close

గురువారం, అక్టోబర్ 17, 2019

ప్రధానాంశాలు

బడులకు.. విద్యుత్తు బకాయిల దడ

● రూ.1.44 కోట్ల మేర పేరుకుపోయిన బిల్లులు

● బయోమెట్రిక్‌ ఛార్జింగ్‌కూ తిప్పలే..

న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌


ఈ పాఠశాలకు విద్యుత్తు కనెక్షన్‌ లేక పోవడంతో ఇంటి వద్ద బయోమెట్రిక్‌

యంత్రాన్ని ఛార్జింగ్‌ చేసి తెచ్చి విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్న ఉపాధ్యాయుడు

ప్రభుత్వ బడుల్లో విద్యుత్తు బకాయిలు గుట్టలా పేరుకుపోయాయి. దాదాపు అన్ని పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించినా బిల్లుల చెల్లింపులో తాత్సారం జరుగుతోంది. జిల్లాలో విద్యుత్తు శాఖకు ప్రభుత్వ విద్యా సంస్థలు రూ.1.44 కోట్ల మేర బకాయిలు చెల్లించాలి. దీంతో కొన్ని బడులకు విద్యుత్తు శాఖ సరఫరాను నిలిపివేసింది. దీంతో ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ యంత్రాలను ఛార్జింగ్‌ కోసం సిబ్బంది ఇంటి వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ప్రతి నెల బిల్లులు చెల్లించకపోవడంతో అదనపు రుసుముతో బకాయిలు మరింత పెరుగుతూ భారంగా మారుతున్నాయి. నిర్వహణ నిధులు వస్తున్నా.. అవి సరిపోవడం లేదని కొందరు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

జిల్లాలో మండల, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలు 719, కస్తూర్బాలు 15 ఉన్నాయి. వీటిలో 24 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. కస్తూర్బాలతో కలిపి 620 పాఠశాలల్లో 816 బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. మిగతా పాఠశాలల్లో యంత్రాలను అమర్చాల్సి ఉంది. విద్యా శాఖ లెక్కల ప్రకారం ఇంకా 211 పాఠశాలలకు విద్యుత్తు కనెక్షన్‌లు లేనట్లు చెబుతున్నారు. విద్యుత్తు శాఖ లెక్కల ప్రకారం 691 పాఠశాలల్లో విద్యుత్తు కనెక్షన్లు ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో 513 పాఠశాలలు రూ.1,08,74,230 బకాయిలు ఉన్నాయి. 57 పాఠశాలలు రూ.8,93,247 విద్యుత్తు బకాయి పడడంతో వారు బిల్లులను నిలిపి వేశారు. మరో 121 పాఠశాలలు 26,70,097 బకాయిలు ఉండడంతో విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. విద్యుత్తు లేని చోట్ల పాఠశాల సిబ్బంది ఇంటి వద్ద బయోమెట్రిక్‌ యంత్రాలను ఛార్జింగ్‌ చేసుకొని తీసుకువస్తున్నారు. పారదర్శకత పెరగడంతో పాటు మధ్యాహ్న భోజనపథకంలో జవాబుదారీతనం ఉండేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది కూడా ఈ యంత్రాల్లో వేలి ముద్ర  వేసి హాజరు నమోదు చేసుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికి తగ్గట్టు విద్యార్థుల సంఖ్యను బట్టి బడులకు యంత్రాలను పంపిణీ చేశారు. కానీ చాలా చోట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది బయోమెట్రిక్‌ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్నా.. విద్యార్థుల విషయంలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. పిల్లల వేలి ముద్రలు సరిగా పడకపోవడం, సంకేతాలు, విద్యుత్తు సమస్య, ఇతరాత్ర కారణాలతో కొన్ని చోట్లే అమలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్‌ మండలం రౌఠసంకెపెల్లి పంచాయతీ పరిధిలోని పర్సనంబాల ప్రాథమికోన్నత పాఠశాల. ఇక్కడ 156 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయిదుగురు ఉపాధ్యాయులు, ఇద్దరు వీవీలు విధులు నిర్వహిస్తున్నారు. రెండు బయోమెట్రిక్‌ పరికరాలు ఇచ్చారు. ఇక్కడ విద్యుత్తు లేదు. దీంతో సిబ్బంది ఇంట్లో వీటిని చార్జింగ్‌ చేసి నిత్యం బడికి తేవాల్సి వస్తుంది.

భారంగా విద్యుత్తు బిల్లులు..

ప్రభుత్వ బడుల్లో విద్యుత్తు బకాయిల భారం గుదిబండగా మారుతోంది. మొత్తం 691 పాఠశాలలు రూ.1,44,37,574 విద్యుత్తు బకాయిలు పేరుకుపోయాయి. పాఠశాలలకు వచ్చే నిర్వహణ నిధుల నుంచే విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. నిర్వహణ నిధులను విద్యార్థుల సంఖ్యనుబట్టి కేటాయిస్తున్నారు. వీటిని చాక్‌పీస్‌లు, పేపర్లు, రిజిస్టర్‌లు, పరీక్షల నిర్వహణ సామగ్రి, సబ్బులు, మరుగుదొడ్ల శుభ్రత, చిన్నపాటి మరమ్మతులు, అంతర్జాలం, కిటికీలు, తలుపులు, ఇతరాత్ర వాటి మరమ్మతులు, జాతీయ పర్వదినాల నిర్వహణ కోసం వినియోగించాలి. కొన్ని పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యుత్తు మోటార్‌తో నడిచే బోర్లు ఉన్నాయి. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి ఇలాంటి వసతులున్న వాటికి నెలకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది. ప్రభుత్వ బడులకిచ్చే విద్యుత్తు కనెక్షన్‌ను విద్యుత్తు శాఖ కేటగిరి-7 లో చేర్చింది. ఈ నేపథ్యంలో ఒక్కో యూనిట్‌కు రూ.7.30 వసూలు చేస్తున్నారు. దీంతో బడుల నిర్వహణ కోసం వచ్చే నిధుల్లో సింహభాగం విద్యుత్తుకే చెల్లిస్తే మిగితా వాటి పరిస్థితేంటని కొందరు హెచ్‌ఎంలు ఆవేదన చెందుతున్నారు. కొందరు బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లారు.. కొత్తగా వచ్చిన వారు పాత బకాయిలు ఎలా చెల్లించేదని తలలు పట్టుకుంటున్నారు. విద్యుత్తు బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్నారు.

● విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాల నిర్వహణ నిధులను విడుదల చేస్తుంది. ఈ ఏడాది జులైలో మొదటి విడతగా జిల్లాలో 696 పాఠశాలలకు రూ.38,38,354 విడుదల చేసింది. వీటిని ఆయా పాఠశాలల ఎస్‌ఎంసీ కమిటీల ఖాతాల్లో జమ చేశారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది దహెగాం మండలం మేకలగూడ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు, 13 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యుత్తు లేకపోవడంతో ఇతరుల ఇళ్లలో చార్జింగ్‌ పెట్టి హాజరు నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఇలా 211 పాఠశాలల్లో విద్యుత్తు కనెక్షన్‌లు లేవు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.