close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌కు కేంద్ర పురస్కారం

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌కు

 

● ఉమ్మడిగా ఉన్న సమయంలో అందించిన సేవలకు..

● వరుసగా రెండోసారి ఎంపిక

● త్వరలో మోదీ చేతుల మీదుగా అందజేత

ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే

కేంద్ర పురస్కారానికి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ ఎంపికైంది. ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలయ్యేలా చేసినందుకు దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సశక్తికరణ్‌ పురస్కార్‌ కింద వరుసగా రెండోసారి జడ్పీని ఎంపిక చేశారు. ఇంతకుముందున్న ఉమ్మడి జడ్పీ పాలకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల  కృషితో పురస్కారం దక్కింది. జడ్పీ చరిత్రలో రెండు మార్లు పురస్కారం రావడం ఇదే తొలిసారి. త్వరలో ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, సీఈఓలు దిల్లీలో ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా నగదు బహుమానం, పురస్కారం అందుకోనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు ప్రజల దరి చేరితేనే దానికి సార్ధకత ఉంటుంది. ఇందులో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీలది కీలకపాత్ర. అందుకనే కేంద్రం మూడు విభాగాలను ప్రోత్సహించేందుకు ఏటా పురస్కారాలు అందజేస్తోంది. దీనికోసం పథకాల అమలులో వీరి పనితీరును కొలమానంగా తీసుకుంటోంది. ముందుగా కేంద్రం నుంచి కొన్ని ప్రశ్నలతో కూడిన ఒక నివేదిక వస్తుంది. సమాధానాల్లో అధికంగా మార్కులు వస్తే ఆ తర్వాత కేంద్రం నుంచి ప్రత్యేక బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. సంతృప్తి చెందితే పురస్కారం వస్తుంది. 2016-17 సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జడ్పీని పురస్కారం కింద ఎంపిక చేసేందుకు జిల్లాకు దిల్లీ నుంచి బృందం వచ్చింది. కేంద్రం అమలు చేస్తున్న ఉపాధిహామీ, సుకన్య సమ్రిద్ధి యోజన, ప్రధాన మంత్రి కృషి సంచాయ్‌ యోజన, బేటీ బచావో-బేటీ పడావో ఇతరత్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని కేసీఆర్‌ కిట్‌, మిషన్‌ భగీరథ, ఆసరా పింఛన్లు, మిషన్‌ కాకతీయ తదితర అన్ని పథకాలపై ఆ బృందం అధ్యయనం చేసింది. జడ్పీ సమావేశాల్లో మాట్లాడిన వివరాల కోసం జడ్పీ మినిట్‌బుక్స్‌ను పరిశీలించి అప్పటి జడ్పీటీసీలతో మాట్లాడి వివరాలు సేకరించింది. క్షేత్రస్థాయిలో పర్యటించింది. బృందం నివేదిక ఆదారంగా జిల్లా పరిషత్‌ పురస్కారానికి ఎంపికైంది. అప్పటి ఉమ్మడి జడ్పీ ఛైర్మన్‌ శోభారాణి 2018 ఏప్రిల్‌లో దిల్లీలో రూ.50 లక్షల నగదు బహుమతి, పురస్కారం అందుకున్నారు.

రెండోసారి

ఉమ్మడిగా ఉన్న సమయంలోనే రెండో సారి పురస్కారం కోసం ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ పోటీ పడింది. 2017-18 సంవత్సరానికి అందించే పురస్కారం కోసం నలుగురితో కూడిన కేంద్ర బృందం ఉమ్మడి పాలకవర్గం ఉన్న సమయంలోనే ఈ ఏడాదిలో జిల్లాకు వచ్చింది. వివరాలు సేకరించి సంతృప్తి చెందింది. పారిశుద్ధ్యం, వైద్యం, విద్య ఇతర అంశాలన్నింటిని పరిశీలించారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా మరో మారు జడ్పీకి పురస్కారం దక్కింది. దీనికింద నగదు బహుమతి ఇవ్వనున్నారు. వాస్తవానికి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలలోనే ఈ పురస్కారం కింద ఎంపిక చేసి ఏప్రిల్‌ 24వ తేదిన నిర్వహించే జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం రోజున దిల్లీలో పురస్కారం అందిస్తూ వస్తున్నారు. ఈ సారి ఆ సమయంలో కేంద్రంలో ఎన్నికల హడావుడి మొదలు కావడం, కోడ్‌ అమల్లోకి రావడంతో పురస్కారాన్ని నిలిపివేశారు. ఆ సంవత్సరం పురస్కారాన్ని తాజాగా గురువారం ప్రకటించారు. త్వరలోనే ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, సీఈఓ కిషన్‌లు దిల్లీలో ప్రధాన మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు.

అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితోనే

- శోభారాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ అధ్యక్షురాలు

వరుసగా రెండవసారి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌కు పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉంది. అదీ నా హయాంలో జరిగిన పనితీరుకు ఇది దక్కడం ఎప్పటికీ మరిచిపోలేను. అప్పటి అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులందరి కృషితో ఇది సాధ్యమైంది.

మూడోసారికి కృషిచేస్తాం

- కిషన్‌, ఆదిలాబాద్‌ జడ్పీ సీఈఓ

పనితీరు ఆధారంగా లభించే ఈ పురస్కారం మూడో సారి వచ్చేలా కృషి చేస్తాం. దీనికోసం ఎలా ముందుకు పోవాలనేది పాలకవర్గ సభ్యులతో పాటు, అధికారుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తాం. తప్పనిసరిగా కొత్త పాలకవర్గం పురస్కారం అందుకునేలా ప్రయత్నిస్తాం. దీనికోసం ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందింస్తాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.