close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

పరిగిలో 90 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

కోళ్ల్లదాణా పేరిట వ్యాపారం

ముగ్గురిపై కేసు

బియ్యాన్ని పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అదనపు ఎస్పీ మురళి

పరిగి, న్యూస్‌టుడే: కోళ్లదాణా పేరిట వ్యాపారం అంటూ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన గురువారం వికారాబాద్‌ జిల్లా, పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట సమీపాన ఉన్న నాగార్జున పశువులు, కోళ్లదాణా పరిశ్రమలో జరిగింది. గోదాములో రేషన్‌ బియ్యం ఉన్నట్లు అందిన రహస్య సమాచారం మేరకు బుధవారం .రాత్రి జిల్లా పౌర సరఫరాల శాఖ విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో చీకటిగా ఉండటం, బియ్యం గుర్తు నాణ్యత గుర్తించే పరిస్థితి లేకపోవడంతో పూర్తిస్థాయి సమాచారం లేదన్న అధికారులు గోదాముకు తాళం వేశారు. రాత్రి సమయంలో అక్కడే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌, రెవెన్యూ అధికారి దస్తయ్యతో పాటు ఇద్దరు వీఆర్‌ఏలు, విజిలెన్స్‌ టీం సభ్యులు రక్షణగా ఉన్నారు. గురువారం ఉదయం గోదామును పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి రాజేశ్వర్‌, సివిల్‌ సప్లయ్‌ టెక్నికల్‌ మేనేజర్‌ ఎన్‌.యాదగిరి, విజిలెన్స్‌ సీఐ చంద్రమౌళి, అదనపు ఎస్పీ ఎన్‌.మురళి స్వయంగా పరిశీలించారు. ఇవి పేదలకు పంపిణీ చేసిన బియ్యమేనని నిర్ధరణ చేశారు. వందల కొద్దీ బస్తాలు ఉండటంతో లెక్కింపు ఉదయం నుంచి దాదాపు రాత్రి ఏడున్నర గంటల వరకు కొనసాగింది. చివరకు 90 టన్నుల బియ్యం ఉన్నాయని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ప్రత్యేక వాహనాల్లో పరిగిలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. పరిశ్రమ నిర్వాహకులు కోళ్లదాణాలో కలిపేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జున ఫీడ్‌ కంపెనీ నిర్వాహకులు దాణా తయారీకి నూకలు కావాలని అడగ్గా పరిగికి చెందిన కిరణ్‌కుమార్‌, నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన నారాయణ నూకల పేరిట రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. నిర్వాహకునికి ఇచ్చిన బిల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల శాఖ వికారాబాద్‌ డిప్యూటీ తహసీల్దారు షేక్‌ ఫయాజ్‌ అహ్మద్‌ రాత్రి 8.30గంటలకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశ్రమ నిర్వాహకులు రాజేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, భాగ్యలక్ష్మి మోడ్రన్‌ రైస్‌మిల్లు నిర్వాహకుడు నారాయణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్సై చంద్రకాంత్‌ తెలిపారు.

కఠిన చర్యలు తప్పవు -మురళి, విజిలెన్స్‌ అదనపు ఎస్పీ

బియ్యం అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు విజిలెన్స్‌ అదనపు ఎస్పీ మురళి హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఘటనా స్థలంలో మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బియ్యాన్ని నూకలుగా మార్చి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు దాణా పేరిట సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.