close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

వానలే వానలు....

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కుందూ నది

 పలుచోట్ల వాగులు పొంగి నిలిచిన రాకపోకలు

 ప్యాపిలిలో అత్యధికంగా 12 సెం.మీ. వర్షపాతం నమోదు

 9 శాఖల పరిధిలో రూ.192 కోట్ల నష్టం అంచనా

31,173 హెక్టార్లలో రూ.43.41 కోట్ల పంట నష్టం

 

నంద్యాల పురపాలక కార్యాలయం వద్ద జలమయమైన రహదారి

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో నాలుగో రోజు ప్యాపిలిలో 12 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. పాణ్యంలో 9.3, నంద్యాలలో 9.0, మహానందిలో 8.2, బండి ఆత్మకూరు 7.2, గోస్పాడు 6.8, తుగ్గలి 6.2, కోసిగి 6.1, మిడ్తూరు 5.4, రుద్రవరం 5.2, ఓర్వకల్లు 4.7 సెం.మీ. వర్షం కురిసింది. జిల్లాలో సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ. కాగా.. ఈ నెల 16వ తేదీ నుంచి గడిచిన నాలుగు రోజుల్లోనే 131.9 మి.మీ. వర్షం జిల్లా సగటున కురిసింది.

వాగులు పొంగి పొర్లుతున్నాయ్‌!

గడివేముల, మిడుతూరు, ఓర్వకల్లు, పాణ్యం పరిధిలో కురుస్తున్న వర్షాలకు కుందూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గడివేములలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కుందూ ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో గడివేముల-మిడుతూరు మధ్య వాహనాలను నిలిపి వేశారు. బనగానపల్లె మండలంలో పచ్చర్ల వాగు ఉద్ధృతికి నంద్యాల-బనగానపల్లి మధ్య సాయంత్రం వరకు రాకపోకలు ఆగిపోయాయి. వేదవతి నది నిండుకుండలా మారింది. హంద్రీలో చేరే ఆస్పరి పుప్పాలదొడ్డి వద్ద వాగు పొంగిపొర్లడంతో ఎమ్మిగనూరు వెళ్లే వాహనదారులంతా ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పరి మండలం చిన్నహోతూరు ఆయకట్టు చెరువుకు ఆరుచోట్ల గండ్లు పడి నీరంతా వృథాగా పోయింది. నందికొట్కూరులోని నక్కల వాగు పొంగడంతో వడ్డెమాను గ్రామంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. చాగలమర్రి పరిధిలోని మద్దూరు- బ్రాహ్మణపల్లి మధ్య కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోసిగిలో చాప వాగు ఉద్ధృతి ఇంకా తగ్గ లేదు. బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వస్తూ గల్లంతైన వీరేశ్‌ మృతదేహం గురువారం లభ్యమైంది. అటవీ శాఖ తవ్విన కందకాల్లో వర్షపు నీరు నిండి అహోబిలం గ్రామంలో చెంచు కాలన్లీకి ప్రవేశించాయి. ఆళ్లగడ్డ వద్ద తెలుగుగంగ పంట కాల్వల నీళ్లు ప్రమాదకర స్థాయిలో రోడ్లపై ప్రవహించడంతో ఆళ్లగడ్డ-అహోబిలం బస్సు సర్వీసులను రద్దు చేశారు. కుందూ నది ఉప్పొంగడంతో గడివేముల మండలంలో ఇళ్లన్నీ జలదిగ్బంధం అయ్యాయి. పాణ్యంలో మట్టిమిద్దె కూలి పడిపోయింది. కల్లూరు సమీపంలో హంద్రీ నదిపై వంతెనకు రంధ్రం ఏర్పడటంతో రక్షణ చర్యలు చేపట్టారు. వర్షాలకు 14 వేల ఇళ్లను 24 గంటలపాటు వరద నీరు చుట్టిముట్టింది. పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఆశ్రయం కల్పించారు. వరద ప్రాంతాల్లో స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించి నష్టపోయిన కుటుంబాలకు రూ.5 వేలు, పంట దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ.20 వేలు తక్షణం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

భగవంతునికీ తప్పని వరద పోటు

జిల్లాలో జోరు వానలకు పలు దేవాలయాల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఆలయ ప్రాంగణాలంతా వరద నీటితో దర్శనమిస్తున్నాయి. నంద్యాలలో కోట వీధిలోని బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయంలో వర్షం ధాటికి ఊట నీరు చేరింది. ప్రాంగణంలోని పురాతన బావి సైతం వాన నీటితో నిండి పైకి వచ్చాయి. 32 ఏళ్ల తర్వాత మళ్లీ గర్భాలయంలోకి నీరు ప్రవేశించినట్లు ఆలయ పూజారి మురళీకృష్ణ శర్మ తెలిపారు. నాగలింగేశ్వరస్వామి ఆలయంలో వర్షపు నీరు గర్భ గుడిలోకి చేరింది. గుడిపాడు గడ్డలోని మల్లికార్జునస్వామి గర్భాలయంలో సైతం వర్షపు నీరు చేరింది. అవుకు పరిధిలోని ఓబులాపురంలో దస్తగిరి స్వామి దర్గా వద్ద వరద నీరు చుట్టిముట్టింది.

పెరిగిన పంట నష్టం

బుధవారానికి 29,847 హెక్టార్లలో పంట నష్టం కాగా, గురువారం వర్షానికి 1326 హెక్టార్లకు నష్టం పెరిగింది. జిల్లాలో వర్షాలకు 10,996 మంది రైతులు 31,173 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.43.41 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. పసుపు, అరటి వంటి ఉద్యాన పంటలు 2 వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి.

పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలకు గ్రామాలే జలదిగ్బంధమయ్యాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగి రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.