close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

  అమలు కాని జీవో.. అందని వేతనాలు

● అయిదు నెలలుగా అందని బకాయిలు

● పండగ పూట పస్తులు

● ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన

న్యూస్‌టుడే, కాగజ్‌నగర్‌

కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు

వేకువజామునే రహదారులు ఊడ్ఛి. చెత్తాచెదారాన్ని డంపింగ్‌యార్డులకు తరలిస్తారు. దుర్వాసనలోనూ మురుగు కాలువ పూడిక తొలగింపు ఇలా ఎన్నో పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. మూడేళ్లుగా ఆ జీవో అమలు కావడం లేదు. ప్రతి నెల అందాల్సిన వేతనాలు నాలుగు, అయిదు నెలలు గడిచినా మంజూరు చేయడం లేదు. అనారోగ్యం పాలవుతున్న కార్మికులకు కనీసం వైద్య సేవల విషయంలోనూ పట్టించుకోవడం లేదు. ఒక వైపు అనారోగ్యం.. మరో వైపు పస్తులుంటూ పారిశుద్ధ్య పనులు చేస్తున్నా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల ధీనగాథపై కథనం

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ పురపాలికలో 141 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు, 18 మంది ఎన్‌ఎంఆర్‌ పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఒప్పంద, ఎన్‌ఎంఆర్‌ కార్మికులకు మే మాసం నుంచి వేతన బకాయిలు చెల్లించాలి. రేపు..మాపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు.

 

ప్రభుత్వ జీవో
పురపాలికలో పని చేసే పారిశుద్ధ్య, విద్యుత్తు, నీటి సరఫరా విభాగంలో పని చేసే కార్మికులకు జీవో నెం.6054/2016-ఎం2 ను 12-08-2016న విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి రేడియం జాకెట్లు, గ్లౌవ్స్‌, షూ, నూతన దుస్తులు పంపిణీ చేయాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా రేయిన్‌ కోట్‌లు, ప్రతి నెల 100 గ్రాముల సబ్బులు, 500 గ్రాముల కొబ్బరినూనె పంపిణీ చేయాలి. ప్రతి నెల కార్మికుడికి వైద్య పరీక్షలు, ప్రతి నెల మొదటి ఆదివారం ‘హెల్త్‌ డే’ పాటించాలని ఉత్తర్వులో పేర్కొంది. స్థానిక పురపాలిక అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. నేటికీ ఏ కార్మికుడికి ఈ సామగ్రిని పంపిణీ చేసిన దాఖలాలు లేవు.
ఏడాదిగా నిలిచిన వైద్య సేవలు
పురపాలిక పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో స్థానిక బల్దియా అధికారులు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ పేరిట ప్రతి కార్మికుడి వేతనం నుంచి దాదాపు రూ.1200 వరకు కోత విధిస్తున్నారు. ఆ కోత విధించిన డబ్బులను ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వారి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి.
కాని అధికారులు ఏడాదిగా చెల్లించడం లేదు. దీంతో కాగజ్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో పురపాలిక పారిశుద్ధ్య కార్మికులకు వైద్య సేవలను నిలిపి వేసింది. వర్షాకాలంలో జ్వరం, ఇతర వ్యాధులతో బాధపడుతున్న కార్మికులు వైద్య సేవల నిమిత్తం ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళితే, నిరాకరిస్తున్నట్లు పలువురు కార్మికులు ఆరోపించారు. వేతనాల్లో కోత విధించిన డబ్బులను సత్వరమే చెల్లించి, ఈఎస్‌ఐ ఆసుపత్రిలో వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

అంధకారంలో గడుపుతున్నాం :
నగేష్‌, ఒప్పంద కార్మికుడు

అయిదు నెలలుగా వేతనాలు లేవు. విద్యుత్తు బిల్లు చెల్లించక పోవడంతో సంబంధిత అధికారులు విద్యుత్తును తొలగించారు. అంధకారంలో నివాసముంటున్నాం. చిరు వ్యాపారుల సైతం అరువుకు నిత్యావసర వస్తువులను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. పస్తులుంటూ పనులు చేస్తున్నాం. మరో పదిహేను రోజుల్లో దసరా పండగ ఉంది. కనీసం ఆ పండగకైనా వేతన బకాయిలు చెల్లించాలని వేడుకుంటున్నాం.
త్వరలోనే బకాయిలు చెల్లించేందుకు చర్యలు
      - తిరుపతి, కమిషనర్‌, పురపాలిక

ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలను త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. జీవో ప్రకారం కార్మికులకు వివిధ వస్తువులను కూడా అందజేస్తాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.