close

గురువారం, అక్టోబర్ 17, 2019

ప్రధానాంశాలు

సమస్యలకు ఇక సెలవు

ప్రణాళిక అమలుతో ఊపందుకున్న పనులు ●

నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా పారిశుద్ధ్య చర్యలు

బేల, న్యూస్‌టుడే:

బేలలో విద్యుత్తు స్తంభాన్ని సరిచేస్తున్న సిబ్బంది

గ్రామ వికాసానికి బాటలు వేసేందుకు చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యోన్ముఖులు అయ్యారు. ఏళ్లనాటి సమస్యలు ప్రణాళికలో భాగంగా పరిష్కారం అవుతుండటంతో పల్లెవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 116 పంచాయతీలు ఉండగా ఆయా గ్రామాల పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక బృందాలుగా నియమించి, పల్లెల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. గ్రామానికో ప్రత్యేకాధికారిని కేటాయించి, అక్కడి అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు.

నియోజకవర్గంలోని ఆదిలాబాద్‌, జైనథ్‌, బేల, మావల మండలాల్లోని 116 పంచాయతీల్లో ఈ నెల ఆరో తేదీన ప్రారంభించారు. నెల రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేకాధికారులు గ్రామాల్లో వాడవాడలా తిరుగుతూ ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఆరు మొక్కలను నాటేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లలో నిర్మించుకున్న మరుగుదొడ్లను వినియోగించుకోవాలని వివరిస్తున్నారు. కొన్ని పంచాయతీల పరిధిలో కార్యక్రమం బాగానే అమలవుతున్నా మరికొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

నిధుల విడుదలతో ప్రజాప్రతినిధులకు ఊరట

కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర నుంచి గ్రామాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులకు కొంత ఊరట లభించింది. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఎన్‌ఎఫ్‌సీ నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ చేశారు. వాటిని తప్పనిసరిగా పారిశుద్ధ్యం, క్లోరినేషన్‌కు వినియోగించాల్సి ఉండటంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కొంతకాలంగా నిధుల లేమితో ఇబ్బందులు పడ్డ సర్పంచులు ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

గ్రామాభివృద్ధి ప్రణాళికే గీటురాయి..

అధికారులు, నాయకులు గ్రామంలో పర్యటించిన సందర్భాల్లో రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డుపక్కల సున్నంతో గీతలు గీయడమొక్కటే పాలకమండలి బాధ్యత కాదు. గ్రామంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించి, నిధుల లభ్యతను బట్టి అభివృద్ధి పనులు చేపట్టడానికి బాధ్యతగా భావించాలి.

పరిశుభ్రతతోనే ఆదాయం

పారిశుద్ధ్య నిర్వహణ పంచాయతీలకు భారంగా మారుతుందనే నానుడిని తిరగరాయటానికి పాలక మండళ్లకు చక్కని అవకాశమిది. పరిసరాలను అపరిశుభ్రం చేసిన వారికి ఏ మేరకు జరిమానా విధించాలో ప్రజాక్షేత్రంలోనే నిర్ణయించి అమలు చేయాలి. అదే విధంగా గ్రామంలో సేకరించిన తడిచెత్తతో కంపోస్టు ఎరువు, పొడి చెత్తతో కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకుంటే బాగుంటుంది.

పల్లెల్లో పచ్చదనం నింపాలి..

ప్రతి ఇంట్లో మొక్కలు ఉండే విధంగా చూడటమే కాకుండా ప్రభుత్వ, సామాజిక స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. సంరక్షణ బాధ్యతను గ్రామంలోని యువకులు, విద్యార్థులకు అప్పగించాలి. విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు, వదులుగా ఉన్న తీగలు, శిథిలమైన స్తంభాలను సవరించే బాధ్యతలను స్థాయీ సంఘం నిర్వహించే విధంగా కార్యాచరణ ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రజలతో అనుసంధానం చేసే పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసే బాధ్యతను స్థాయీ సంఘాలు చేపడితే ఫలితాలు బాగుంటాయి.

బేల మండల మణియార్‌పూర్‌లోని ఆత్రం బాపురావు ఇంటి ఆవరణలో దశాబ్దాల నాటి బావి నిరుపయోగంగా ఉండేది. 30రోజుల ప్రణాళికలో భాగంగా సర్పంచి వాడ్కర్‌ తేజారావు స్పందించి బావిని పూడ్చివేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

బేల మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారి పక్కనే కొంత మంది పెంటకుప్పలు వేయడంతో దోమలకు ఆవాసంగా మారేది. ప్రణాళికలో భాగంగా సర్పంచి ఇంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పెంటకుప్పలను తొలగించి పాత మురుగు కాలువలోని పూడికను తొలగించడంతో దీర్ఘకాలిక సమస్య తీరింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.