close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

వెంకన్న చిత్రమే జీవన సూత్రం 

ఆకర్షణీయంగా శ్రీనివాసుని ఫొటోలు

అన్నిస్థాయి ధరలు, ప్రమాణాల్లో ఫొటోల తయారీ, విక్రయాలు

తిరుపతి, తిరుమలలో ఎంతో మందికి జీవనాధారం

ఫొటోప్రింటింగ్‌ యంత్రాలు  

ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరుని చూసిన కనులదెంతటి భాగ్యమూ.. కొన్ని సెకన్ల పాటు ఆ దివ్యతేజాన్ని దర్శించే నేత్రాలు మనో ఫలకంపై దేవదేవుని నిలుపుకోవాలని చేసే ఆరాటం అంతా ఇంతా కాదు.. భగవన్నామస్మరణతో రూపాన్ని దర్శిస్తూ గర్భగుడి నుంచి భక్తులు బయటికి వస్తారు. అయినా మరోమారు స్వామిని చూడాలనే తనివి తీరని తాపత్రయం భక్తులది. ఆ తాపత్రయానికి ఊరటనిచ్చేలా.. దేవదేవుని మనోరంజిత రూపాన్ని అచ్చుగుద్దినట్లు రూపొందించిన ఫొటోలు అందుబాటులోకి తీసుకొచ్చారు తిరుమల, తిరుపతిలోని విక్రయదారులు.

- న్యూస్‌టుడే, తిరుపతి (కపిలతీర్థం)

తొలినాళ్లలో తెలుపు, నలుపు రంగుల కొయ్య ఫ్రేమ్‌తో కూడిన అద్దాల ఫొటోలే వ్యాపారుల వద్ద అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం నిజంగా దేవదేవున్ని దర్శించినట్లు మల్టీ కలర్‌ డిజిటల్‌ లామినేషన్‌ చిత్రాలతో ఆకర్షణీయమైన ఫ్రేమ్‌ ఫొటోలు తిరుమల, తిరుపతి దుకాణాల్లో అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో దశలవారీగా వెంకన్న రూపం అచ్చు కుదురైంది. భక్తిభావం ఉప్పొంగేలా చిన్న సైజుల నుంచి నిలువెత్తు ఫొటోల వరకు ఆఫ్‌సెట్‌ ప్రిింటింగ్‌తో మార్కెట్‌లో కొలువుదీరాయి.

తిరుపతి గోల్డ్‌ పెయింటింగ్‌

ఎక్కడ నుంచి ఏ వస్తువులు

శ్రీవారి ఫొటోలు డిజిటల్‌ టెక్నాలజీతో కూడిన సింథటిక్‌ ఫ్రేమ్‌ల స్థాయికి పెరగడంతో ఇందుకు కావాల్సిన వస్తువులు వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌, పిగ్‌మెంట్‌ విధానంతో ముద్రించే శ్రీవారి బొమ్మలను రూపొందించేందుకు ఇజ్రాయిల్‌ టెక్నాలజీతో కూడిన యంత్రాలను వ్యాపారులు వినియోగిస్తారు. చిత్రాలకు పెయింటింగ్‌ దిద్దడంలో తిరుపతి గోల్డ్‌ పెయింటింగ్‌, ఇమిటేషన్‌ డైమండ్స్‌, బ్రోస్‌, ఉడెన్‌ ఉపయోగిస్తారు. వీటిని చైన్నె నుంచి తీసుకొస్తారు. వీటితోపాటు చింతపిక్కలు, పేస్ట్‌ కూడా తెస్తారు. ఎలక్ట్రికల్‌ పరికరాలు దిల్లీ నుంచి వస్తాయి. ఫొటో ఫ్రేమ్‌లు దాదాపుగా ముంబాయి నుంచి తెచ్చుకుంటారు. అలాగే రంగులు, ఆర్గానిక్స్‌ జర్మనీ దేశం నుంచి దిగుమతి అవుతున్నాయి.

 

రూ.3నుంచి రూ.50వేల వరకు..

కలకండ, బొరుగుల సంచిపై పెట్టే శ్రీవారి పేపరు బొమ్మ ధర రూ.3. పూజ గది గోడకు నిండుదనం తెచ్చే నిలువెత్తు ఫొటోలు గరిష్ఠంగా రూ.50వేల వరకు ఉండేవి సైతం ఉన్నాయి. ఇలా ఎంత ధరలో కావాలో అంత స్థాయిలో ఫొటోలు తిరుమల, తిరుపతిలోని దాదాపు అన్ని ఫొటో దుకాణాల్లో లభిస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చిన అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన భక్తులతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఖరీదైన ఫొటోలను ఇక్కడ కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. అలాగే మలేషియా, సింగపూర్‌, శ్రీలంక దేశాలకు ఈ ఫొటోలను వ్యాపారులు తీసుకెళ్లి అక్కడ విక్రయిస్తున్నారు.

 

ఏడుకొండలవాడి తోడుగా...

వెంకన్న ఫొటోల విక్రయాల ద్వారా సుమారు 20వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయి. తిరుపతిలో సుమారు 6, 7 పెద్ద కంపెనీలు ఫొటోలు తయారుచేస్తున్నాయి. ఆ కంపెనీలు తయారుచేసే ఫొటోలను వారి బ్రాండ్‌ పేరిట దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ కంపెనీల నుంచి హోల్‌సేల్‌గా టోకు వ్యాపారులు తీసుకెళ్లి తిరుమలలో అమ్ముతుంటారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్‌ పేరిట దేశవిదేశాలకు సైతం శ్రీవారి ఫొటోలను పంపిస్తున్నారు. వీటితోపాటు కుటీర పరిశ్రమలు సైతం ఫొటోలు తయారు చేయగా వారి నుంచి కొని తిరుమలలో విక్రయించేవారూ ఉన్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపం, కొర్లగుంట, రాములవారి ఆలయం, సత్యనారాయణపురం, గిరిపురం ప్రాంతాల్లో ఎన్నో దుకాణాలకు స్వామి వారి ఫొటోల విక్రయమే ప్రధానం ఆధారం. తిరుమల క్షేత్రంలో అడుగడుగునా స్వామి వారి చిత్రపటాలు.. మిరిమిట్లు గొలిపేలా రూపొందించిన పెద్దసైజు ఫ్రేం ఫొటోలు దుకాణాలు కన్పిస్తాయి. భక్తుడు భగవంతుని నిత్యం దర్శించుకునేలా ఫొటోలు రూపొందించడం, విక్రయించడం తమ వృత్తి అని.. ఇదీ ఆ దేవదేవుని అనుగ్రహమని వ్యాపారులు, చిరు వర్తకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.