close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

స్త్రీనిధి బకాయిలు 16.04 శాతం

వడ్డీలేని రుణాలకు దూరమవుతున్న సంఘాలు

చెల్లింపులు లేకపోవడంతో మహిళలపై భారం

న్యూస్‌టుడే, పాలవరు


మహబూబ్‌నగర్‌ : స్త్రీనిధి బకాయిలపై సమీక్షిస్తున్న జోనల్‌ మేనేజర్‌ సంజీవరెడ్డి

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- స్త్రీనిధి అధికారులు, సిబ్బంది తీరుతో పేద మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారంతా కొత్త రుణాలు పొందడానికి, వడ్డీలేని రుణాలు తీసుకోవడానికి అర్హత కోల్పోతున్నారు. వడు నెలల నుంచి సెర్ప్‌ - స్త్రీనిధి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. కాని ఆ సమస్యను ఇంతవరకు పరిష్కరించకుండా మహిళా సంఘాలకు వారు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నారు. స్త్రీనిధి నుంచి తీసుకున్న రుణాలను తిరిగి కడితేనే ఇతర సభ్యులకు కొత్త రుణాలు వస్తాయి. అంతేకాకుండా సభ్యురాళ్లు చెల్లించిన కిస్తుల్లో వడ్డీ కూడా ఉంటుంది. ప్రభుత్వం కొన్ని నెలల తరవాత మహిళలు కట్టిన వడ్డీని తిరిగి వారికే చెల్లిస్తోంది. అంటే రుణాలు పొందిన ఎస్‌హెచ్‌జీ కాని వీవోలు కాని 90 రోజుల వ్యవధిలో కిస్తులను చెల్లించాల్సి ఉంటుంది. అలా ఉంటేనే సక్రమంగా కిస్తులను చెల్లిస్తున్న సంఘాలకు వీఎల్‌ఆర్‌ (వడ్డీ లేని రుణం) వస్తుంది. కాని ఇప్పుడు ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. దీంతో మహిళలపై అదనపు భారం పడుతుంది. ప్రతి నెలా తీసుకున్న రుణంతోపాటు వడ్డీని కలిపి చెల్లిస్తుంటారు. కాని వీటిని ఇప్పుడు చెల్లించకపోవడంతో అదనపు వడ్డీ మహిళా సంఘాలపై పడుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 822 గ్రామైక్య సంఘాలు, వాటి పరిధిలో ఉన్న 6,181 స్వయం సహాయక సంఘాలు స్త్రీనిధికి అర్హతను కోల్పోయాయి. వాటిలోని సభ్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో 2 శాతం ఉన్న బకాయి ఇప్పుడు ఐకేపీ సిబ్బంది ఆయా మండలాలు, గ్రామ పంచాయతీలలో పూర్తిగా సహకరించకపోవడంతో 16.04 శాతానికి చేరింది.

చిన్నచింతకుంట : బండర్‌పల్లిలో స్త్రీనిధి బకాయిలను వసూలు చేస్తున్న ఉద్యోగి

పరిష్కారం కాని సమస్య : సెర్ప్‌లో పనిచేస్తున్న ఏపీఎంలు, సీసీల అధికారాలను స్త్రీనిధి నుంచి తొలగించడంతో వడు నెలల నుంచి ఈ సంస్థ ఉద్యోగులు స్త్రీనిధికి సహకరించడం లేదు. దీంతో స్త్రీనిధి బకాయిలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా సెర్ప్‌ నుంచి స్త్రీనిధి బాధ్యతలను చూడాల్సిన పని లేదని ఉత్తర్వులు రావడంతో సిబ్బంది కూడా అంతగా పట్టించుకోవడం లేదు.

చర్యలు తీసుకుంటున్నాం : స్త్రీనిధి బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోయాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. పెరిగిన బకాయిలను తగ్గించడానికి, మహిళల వద్ద నుంచి రుణాలను వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అందుకు ఐకేపీ ఉద్యోగులు సహకరించాలని సెర్ప్‌ సీఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయినా బకాయిల శాతం పెరిగిపోతూనే ఉంది. మా సిబ్బందికి సెర్ప్‌ ఉద్యోగులు కూడా పూర్తిగా సహకరించి బకాయిలను వసూలు చేయాలి. లేకపోతే సంఘాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

- విద్యాసాగర్‌రెడ్డి, స్త్రీనిధి డీజీఎం

సెర్ప్‌ సీఈవో ఆదేశాల ప్రకారం విధులు : సెర్ప్‌ సీఈవో ఆదేశాల ప్రకారమే క్షేత్రస్థాయిలో విధులు చేపడుతున్నాం. స్త్రీనిధికి చెందిన విధులు మాకు సంబంధం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందువల్లనే మేము ఆ పనులు చేయడం లేదు. గతంలో మాకు పూర్తి అధికారాలు ఉండేవి. వాటిని స్త్రీనిధి అధికారులు తొలగించారు. అందువల్లనే సమస్య వచ్చింది.

- సుదర్శన్‌, ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.