close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

బీటెక్‌ విద్యార్థులకూ.. బయోమెట్రిక్‌!

అన్ని యూజీల్లో అమలు దిశగా జేఎన్‌టీయూ
గైర్హాజరును నియంత్రించే చర్యలు మొదలు
ఇప్పటికే పీజీ కళాశాలల్లో వర్తింపు
ఈనాడు, హైదరాబాద్‌

విద్యార్థుల హాజరులో పూర్తి పారదర్శకత తెచ్చేందుకు జేఎన్‌టీయూ ప్రయత్నాలు ప్రారంభించింది. బీటెక్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలోనే విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలల్లోనూ యంత్రాలు అమర్చి హాజరు తీసుకునే దిశగా ముందడుగు పడుతోంది. దీంతో గైర్హాజరుకు చెక్‌ పడటంతో పాటు కొన్ని కళాశాలల అక్రమాలకు అడ్డుకట్ట పడటం తథ్యం. జేఎన్‌టీయూకి చెందిన 240 కాలేజీల్లో అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు పద్ధతిని ఇప్పటికే అనుసరిస్తున్నారు. ఏడాదిన్నర కిందటే దీన్ని ప్రారంభించారు. పీజీ, ఎంబీఏ కళాశాలల్లోనూ ఇదే రీతిని పాటిస్తున్నారు. దాదాపు 25వేలమంది బోధకులు, తదితరులతో పాటు 11వేల మంది పీజీ విద్యార్థులు నిత్యం బయోమెట్రిక్‌ కనుసన్నల్లోనే ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజే వారి హాజరు వివరాలన్నీ వర్సిటీకి తెలిసిపోతున్నాయి. అప్పట్లో అధిక సంఖ్యలో హాజరు యంత్రాలు కావాల్సి ఉండటంతో, యూజీ(బీటెక్‌, బీఫార్మసీ) స్థాయిలో బయోమెట్రిక్‌ను ఆచరించలేదు. పరిధిలోకి వాటినీ తీసుకురావాలన్నదే అధికార యంత్రాంగం తాజా నిర్ణయ సారాంశం.

కొన్ని యాజమాన్యాల ఆట కట్టించేలా..
ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థుల హాజరు రోజురోజుకూ తగ్గిపోతోంది. తరగతులకు పలువురు సవ్యంగా రాకపోవడంతో, చివరికి పరీక్షలు రాసే అనుమతి లభించడం లేదు. మరికొన్ని కళాశాలల్లో గైర్హాజరును ఆయా యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. విద్యార్థులు సక్రమంగా రాకున్నా, వారి నుంచి డబ్బు తీసుకుని..సరిపడా హాజరు ఉన్నట్లు చూపిస్తున్నాయి. దీనివల్ల రోజూ వచ్చేవారికి,  రానివారికి తేడా లేకుండాపోతోంది. ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేసేందుకు బయోమెట్రిక్‌ ఒక్కటే సరైనదని జేఎన్‌టీయూ నిర్ణయించుకుంది. పీజీ స్థాయిలో సత్ఫలితాలు వస్తుండటంతో ఇతర స్థాయుల్లోనూ విస్తరించనుంది.

టీఎస్‌టీఎస్‌ సాంకేతిక చేయూత
వర్సిటీకి సంబంధించి ఉన్న 160 బీటెక్‌, 70 బీఫార్మసీ కాలేజీల్లో నూతన వ్యవస్థ రానుంది. ఈ కోర్సుల్లో (అన్ని సంవత్సరాల్లో కలిపి) సుమారు 2.50లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రతి యంత్రంతోనూ వందమంది నుంచి వేలిముద్రలు తీసుకునే వీలుంటుంది. అందుకే 2500 యంత్రాలను కళాశాలల్లో అమర్చాల్సి ఉంంది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ (టీఎస్‌టీఎస్‌) నుంచి సాంకేతిక సహకారం తీసుకోనున్నారు. యంత్రాలను కొనుగోలు చేసి ఉంచేందుకు సంసిద్ధమవుతున్నారు. త్వరలోనే వీటిని అమర్చేందుకు కాలేజీలకు ఆదేశాలు జారీచేశారనీ సమాచారం. జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ఎన్‌.యాదయ్య మాటల్లో చెప్పాలంటే- ‘పీజీ విద్యార్థుల పరంగా బయోమెట్రిక్‌ హాజరును ఎప్పటినుంచో తీసుకుంటున్నాం. యూజీ కోర్సులవారికీ ఇకముందు ఇదే తరహాగా ఉంటుంది. జవాబుదారీతనమూ పెరుగుతుంది’.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.