close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

పల్లె వేదిక.. విద్యా కమిటీ ఎన్నిక

లక్ష్మమ్మకండ్రిగ ప్రాథమిక పాఠశాల

వడమాలపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని జిల్లా పరిషత్తు, ప్రాథమి కోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 23వ తేదీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మండల విద్యాశాఖాధికారులకు ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 4,817 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఓటర్ల జాబితాను తయారు చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు.

 

50శాతం రిజర్వేషన్లు

ఆయా పాఠశాలల్లో జరిగే విద్యా కమిటీ ఎన్నికల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మహిళా రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా పాఠశాలల్లో ముందుగానే రిజర్వేషన్లు గుర్తించి ప్రకటించాలని మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనెల 23 వతేదీన ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామ స్థాయిలో సందడి నెలకొంది.

 

సభ్యుల ఎన్నిక

ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యాకమిటీ ఎన్నికల్లో 15మంది సభ్యులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 21మంది సభ్యులను ముందుగా ఎన్నుకొంటారు. ప్రధానోపాధ్యాయులు కన్వీనర్‌గా ఉంటారు. సభ్యుల్లో ఒకరిని విద్యాకమిటీ ఛైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంది. ఆయా పాఠశాలల్లో ఎన్నికలు అనివార్యం అయితే ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.

 

గత ఏడాది వాయిదా

2016 విద్యా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఆకమిటీ 2016-18వరకు పని చేసింది. 2018-19 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కమిటీ ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ ఏడాది 2019-20 విద్యా సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

ఛైర్మన్‌, సభ్యుల విధులు

విద్యా కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన ఛైర్మన్‌, సభ్యులు ఆయా పాఠశాలల పురోభివృద్ధికి సహకరించాలి. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక వనరులతో పాటు స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, దాతల సహకారంతో పూర్తి స్థాయిలో ఆపాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్చి ఉంది.

 

ఎన్నికల నిబంధనలు

విద్యాకమిటీ గైడ్‌లైన్స్‌ తెలుగులోనే ఉండాలి. ఎన్నికల ప్రక్రియ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియ సాధారణంగా చేతులు ఎత్తడం, నోటితో చెప్పడం ద్వారా జరపాలి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే బ్యాలెట్‌ ఉపయోగించాలి. తల్లి, తండ్రి, సంరక్షకులలో ఎవ్వరో ఒక్కరు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనాలి. తల్లిదండ్రులకు వేర్వేరు తరగతుల్లో విద్యార్థులుంటే వారు ఆయా తరగతుల విద్యా కమిటీ ఎన్నికల్లో పాల్గొనవచ్ఛు సభ్యులుగా ఎంపికైన వారు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లను ఎన్నుకోవాలి. ఎన్నికల ప్రక్రియకు ఎవ్వరైనా విఘాతం కలిగించినచో వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొంటారు. ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఏదైనా గుర్తుంపు కార్డును తీసుకురావాలి. తహసీల్దార్‌, ఎంపీడీవో, వీఆర్వోలు ఎన్నికల ప్రక్రియను పరిశీలించవచ్ఛు

 

 

నిబంధనల ప్రకారం ఎన్నికలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకొంటున్నాం. ఈ నెల 23వ తేదీన ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే మండల ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేశాం. తమ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నాం.

- పద్మావతి, ఎంఈవో, వడమాలపేట

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.