close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

నవ తరం..నృత్య తరంగం

భరత నాట్యంలో ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ప్రతిభ
లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోనూ చోటు
ఈనాడు, హైదరాబాద్‌

ఆ యువకుడి సాంకేతిక ప్రయాణానికి సంప్రదాయ కళ తోడైంది.. నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడుతూ.. సాంస్కృతిక వేదికలపైనా లయబద్ధంగా పాదం కదుపుతూ ఆకట్టుకుంటున్నాడు. అతని నృత్య ప్రతిభకు రికార్డులూ దాసోహమన్నాయి. చిన్న వయసులోనే భరతనాట్యంలో ప్రతిభతో ఉపకార వేతనం అందుకుని తనలో కళకు మరింత సానపెడుతున్నాడు గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ విద్యార్థి సుప్రీత్‌.ఎస్‌.కరన్‌.

ప్రయాణం సాగిందిలా..
సుప్రీత్‌ మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు సునీత, సుధాకర్‌న్‌ల ప్రోత్సాహంతో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాడు. నాలుగున్నరేళ్ల వయసులోనే తొలిసారిగా ఎల్బీ స్టేడియం వద్ద మొదటి ప్రదర్శన ఇచ్చాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు నృత్య సాధన చేసేవాడు. గురువులు వి.ఎస్‌.రామమూర్తి, మంజులా రామస్వామి శిష్యరికంలో భరతనాట్యంలో..ముఖ్యంగా శివ తాండవంలో ప్రావీణ్యం సాధించాడు. ప్రస్తుతం సుప్రీత్‌ కుటుంబం న్యూబోయిన్‌పల్లిలో ఉంటోంది. ఇంటర్‌ చేశాక జేఈఈలో మంచి ర్యాంకుతో గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించాడు. ఈసీడీ(డ్యుయల్‌ డిగ్రీ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. సంప్రదాయ కళలో సత్తా చాటుతూనే ఈ వేసవిలో ‘గూగుల్‌ సమ్మర్‌ ఆఫ్‌ కోడ్‌’లో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాడు.

రికార్డులు సొంతం
2011లో రవీంద్రభారతిలో సుప్రీత్‌ చేసిన ప్రదర్శనకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది. రెండు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని.. తలపై మూడు చెంబులు పెట్టుకుని గంట పాటు మట్టికుండపై నాట్యం చేస్తూ ప్రదర్శన ఇచ్చాడు. వీక్షకులందరూ మంత్రముగ్ధులయ్యారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోనూ చోటు దక్కింది. 2012లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చి అభినందనలు అందుకున్నాడు. రవీంద్రభారతి, శిల్పారామం వేదిక పలుమార్లు ప్రదర్శనలతో మన్ననలు అందుకున్నాడు. తబలా వాయిద్యంలోనూ సుప్రీత్‌కు పట్టు ఉంది. 2016, 2017-18లో ద్వారకలో జాతీయ సాంస్కృతికోత్సవంలో కూడా పాల్గొని ప్రశంసలు పొందాడు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాంస్కృతిక పరిశోధన, శిక్షణ కేంద్రం(సీసీఆర్‌టీ) ఉపకార వేతనాన్ని రాష్ట్రంలో భరతనాట్యం తరఫున ఒక్కడే సాధించడం విశేషం. క్రీడల్లోనూ ముందుంటూ.. ట్రిపుల్‌ ఐటీలో నిర్వహించిన 10కి.మీ. పరుగులో బంగారు పతకం, 25 కి.మీ.సైక్లింగ్‌లో రజతం సాధించాడు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.