూపీఈ) పొంది.. రూసా పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లను సాధించింది. అంతటి ప్రతిష్ఠను సొంతం చేసుకున్న  వర్సిటీకి ఆచార్యుల కొరత శరాఘాతంగా మారబోతోంది. విశ్వవిద్యాలయం ప్రతిష్ఠ పెరగాలంటే అధ్యాపకులు కీలకం. కనీసం ప్రతి విభాగానికి కావాల్సిన పోస్టుల్లో సగంకూడా భర్తీ చేయలేదు. ఉన్న వారిలో చాలా మంది పదవీవిరమణ పొందనుండడంతో దేశవ్యాప్తంగా ఓయూ ర్యాంకు అధఃపాతాళానికి పడిపోనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
* యూనివర్సిటీలో మొత్తం 62 విభాగాల్లో  1267 మంది అధ్యాపకులు ఉండాలి.  458 మందే ఉన్నారు. మిగిలిన 809 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2005లో ప్రొ.ఆనందకృష్ణన్‌ కమిటీ సిఫారసుల మేరకు 2005 వరకు ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకొని 294 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2007, 2013లలో పోస్టులను భర్తీ చేశారు. 2005 తర్వాత నుంచి పదవీవిరమణ చేసిన వారి స్థానంలో కొత్తగా భర్తీ చేయలేదని ఓ సీనియర్‌ ఆచార్యుడు ఆవేదన వ్యక్తం చేశారు.
* 5 సబ్జెక్టులకు అసలు అధ్యాపకులే లేరు. 6 సబ్జెక్టులకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. 9 సబ్జెక్టులకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. 17 సబ్జెక్టులకు ముగ్గురు నుంచి ఐదుగురు అధ్యాపకులే ఉన్నారు.
* సిద్దిపేట, నర్సాపూర్‌, జోగిపేట పీజీ సెంటర్లలో 75 అధ్యాపకులు ఉండాలి. ఒక్కరూ లేరు. ఒప్పంద అధ్యాపకులతోనే తరగతులను నిర్వహిస్తున్నారు. జోగిపేటలోని ఇంగ్ల్లిష్‌, లైబ్రరీసైన్స్‌, గణితం, నర్సాపూర్‌లోని గణితం, జర్నలిజం విభాగాల్లో కనీసం ఒక ఒప్పంద అధ్యాపకుడైనా లేడు. పార్ట్‌టైమ్‌ అధ్యాపకులతో కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. నిజాం, కోఠి మహిళా కళాశాల, సికింద్రాబాద్‌ పీజీ కళాశాలల్లో పలు విభాగాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు లేరు. ఒప్పంద అధ్యాపకులతోనే కొనసాగిస్తున్నారు.
* మొత్తం 152 ఆచార్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పరిశోధనపై తీవ్ర ప్రభావం
అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటి ప్రభావం పరిశోధనపై పడుతోంది. యూజీసీ నిబంధనల ప్రకారం ఓ అధ్యాపకుడు 8 మంది పరిశోధక విద్యార్థులకు గైడ్‌గా పనిచేసే అవకాశం ఉంది. దీంతో ఖాళీగా ఉన్న 809 మంది దాదాపు 6,400 మందికిపైగా పరిశోధక విద్యార్థులకు అడ్మిషన్‌ ఇచ్చే అవకాశం ఉంది. అధ్యాపకుల కొరతతోనే పీహెచ్‌డీ అడ్మిషన్‌లలో అన్ని వర్సిటీలలో గొడవలు జరుగుతున్నాయి. గైడ్‌ చేయడానికి అధ్యాపకులు లేకపోవడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు రావడం లేదు. అనేక విభాగాల్లో తరగతులు సరిగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నుంచి 415 పోస్టుల భర్తీకి అనుమతి వచ్చిందని రిజిస్ట్రార్‌ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ‘ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’లో ఓయూ ఎంపిక కాకపోవడానికి ప్రధాన కారణం నాణ్యమైన పరిశోధన ఫలితాలు లేకపోవడమేనని ఓ ఆచార్యుడు అభిప్రాయపడ్డారు.

తక్షణమే అధ్యాపకుల భర్తీ చేపట్టాలి
-ప్రొ.భట్టు సత్యనారాయణ, తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌
1603 మంది అధ్యాపకులు అవసరమని 2016లో యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దానికి అనుగుణంగా తక్షణం అధ్యాపకుల భర్తీ చేపట్టాలి. దీంతోపాటు యూజీసీ నిబంధనల ప్రకారం అధ్యాపకుల పదవీవిరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రంలోని యూనివర్సిటీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.