close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

చదువుల తల్లికి నవోదయ

ఉద్యోగ పరీక్షలను తలపిస్తున్న ప్రవేశ పరీక్ష

సమీపిస్తున్న 6వ తరగతి దరఖాస్తు గడువు

న్నత విద్యాభ్యాసం వైపు పయనిస్తున్న విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలో నెగ్గడం అంత సులువు కాదు. మేధాశక్తిని పరీక్షించే ఈ ప్రవేశ పరీక్షకు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ప్రతీ విద్యార్థి పోటీ పడతాడంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రాచుర్యం పొందిన ఆ పోటీ పరీక్షే జవహర్‌ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష. నవోదయ విద్యాలయంలో సీటు వచ్చిందంటే తమ బిడ్డకు బంగారు భవిత లభించినట్లేనని తల్లిదండ్రులు భావిస్తారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే నవోదయ విద్యాలయాల్లో జేఎన్‌వీ-2020 ప్రవేశ పరీక్షకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 30లోగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందించాలని ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. - మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే

జేఎన్‌వీలో 6వ తరగతిలో ప్రవేశానికి అర్హత పరీక్షను జనవరి 11, 2020న నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి. సమయం 2 గంటలు కాగా దివ్యాంగ విద్యార్థులకు 30 నిమిషాలు అదనంగా కేటాయిస్తారు. మేధాశక్తికి చెందిన ప్రశ్నల సంఖ్య 40 కాగా 50 మార్కులు, గణితానికి సంబంధించిన ప్రశ్నలు 20 కాగా 25 మార్కులు, భాషా పరీక్షకు 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్‌ ఆధారంగా అర్హుల తుది జాబితాను ప్రకటిస్తారు.

ఉత్తమ ప్రమాణాలు..

నవోదయ విద్యాలయాల్లో బోధన సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఉంటుంది. నిపుణులైన అధ్యాపకులు పాఠాలను బోధిస్తుండగా, విశాలమైన ప్రాంగణం, ఆవరణ అంతా పరుచుకున్న పచ్చదనం, సువిశాల క్రీడా మైదానం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఏటా వంద శాతం ఉత్తీర్ణత, పది జీపీలు సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఒత్తిడి లేని విద్య, నిరంతర వైద్య పరీక్షలు, బాలబాలికలకు ప్రత్యేక డార్మెటరీలు, ప్రత్యేక తరగతి గదులు నవోదయ ప్రత్యేకతను తెలియజేస్తాయి. 1987లో ప్రారంభమైన జేఎన్‌వీలో కాలానికనుగుణంగా ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేసి కంప్యూటర్‌ విద్య కూడా ప్రారంభించారు. డిజిటల్‌ తరగతులతో విద్యార్థులకు విద్యపై మరింత ఆసక్తి కలిగిస్తున్నారు.

ఒక్కో విద్యార్థికి కేంద్రం ఖర్చు రూ.లక్ష

పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే జవహర్‌ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. నామినల్‌ నెలకు రూ.200 చొప్పున సంవత్సరాంతంలో చెల్లిస్తే సరిపోతుంది. కార్పొరేట్‌ విద్యా వ్యవస్థకు దీటుగా విద్యార్థులు వసతి, ఉచిత పుస్తకాలు, భద్రత కోసం నిఘా నేత్రాలు, ఏకరూప దుస్తులు, బూట్లు, స్టాఫ్‌ నర్సుతో వైద్యం వంటివి అందుబాటులో ఉంటాయి. సంగీతం, యోగా, అథ్లెటిక్స్‌, ఎన్‌సీసీ, జిమ్‌ వంటి ప్రత్యేకతలతో పాటు ఏటా 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఎంపిక మేరకు హిందీ భాష ప్రధాన భాషగా గల రాష్ట్రాల్లోని విద్యాలయాలకు ఇక్కడి నుంచి విద్యార్థులను పంపించి దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తారు.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..

విద్యాలయ వ్యవస్థ సాంకేతికత వైపు అడుగులు వేయడంతో ఇప్పుడు జవహర్‌ నవోదయ విద్యాలయం కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలోనే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొదటి ఏడాది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానం ఉండగా, ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పది వేలకుపైగా దరఖాస్తులు వచ్చే ఈ విద్యాలయంలో ప్రవేశానికి 80 సీట్లు కేటాయిస్తారు. పాలేరులోని ఏకైక జవహర్‌ నవోదయలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

ఎవరు అర్హులు

విద్యార్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతూ మే 1, 2007 నుంచి ఏప్రిల్‌ 30, 2011 మధ్య జన్మించిన వారై ఉండాలి. 80 సీట్లలో మొత్తంగా 30 శాతం బాలికలకు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో గ్రామీణ ప్రాంతాలకు 75 శాతం అంటే 60 సీట్లు కేటాయించి మిగిలినవి పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నవోదయ

పి.కోటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు, జేన్‌వీ, పాలేరు

ఉత్తమ విద్యా ప్రమాణాలతో పాటు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నవోదయ బాటలు వేస్తుంది. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌, హ్యాపీ అవర్స్‌, కెరీర్‌ గైడెన్స్‌, పోషక విలువలతో కూడిన ఆహారం, ఆధునాతన భవనాలు, విశాలమైన డార్మెటరీలు, అనుభవం గల అధ్యాపకులు నవోదయకు ప్రత్యేక ఆకర్షణ. నేటి వరకు 2200 ఆన్‌లైన్‌ దరఖాస్తులు నమోదయ్యాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.