close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

విద్యార్హత లేకున్నా.. చోదక అనుమతి

కేంద్రం సరికొత్త నిర్ణయం

వేలాది మందికి ఉపకరించనున్న విధానం

స్పష్టత వస్తేనే ప్రయోజనం

ట్రాఫిక్‌ గుర్తులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌: కూలి పనులకు వెళ్లడంకంటే వాహనాన్ని నడుపుతూ ఉపాధి పొందవచ్చని యువకులు భావిస్తుంటారు. అయితే ఇందులో ఇతర పనులకంటే ఎక్కువ కష్టాలు, మరిన్ని ప్రమాదాలు దాగి ఉంటాయి. ఈ పనిలో ముఖ్యంగా అవసరమయ్యేది అనుమతి పత్రం (లైసెన్స్‌). అది లేకపోతే ఎవరూ వాహనాన్ని ఎక్కనివ్వరు. పొరపాటున ప్రమాదం జరిగినా లైసెన్స్‌ లేకపోతే బీమా సంస్థల నుంచి ఒక్కరూపాయి చేతికి రాదు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు, తనిఖీ కేంద్రాలు.. ఇలా అనేక చోదక అనుమతి పత్రాలు లేని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ రోజు సంపాదన జరిమానాగా చెల్లించి ఒట్టిచేతులతో ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. అందుకే చాలామంది డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం ప్రయత్నిస్తుంటారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో మొత్తం 83 వేల వాహనాలు ఉన్నాయి. వీటిలో 35 వేల ఆటోలు, 30 వేల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ 65 వేల ఆటో, ద్విచక్ర వాహనదారుల్లో సగం మందికి చోదక అనుమతులు లేవు. ఎక్కడికైనా వెళ్తుంటే ముందు పోలీసులు వాహనాల తనిఖీలు జరుగుతున్నాయన్న సమాచారం తెలిస్తే చాలు.. వాహనాలను అక్కడే నిలిపి వేసుకుని పోలీసులు తనిఖీలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు నిరీక్షించాల్సిన పరిస్థితులు తరచూ చూస్తూనే ఉంటాం.

వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదుట ఆటోల బారులు

కనీస విద్యార్హత లేక సమస్యలు..

సమాజంలోని ఉన్నత, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు విద్య, వ్యాపారాల వైపు అడుగులేస్తే.. దిగువ తరగతులకు చెందిన పిల్లలు ఇలా డ్రైవింగ్‌ పనులను ఎంచుకుంటారు. అందులోను ఎక్కువగా ఆటోలు నడిపేందుకు వస్తుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత వంటి కారణాలు యువకులను ఈ తరహా పనులవైపు నడిపిస్తాయి. డ్రైవింగ్‌ లైసెన్సు పొందేందుకు ఎనిమిదో తరగతి కనీస విద్యార్హత. అదీ లేక వేలాదిమంది ఇబ్బందిపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఈ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. విద్యార్హత లేకపోయినా వాహనాన్ని నేర్పుగా నడిపించగల సామర్థ్యం, ట్రాఫిక్‌ చిహ్నాలను గుర్తించగలిగే తెలివితేటలు ఉంటే సరిపోతుంది. అలాంటివారికి లైసెన్సులు మంజూరు చేసే దిశగా రవాణా చట్టంలో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ చర్యలు చేపడుతోంది.

స్పష్టత రావాల్సి ఉంది..

- వెంకటేశ్వరరెడ్డి, జిల్లా రవాణాధికారి

ఇదివరకు కమర్షియల్‌ ట్రాన్స్‌పోర్టు లైసెన్సులకు కనీస విద్యార్హతను నిర్ణయించారు. ఇది చట్టంలో ఉంది. ఇటీవల కమర్షియల్‌ ట్రాన్స్‌పోర్టు అనే పదాన్ని తొలగించారు. ఇప్పుడు విద్యార్హత నిబంధనలను తీసేస్తామంటున్నారు. ఇందులో కొంత సందిగ్ధత ఏర్పడుతోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. విద్యార్హతను తొలగించడం వల్ల అనేక మందికి ఉపశమనం కలుగుతుంది. వాహనాలను నడిపించడంలో తగిన సామర్థ్యం, ట్రాఫిక్‌ చిహ్నాలను గుర్తించగలిగే పరిస్థితి ఉండాలి. ప్రభుత్వ విధానాలపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చేవరకు నిరీక్షించాల్సి ఉంది.

చాలా మందికి ప్రయోజనం: నగేష్‌నాయక్‌,

ఆటో చోదకుడు, బురంతపల్లి, వికారాబాద్‌

నిరుపేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఆటోలు, జీపులు నడిపేందుకు వస్తుంటారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల నుంచి యువకులు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఇన్నాళ్లూ కనీస విద్యార్హత నిబంధన ఉండడంతో అనేక మందికి లైసెన్సులు రావడంలేదు. వాహనాల తనిఖీలు జరుగుతుంటే ఆటోను దారి మళ్లించి వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం ఈ విధానాలను సవరిస్తే నా లాంటి ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుంది. జీవనోపాధికి ఆటంకాలు తొలుగుతాయి. వాహన పత్రాలతో పాటు డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగి ఉంటే ఏదైనా ప్రమాదం ఎదురైనా ఆర్థిక భరోసా ఉంటుంది.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.