close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

మారాలి..మార్పు రావాలి

పురపాలికలో స్వచ్ఛ ప్రణాళిక అమలుకు కృషి

జిల్లా కేంద్రంలో చర్యలు

అసిస్టెంట్‌ కలెక్టర్‌కు పర్యవొేక్షణ బాధ్యతలతో సత్ఫలితాలు

పాలిథిన్‌ను నియంత్రించాలని ప్రదర్శన నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: పురపాలికలో స్వచ్ఛ ప్రణాళిక అమలుకు అడుగులేస్తున్నారు. వార్డుల్లో పక్కాగా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. 30 రోజుల స్వచ్ఛత కార్యక్రమాలు మొన్నటి వరకు గాడి తప్పాయి. ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఉన్న చందర్‌నాయక్‌ను తొలగించి టీపీవో శైలజకు బాధ్యతలు అప్పగించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ పర్యవేక్షిస్తున్నారు. విధులు విస్మరించిన ఇద్దరు అధికారులపై ఈ పాటికే చర్యలు చేపట్టిన జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పురపాలికను గాడిలో పెట్టేందుకు దృష్టి సారించారు.

జిల్లా కేంద్రంలో పాత వార్డులు 33 కు అదనంగా 16 కొత్తవి తోడయ్యాయి. వార్డుల సంఖ్య 49 కి చేరుకుంది. ఆయా కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ లేక రోజురోజుకి పరిస్థితి గాడి తప్పుతోంది. ప్రజలు ఫిర్యాదు చేసినా తక్షణ స్పందన కొరవడుతోంది. ఉన్నతాధికారుల అజమాయిషి లేక పాలకవర్గం హయాంలో పాలన ఇష్టారాజ్యంగా మారింది. ప్రత్యేకాధికారి పగ్గాలు చేపట్టాకా పరిస్థితిలో మార్పు వస్తోంది. పారిశుద్ధ్యం, వ్యర్థాల తొలగింపు, పాలిథిన్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.


పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో చర్యలు

నిత్యం వార్డుల్లో చైతన్య కార్యక్రమాలు

49 వార్డుల్లో స్వచ్ఛ ప్రణాళికను అమలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి వార్డుల ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. నిత్యం ఎంపిక చేసిన వివిధ వార్డుల్లో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాముల్ని చేస్తున్నారు. ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. మాజీ ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనులు నిర్వహిస్తున్నారు.

స్వచ్ఛ కామారెడ్డి దిశగా

తేజస్‌ నందలాల్‌ పవార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌

స్వచ్ఛ కామారెడ్డి దిశగా సమష్టిగా అడుగులేయాలి. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలి. వార్డుల్లో ఈ పాటికే స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నాం. స్పందన బాగుంది. స్వచ్ఛ ప్రణాళిక అమలులో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం. పరిసరాల పరిశుభ్రత పాటించి స్వచ్ఛతకు పాటుపడుదాం.

వార్డులో పిచ్చిమొక్కలు తొలగిస్తున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌

పాలిథిన్‌పై సమరభేరి

జిల్లా కేంద్రంలో పాలిథిన్‌ను నియంత్రించాలని విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. అక్టోబర్‌ 2 వ తేదీ నుంచి ఎక్కడా కూడా పాలిథిన్‌ వినియోగించరాదని అవగాహన కల్పిస్తున్నారు. ఈ పాటికే కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో పాలిథిన్‌ సంచులు విక్రయించే వ్యాపారులకు రూ. 5000 జరిమానా విధిస్తామని తీర్మానించారు. వచ్చే నెల 2 వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఇక వార్డుల్లో జనపనార సంచులను వినియోగించే వారికి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే విక్రయాలకు అడ్డుకట్ట వేస్తేనే పర్యావరణ మనుగడ సాధ్యమని భావిస్తున్నారు.

నిత్యం సమన్వయం

శైలజ, ఇన్‌ఛార్జి కమిషనర్‌

స్వచ్ఛ ప్రణాళికలో భాగంగా నిత్యం ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నాం. వార్డుల్లో ప్రధాన కూడళ్లలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. నివాసాల్లో చెత్త ఉత్పత్తిని నియంత్రించుకుంటే బాగుంటుంది. సేకరించిన చెత్తను తరలించడానికి కష్టమవుతోంది. ఎక్కడికక్కడ చెత్తపై సమరభేరిని మోగించాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.