close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

‘ఏకరూపం’.. దర్జీల ఇష్టారాజ్యం!

నెలలు గడిచినా కుట్టని వైనం

జులైలో వస్త్రం ఇచ్చినా అందని దుస్తులు

వేలాది మంది విద్యార్థులకు అసౌకర్యం

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

దుస్తులు అందని విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో పేద, ధనిక తారతమ్యం లేకుండా విద్యార్థులంతా ఏకరూప దుస్తుల్లో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఉచితంగా దుస్తులను పంపిణీ చేస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటిరోజునే వీటిని అందించాలని నిర్ణయించాయి. రెండుజతల దుస్తులతో పేద, మధ్యతరగతి కుటుంబాల చిన్నారులకు సౌకర్యంగా మారుతోంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో దుస్తులు అందించకపోవడంతో వేలసంఖ్యలో విద్యార్థులకు పాతవే దిక్కయ్యాయి. వస్త్రం సమకూర్చినా దర్జీల ఉదాసీనం, విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడడంతో ఎదురుచూపులే మిగిలాయి.

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో 1,032 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఏళ్లుగా దుస్తులను అందిస్తుండగా, గతేడాది నుంచి తొలిసారిగా 9, 10 తరగతుల్లోని విద్యార్థులకు సైతం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి 9, 10 తరగతుల్లోని వారికి దుస్తులను సిద్ధం చేసేందుకు అవసరమైన వస్త్రాన్ని పాఠశాలల వారీగా పద్దెనిమిది మండలాల ఎమ్మార్సీలకు ప్రభుత్వం జూన్‌లో సరఫరా చేసింది. అనంతరం జులైలో 1 నుంచి 8 తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి వస్త్రాన్ని పంపిణీ చేసింది.

ఇరవైరోజుల్లో అందించాల్సి ఉండగా..: విద్యాశాఖ నిబంధనల ప్రకారం వస్త్రాన్ని ఎస్‌ఎంసీ తీర్మానాల మేరకు ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల పరిధిలోని దర్జీలతో దుస్తులు కుట్టించాల్సి ఉంది. తరగతుల వారీగా విద్యార్థుల కొలతలు తీసుకున్నాక ఇరవైరోజుల్లో పాఠశాలలకు చేరవేయాలి. అందుకు ప్రభుత్వం ఒక్కో జతకు రూ.50 చొప్పున ప్రతి విద్యార్థికి రూ.100 చొప్పున కూలిని దర్జీలకు చెల్లిస్తోంది. అయితే స్థానికంగా దర్జీలు ముందుకు రావడంలేదంటూ పొరుగు జిల్లాల వారికి బాధ్యతలను కట్టబెడుతున్నారు. పదుల సంఖ్యలోని పాఠశాలల విద్యార్థులకు సంబంధించి దుస్తులను ఒకరిద్దరికి అప్పగించడంతో, నెలలతరబడి జాప్యానికి దారితీస్తోంది. వస్త్రం పొందాక ఇరవైరోజుల్లో దుస్తులు కుట్టి అందించాల్సి ఉండగా నెలలు దాటినా అందించడం లేదు. సగానికిపైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల ఒక జత అందించగా మరో జతకు 80వేలకుపైగా విద్యార్థులకు ఎదురుచూపులు మిగిలాయి. అయినా విద్యాశాఖ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఇదీ మండలాల్లో పరిస్థితి

తాండూరు మండల, పట్టణంలోని 70 పాఠశాలల్లోని 9,736మంది విద్యార్థులకు సంబంధించి వస్త్రం జులైలో సమకూర్చారు. వీటిలో ఆరు పాఠశాలలు మినహా మిగిలిన బడుల్లోని విద్యార్థుల వస్త్రాన్ని సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, హైదరాబాద్‌లోని దర్జీలకు కుట్టేందుకు అప్పగించారు. ఇప్పటివరకు దుస్తులు అందించకపోవడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. ఆగస్టు 15న జెండావందనం నాటికి కొత్త దుస్తులు అందుతాయని విద్యార్థులు భావించినా నిరాశే మిగిలింది. నాలుగు పాఠశాలలకు సంబంధించి వస్త్రాన్ని మల్కాపూర్‌లోని దర్జీకి అందించగా నెలరోజుల వ్యవధిలో కుట్టి ఆయా పాఠశాలలకు అందించారు. దీంతో మండలంలోని సంగెంకలాన్‌, కోటబాస్పల్లి, మల్కాపూర్‌, ఓగీపూర్‌ పాఠశాలల్లో దుస్తుల పంపిణీ పూర్తైంది. ఇతర ప్రాంతాల వారికి అప్పగించడంతో వేలాది మంది విద్యార్థులకు అందించడంతో ఆలస్యానికి దారితీస్తోంది.

మర్పల్లి మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలల్లో 5,560మంది విద్యార్థుల దుస్తులు కుట్టే బాధ్యతలను ఇతర ప్రాంతాల వారికి అందించారు. వారు ఇప్పటివరకు కుట్టకపోవడంతో పాతవాటితోనే బడికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. సగానికిపైగా మండలాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది.

కొలతలకు దూరం.. తల్లిదండ్రులపై భారం

పొరుగు జిల్లాల్లోని దర్జీలకు దుస్తులను కుట్టే బాధ్యతలు అప్పగించడంతో ఆయా దర్జీలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల కొలతలు సేకరించడం లేదు. కనీసం ఒకరిద్దరివి తీసుకోవడం లేదు. సాధారణంగా విద్యార్థుల వయసు, తరగతి ఆధారంగా కొలతలు అంచనా వేసి కుట్టాక పాఠశాలలకు తరలిస్తున్నారు. దీంతో అవి సరిపోక పదులసంఖ్యలో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. కొంతమంది విద్యార్థులు మళ్లీ రూ.50 నుంచి రూ.100లు చెల్లించి సరిచేయించుకుంటున్నారు. దీంతో నిరుపేద కుటుంబాల్లోని తల్లిదండ్రులపై ఆర్థికభారం పడేలా చేస్తున్నారు. స్థానికంగా ఆయా మండలాల్లోని దర్జీలకు కుట్టే బాధ్యతలను అప్పగిస్తే విద్యార్థుల కొలతలు సేకరించి దుస్తులు సిద్ధం చేసే వీలుంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఇవేమి పట్టించుకోకుండా గంపగుత్తగా దుస్తులు కుట్టే బాధ్యతలను ఇతర జిల్లాల్లోని వారికి అందజేస్తుండటంతో కొలతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు.

వస్త్రం ఆలస్యంగా వచ్చింది

రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

ఈ సారి అన్ని జిల్లాలకు అందించాక ఆఖరున వికారాబాద్‌కు వస్త్రాన్ని సరఫరా చేశారు. అందువల్లే ఏకరూప దుస్తులు కుట్టడంలో కొంత జాప్యం జరిగింది. ఇప్పటివరకు ఒక్కో జత చొప్పున దుస్తులు విద్యార్థులకు అందించడం జరిగింది. మిగిలిన మరోజత దుస్తులను వారం రోజుల్లో అందించాలని ఆదేశించాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.