close

గురువారం, అక్టోబర్ 24, 2019

ప్రధానాంశాలు

తప్పుల్లేని జాబితాపై సందిగ్ధం

సాగుతోన్న పరిశీలన !

తప్పుల్లేని ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. సాంకేతిక సాయంతో క్షేత్రస్థాయిలోని ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటి పరిశీలన చేపట్టి తప్పులు, పేరు, వయసు, చిరునామా, ఇతర వివరాలను సరిదిద్దే కార్యక్రమం ఈవీపీ (ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం) ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది.. ఇదే సమయంలో ఓటరు స్వయంగా ఆన్‌లైన్‌లో తమ వివరాలు సక్రమంగా ఉన్నాయో? లేదో? తెలుసుకుని సరిచేసుకునేందుకు అవసరమైన యాప్‌ను రూపొందించింది.. ఎన్నికల సంఘ సూచనలకు అనుగుణంగా ఓటర్ల జాబితా పరిశీలన జిల్లాలో అనుకున్నంత వేగంగా సాగడం లేదు.

- న్యూస్‌టుడే, చిత్తూరు (జిల్లా సచివాలయం)

జిల్లాలో తాజాగా 32.07లక్షల మంది ఓటర్లు ఉంటే.. గత మూడు వారాలుగా 13,025మంది ఓట్లనే పరిశీలించారు. ఈ పరిశీలన జిల్లాలో నెమ్మదిగా సాగుతుండటంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సైతం దృష్టి సారించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.భరత్‌గుప్తాతో దీనిపై సమీక్షించారు. తాజాగా ఇదే అంశంపై ఆయన.. 14 నియోజకవర్గాల ఈఆర్వోలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈవీపీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఓటర్ల జాబితా పరిశీలన కోసం బీఎల్వోలకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని వినియోగంపై బీఎల్వోలకు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.

 

ఇతర పనుల్లో తీరిక లేకుండా..

ఓటరు జాబితా పరిశీలనలో బీఎల్వోలు, రెవెన్యూ యంత్రాంగానిదే ప్రధాన పాత్ర. వీరు క్షేత్రస్థాయిలో ఇతర పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంటింటి సర్వే, వివరాల నమోదు తదితర కార్యక్రమాల్లో వీఆర్వోలు నిమగ్నమయ్యారు. ఇంటింటి సర్వే ద్వారా అందిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. బీఎల్వోలుగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, వైద్యశాఖ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల్లో నిమగ్నం కావడంతో ఈ ఓటరు జాబితా పరిశీలన అనుకున్నంత మేర ముందుకు సాగని పరిస్థితి.

 

జిల్లాలో ఇదీ లెక్క.

జిల్లాలో తాజా లెక్కల ప్రకారం మొత్తం 32,07,235 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఈ నెల 17వరకు 13,025 మంది ఓటర్ల వివరాలు మాత్రమే పరిశీలించారు. అక్టోబరు 15న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన నాటికి మొత్తం ఓటర్ల జాబితా వివరాలు పరిశీలించాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పరిశీలన వేగం ప్రకారం గడువు లోపు మొత్తం ఓటర్ల పరిశీలన పూర్తిచేయడం కష్టమే. జిల్లాలో జీడీనెల్లూరు నియోజకవర్గంలో అత్యధికంగా 4,002 ఓటర్ల వివరాలు పరిశీలించగా.. పీలేరులో అత్యల్పంగా 52 మాత్రమే పరిశీలించారు. తంబళ్లపల్లెలో 688, మదనపల్లెలో 287, పుంగనూరులో 732, చంద్రగిరిలో 724, తిరుపతిలో 73, శ్రీకాళహస్తిలో 95, సత్యవేడులో 2,823, నగరిలో 161, చిత్తూరులో 1,538, పూతలపట్టులో 831, పలమనేరులో 761, కుప్పంలో 258 ఓట్లను మాత్రమే పరిశీలించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.