close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

మన్నెం పెద్దాసుపత్రికి పెద్ద దిక్కేది

కోటిరెడ్డి బదిలీతో సూపరింటెండెంట్‌ పోస్టు ఖాళీ

ఇక్కడ విధుల్లో చేరిన డీసీహెచ్‌ఎస్‌

అందుబాటులో ఉండే వారి కోసం అన్వేషణ

వేతనాలు అందక మానేస్తున్న సిబ్బంది

భఫద్రాచలం, న్యూస్‌టుడే

న్యం కేంద్రమైన భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ పోస్టును అందుబాటులో ఉండే వారితో భర్తీ చేయాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సూపరింటెండెంట్‌గా సుదీర్ఘ కాలం ఇక్కడ విధులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు డా.కోటిరెడ్డి బదిలీ కావడంతో ఈ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రమేశ్‌కు డీసీహెచ్‌ఎస్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించడంతో పాటు భద్రాచలం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ విధులను కేటాయించారు. ఈయన ఇప్పటికే ఇక్కడ విధులు తీసుకున్నారు. ఒక్కరే మూడు కీలక విభాగాలను చూడటం మాటలు కాదు. ఈయన కూడా ఇక్కడ అర్హులైన వైద్యులకు సూపరింటెండెంట్‌ విధులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో ఎవరిని ఈ పోస్టు వరిస్తుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. డా.కోటిరెడ్డి గతంలో కొంతకాలం సెలవుల్లో ఉన్నప్పుడు ఎముకల వైద్యుడు డా.దేవరాజ్‌ ఈ సీటు దక్కించుకున్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్‌ చేపట్టిన ఆకస్మిక తనిఖీల కారణంగా పని చేసే సమయంలో సదరు వైద్యుడు అందుబాటులో లేరన్న కారణంతో క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నారు. మరో సర్జన్‌ డా.రామకృష్ణ ఇదే కారణంతో విధులకు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇద్దరు ఉంటే ఎవరో ఒక్కరు సూపరింటెండెంట్‌గా చేరే వీలుండేదని అనుకుంటున్నారు.

ఆ వైద్యులపై అందరి చూపు

ఆసుపత్రిలో ఇటీవల క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సమయంలో డా.విజయ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యతలను కొద్దికాలం పర్యవేక్షించారు. ఈయన ఈ ప్రాంతానికి చెందిన వైద్యుడు కావడంతో ఈ పోస్టును ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఆర్‌ఎంవోగా డా.యుగంధర్‌ విధులు నిర్వహిస్తున్నందున ఈయన పేరు పరిశీలనలో ఉన్నట్లు వినికిడి. వీరిద్దరు ఇందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నప్పటికీ నేరుగా ఉత్తర్వులు వస్తే మాత్రం కొత్త బాధ్యతలను తీసుకుంటారని వినికిడి. ఎముకల వైద్యాధికారి డా.మురళితో పాటు మరో ఇద్దరు వైద్యుల ట్రాక్‌ రికార్డులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌ లేని వైద్యులైతే బాగుంటుందని వైద్య విధాన పరిషత్‌ భావిస్తే ఈ కోవలో ఇద్దరు నిపుణుల్లో ఒకరికి అవకాశం రావొచ్చని అనుకుంటున్నారు. కొత్తవాళ్లు వస్తారా? లేక డీసీహెచ్‌ఎస్‌నే కొనసాగిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీలోని విలీన గ్రామాలు, భద్రాచలం మన్యం వాసులకు పెద్ద దిక్కుగా ఉన్నందున వీలైనంత తొందరగా అర్హులతో సూపరింటెండెంట్‌ పోస్టును భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

జీతాలు రాక మానేస్తున్నారు

ఎముకల వైద్యం సత్వరం చేసేందుకు సీఆర్మ్‌ యంత్రం ఉన్నప్పటికీ ఇది మరమ్మతులకు గురై చాలా కాలమైంది. ఈఎన్‌టీ, కంటికి సంబంధించిన చికిత్సలు చేసేందుకు పరికరాలు లేవు. జ్వరాలు నమోదవుతున్నందున రక్త పరీక్షల నిపుణులను సరిపడా రెగ్యులర్‌ పద్ధతిలో నియమించాల్సి ఉంది. 100 పడకల నుంచి 200 పడకలుగా అప్‌గ్రేడ్‌ అవడంతో పాత ఆసుపత్రిలోని అన్ని వార్డులను ఉపయోగంలోకి తేవాల్సి ఉంది. సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. 205 పోస్టులకు 145 ఖాళీగా ఉన్నాయంటే మాటలు కాదు. సివిల్‌ సర్జన్లు 16 మందికి గాను అన్నీ ఖాళీనే. డిప్యూటీ సివిల్‌ సర్జన్లు 8కి గాను అన్నీ ఖాళీ. స్టాఫ్‌ నర్సుల పరిస్థితి మరీ ఘోరం. 53 మంది పని చేయాల్సి ఉండగా 45 పోస్టులు భర్తీ కాకపోవడం గమనించాల్సిందే. పొరుగు సేవల ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కొంతమంది స్టాఫ్‌ నర్సులు విధులకు రావడం లేదు. ఇంకొంత మంది ఇదే కోవలో ఉన్నారు. ఐసీయూలో పని చేసే 20 మందికి ఎనిమిది నెలల నుంచి వేతనాల ఊసే లేదు. వేతనాల విడుదలలో జాప్యాన్ని గుర్తించకపోతే ఇది రిఫరల్‌ ఆసుపత్రిగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించి నాణ్యమైన వైద్యాన్ని సత్వరం అందించేందుకు సూపరింటెండెంట్‌ చొరవ చూపాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.