close

సోమవారం, అక్టోబర్ 14, 2019

ప్రధానాంశాలు

పూల ధరలు.. ఢమాల్‌

చవితి తర్వాత ఒక్కసారిగా పతనం

బతుకమ్మపైనే రైతుల ఆశలు

పూడూరు మండలం మీర్జాపూర్‌లో సాగవుతున్న బంతి

పూల రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఎంతో కష్టపడి పండించిన పూలకు ప్రస్తుతం విపణిలో ధర లేకపోవటంతో సాగు చేసిన వారు విలవిల్లాడుతున్నారు. వినాయక నవరాత్రుల తరువాత ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. మరోవైపు కోత కాలం మొదలై దిగుబడి పెరుగుతోంది. రానున్న దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా ధరలు పరుగుతాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

- న్యూస్‌టుడే, పూడూరు

హైదరాబాద్‌ నగరం చేరువలో ఉండటంతో వికారాబాద్‌ జిల్లాలో పూల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నవాబుపేట, పూడూరు, పరిగి, ధారూరు, వికారాబాద్‌, మోమిన్‌పేట, మర్పల్లి తదితర మండలాల పరిధిలో అన్ని కాలాల్లోనూ పూల సాగు ఉంటుంది. ఖరీఫ్‌ సీజన్‌లో చామంతి, బంతి, హస్టన్‌, వివిధ రకాల గులాబీతో పాటు ఎర్రబంతి, పచ్చబంతి, కుంకుమబంతి, కనకాంబరాలు, మల్లెలు, కాగడాలు, లిల్లీ వంటివి సాగవుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం సుమారు 3 వేల ఎకరాల వరకు పూల సాగు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. తెంపిన పూలను నగరంలోని మెహిదీపట్నం, గుడిమల్కాపూర్‌, మోజంజాహి మార్కెట్‌, లంగర్‌హౌస్‌, కూకట్‌పల్లి విపణులకు తరలించి కమీషన్‌ ఏజెంట్ల వద్ద అమ్మకాలకు ఉంచుతారు. పొలాల వద్ద ఉదయం పూటనే అమ్మకాలు జరుగుతుండటంతో తెల్లవారేసరికే పూలు సిద్ధం చేసుకుని మార్కెట్‌కు తరలిస్తుంటారు.

చేమంతి పూలు కోస్తున్న మహిళలు

ఆరు నెలల కష్టం: జిల్లాలో పూల సాగు అధికంగా ఉన్నా రైతులకు నష్టాలే వస్తున్నాయి. చేమంతి పూలు కోతకు రావాలంటే ఆరు నెలల ముందు పంట వేయాలి. సాధారణంగా దసరా, దీపావళి సీజన్‌లో పూలకు డిమాండ్‌ ఉంటుందని గుర్తించిన రైతులు ఆ మేరకు సమాయత్తం అవుతున్నారు. పండగల సమయానికి పంట రావాలంటే వేసవి నుంచే ప్రయత్నించాలి. పంట కాలం ప్రారంభం కాగానే వారంలో రెండుసార్లు కోతకు వస్తుంది. ఎకరం చేమంతి తోటలో వారానికి సాధారణంగా సుమారు 2 నుంచి 3 క్వింటాళ్లు దిగుబడులు వస్తాయి. నెల వ్యవధిలోనే పంట కాలం పూర్తవుతుంది. అదే సమయంలో హైదరాబాద్‌లోని కమీషన్‌ ఏజెంట్లు(వ్యాపారులు) ఇతర రాష్ట్రాలు, వివిధ పట్టణాల నుంచి పూలను తెప్పిస్తుండటంతో జిల్లా రైతులకు సరైన ధర లభించక నష్టాలు వస్తున్నాయి. ఇక్కడినుంచి తరలించేందుకు ఒక్క మూటకు ఆర్టీసీ బస్సులో రూ.40 నుంచి రూ.50 వరకు రవాణా ఛార్జీలు తీసుకుంటారు. పూడూరు ప్రాంతం నుంచి గుడిమల్కాపూర్‌ విపణికి చేరాలంటే లంగర్‌హౌస్‌, నానల్‌నగర్‌ స్టేజీ వద్ద బస్సు దిగి ఆటోల్లో వెళ్లాల్సిందే. అందుకు అదనంగా ఒక్కో మూటకు రూ.30 నుంచి రూ.45 వరకు అవుతుంది. విపణిలో అమ్మిన తరువాత కమిషన్‌ ఏజెంట్‌లు రూ.వందకు రూ.10 కమీషన్‌ తీసుకుని రైతుల చేతికి పట్టీలు అందిస్తారు. ఎకరం చేమంతి సాగు చేయాలంటే రైతుకు సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చులు అవుతాయి.

కూలీల ఖర్చు రావటం లేదు

- గమిలీబాయి, కొటాలగూడ

పూలసాగు చేపట్టి దండిగా నష్టపోతున్నాం. గత శ్రావణమాసంలో ఉన్న ధరలు ప్రస్తుతం పలకటం లేదు. గత వారం నుంచి తెంపిన కూలీ ఖర్చులైనా రావటం లేదు. బోరు వద్ద ఆరు నెలల ముందు ఎకరం విస్తీర్ణంలో చేమంతి వేశాము. ప్రస్తుతం పంట తెంపకానికి వచ్చింది. దిగుబడులు బాగున్నా ధర పూర్తిగా పడిపోయింది. కిలో రూ.5 అంటే ఎవరూ తీసుకోవటం లేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.