close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

చుక్‌..చుక్‌ బండి.. జాగ్రత్తండీ!

నేడు రైల్వే భద్రతా దినోత్సవం

అప్రమత్తతోనే ప్రయాణం సురక్షితం

న్యూస్‌టుడే, వికారాబాద్‌

వికారాబాద్‌లో ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్న ప్రయాణికులు

రైలు ప్రయాణం..! హాయిగా కబుర్లు చెప్పుకొంటూ.. కుటుంబీకులతో సరదాగా చుక్‌.. చుక్‌ బండిలో వెళ్లడమంటే ఎవరికైనా ఆనందమే.. కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల ఏమరుపాటు వారిని ప్రమాదాల బారిన పడేస్తోంది.. ఓ చిన్న నిర్లక్ష్యం వారి జీవితంలో అంధకారం నింపేస్తోంది.. ప్రమాదాలు జరిగే ఆస్కారమున్న విషయాల్లో ప్రతిఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘రైల్వే భద్రతా దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనమిది.
ఫుట్‌ఓవర్‌ ఉందిగా..

వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లోకి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెండో నెంబరు ప్లాట్‌ఫాం పైకి వచ్చి ఆగింది. మధ్యలో గూడ్స్‌ బండి ఉంది. పలువురు ప్రయాణికులు వంతెనపై నుంచి వెళ్తే ఆలస్యమవుతుందని ఆగి ఉన్న గూడ్స్‌ రైలు కింద నుంచి దూరి వెళ్లడం పరిపాటిగా మారింది. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకి వెళ్లాలంటే ప్రతి రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్ల ఏర్పాటు ఉంది. వీటిపై నడుచుకుంటూ వెళ్తే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆతృత కొద్దీ ఫుట్‌ఓవర్‌ కాకుండా స్టేషన్‌లో రైలు పట్టాలు దాటుకుంటూ మరో ప్లాట్‌ఫాం వైపు వెళ్లే సమయంలో అటు నుంచి వేగంగా వచ్చే రైలు ఢీకొట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రాణాలకు ముప్పు వాటిల్లక తప్పదు.

రైలు.. చరవాణి.. ప్రాణహానీ!

ప్రయాణ సమయంలో రైలు తలుపుల వద్ద చరవాణిలో మాట్లాడే సందర్భంలో కింద పడిపోయే అవకాశం ఉంది. సాధారణంగా చరవాణి మాట్లాడేటప్పుడు చాలామంది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా హావభావాలు చేస్తుంటారు. ఇదే సమయంలో తలుపుల వద్ద ఉన్న వారు రైలు నుంచి కిందకు పడిపోయి గాయాలకు గురవడమో, చనిపోవడమో జరుగుతోంది. అంతేకాకుండా తలుపు వద్ద ఉన్న ప్రయాణికులు సరదా కోసం తలను బయటికి పెట్టినప్పుడు రైలు సిగ్నల్‌కు సంబంధించిన స్తంభం బలంగా తాకితే ప్రాణాల మీదకు వస్తుంది.

జాగ్రత్తోయ్‌ .. తేడా వస్తే అంతేమరీ!

నడుస్తున్న రైలు ఎక్కడం, దిగటం ప్రమాదమే. స్టేషన్‌లో ఆగినప్పుడు మాత్రమే రైలు ఎక్కాలి లేదా దిగాలి. అలా కాకుండా కదులుతున్న రైలు ఎక్కినప్పుడు ప్లాట్‌ఫారంపై కాలు అదుపుతప్పితే మనిషే రైలు కిందకు వెళ్లి దుర్మరణం చెందే అవకాశం ఉంది. వేగంలో ఉన్న రైలుపై నుంచి కిందకి దిగినప్పుడు ప్రమాదవశాత్తు కిందపడి కాళ్లు, చేతులు విరిగే అవకాశం ఉంది.

తగదీ సాహసం: గూడ్స్‌ రైలు కింద నుంచి వస్తున్న మహిళలు

9 మాసాల్లో 59 మంది మృతి..

వికారాబాద్‌ రైల్వే పోలీస్‌ ఠాణా పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రైలు ప్రమాదాల బారిన పడి 59 మంది మృతిచెందారు. వీరిలో 51 మంది పురుషులు, 8 మంది మహిళలు. 30 చోరీ కేసులు నమోదయ్యాయి. వీటిలో రూ.5,30,000ల విలువైన వస్తువులు చోరీ జరిగాయి. ఆర్‌పీఎఫ్‌ పరిధిలో ఇప్పటివరకు రైలు పట్టాలు దాటిన వారికి, పొగరాయుళ్లు 2 వేల మందికి రూ.4 లక్షల జరిమానా విధించారు.

ఆ సమయంలో నిరీక్షణే మంచిది..

వాహనాల రాకపోకలు సాగించే రోడ్డు మార్గంలో వంతెనలు లేని స్టేషన్లకు సమీపంలో గేట్‌మెన్‌లు రైలు రావడానికి కొన్ని నిమిషాల ముందు ఇరువైపులా గేట్లు వేస్తారు. ఆ సమయంలో కొంతమంది ద్విచక్ర వాహనదారులు, సైక్లిస్టులు, కాలినడకన వెళ్లేవారు గేటు కింది నుంచి దూరి వెళ్తారు. ఇలాంటి సమయంలోనే వేగంగా వచ్చే రైలు ఢీ కొంటే దుర్మరణం తప్పదు. గేటు వేసినప్పుడు రైలు వెళ్లేదాకా నిరీక్షించడం మంచిది.

కాపలా లేని గేట్ల వద్ద నిర్లక్ష్యం వద్ధు.

పట్టాలున్న రోడ్లపై కాపలా లేని రైల్వే గేట్ల వద్ద జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నిర్లక్ష్యంగా వెళ్తే రైలు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకోక తప్పదు. కాపలా లేని గేటున్న రోడ్డు మార్గంలో వాహనాలపై వెళ్లినా, కాలినడకన వెళ్లినా ఒకసారి ఆగి రెండు వైపులా చూసి వెళ్లాలి.

విద్యుత్తు తీగలతో అప్రమత్తం..

రైల్వేస్టేషన్‌లో వేచి ఉండే ప్రయాణికులు విద్యుత్తు తీగలతో జాగ్రత్తగా ఉండాలి. రైల్వేస్టేషన్‌లోని పట్టాలకు ఇరువైపులా స్తంభాలకు అమర్చిన తీగల్లో 25,000 ఓల్టుల విద్యుత్తు ప్రసారం జరుగుతుంది. వీటికి సంబంధించిన మరమ్మతుల సాధనాలు కూడా పట్టాలకు సమీపంలోనే ఉంటాయి. వీటిని ఏమరుపాటుగా తాకినా విద్యుదాఘాతం తప్పదు. ప్రయాణికులు స్టేషన్‌లోని విద్యుత్తు సంబంధ పరికరాలు, తీగలను ముట్టుకోకపోవడమే మంచిది.

ప్రయాణికుల భద్రతకు చర్యలు..

- సత్ఫాల్‌సింగ్‌, ఆర్‌పీఎఫ్‌ సీఐ, వికారాబాద్‌

ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి వేళల్లో కిటికీ తలుపులు మూసుకోవాలని, అపరిచితులు ఇచ్చే తినుబండారాలు తీసుకోవద్దని చైతన్యపరుస్తున్నాం. ధూమపానం, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, పేలుడు పదార్థాలతో ప్రయాణించడం, అకారణంగా రైలు అలారం గొలుసు లాగడం వంటివి చేస్తే జరిమానా, జైలు శిక్ష తప్పవని హెచ్చరిస్తున్నాం. గతంలో జరిగిన సంఘటనలతో అప్రమత్తమై కాపలా లేని 10 రైల్వే గేట్ల వద్ద కాపలా ఏర్పాటు చేశాం. రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఆపద ఎదురైనా టోల్‌ఫ్రీ నెంబరు 182కు ఫోన్‌ చేయాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.