close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

బైపాస్‌ అసంపూర్తి

రద్దీ సమయంలో రాకపోకలు

బోధన్‌ పట్టణం మీదుగా భారీ వాహనాలు

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

కేటాయించిన నిధులు :  రూ. 5కోట్లు

రహదారి పొడవు : 3.1కి.మీ.

పుర ప్రజల ఆందోళనే నిజమైంది. రద్దీ సమయంలో భారీ వాహనాలు పట్టణం మీదుగా ప్రయాణిస్తున్నాయి. జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటనేదే వారి ఆందోళన. అనుకున్నట్లే గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతున్న రాణాసింగ్‌ అనే వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆయన మృతి చెందాడు. ఇప్పుడు ఆయన భార్య, ఏడుగురు సంతానం పెద్ద దిక్కును కోల్పోయింది. దీనంతటికి కారణం.. బోధన్‌ పట్టణ శివారులో అసంపూర్తి బైపాస్‌ రహదారి నిర్మాణమేనని పుర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బైపాస్‌ రహదారి ఏడాది కాలంగా నిర్మాణం సా...గుతూనే ఉంది. వర్షాలకు వేసిన మొరం బురదతో గుంతలమయమైంది. భారీ గోతులతో ఎగుడు దిగుడుగా మారిన దారిలో భారీ వాహనాలు ప్రయాణించలేక అన్ని రకాల లారీలు పట్టణం మీదుగా వెళ్తున్నాయి. పట్టణంలోనే అధ్వాన దారులతో సతమతమవుతుంటే సరకు రవాణా వాహనాలను అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి. రద్దీ సమయంలో నియంత్రణ కొరవడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనతోనైనా భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యేక సమయం కేటాయించాలన్న వాదన తెరమీదికొస్తోంది.

సమస్యకు చెక్‌ పెట్టాలని..

వాస్తవానికి బైపాస్‌ నిర్మాణంలో గత యంత్రాంగం కొన్ని ప్రమాణాలు పాటించకపోవడం వల్లే దారి దెబ్బ తింటోందన్న వాదన ఉంది. వర్షం పడితే వరద ప్రవాహానికి మార్గం లేక దారిపై, పక్కన నీరు నిల్వ ఉండటంతో తారు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఈ రహదారిని బలోపేతం చేయడం సహా విస్తరించాలని రూ.5 కోట్ల నిధులకు ప్రతిపాదనలు చేశారు. నిధులు మంజూరై పనులు ఏడాది కిందట ప్రారంభించారు. కానీ పనులు చేపట్టడంలో జాప్యం నెలకొంది. నిర్మాణ వ్యవధిలోనే రెండు వర్షాకాలాలు దాటివెళ్లాయి. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని పనులు చేపట్టడం లేదని తెలుస్తోంది. అనువైన వాతావరణం ఉన్నప్పుడు ఇతర కారణాలు... ఆ తర్వాత కాలం సహకరించడంలేదని చెప్పడం పరిపాటిగా మారిపోయింది. అసెంబ్లీలో ఎలాగూ చేపట్టిన పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

ఆంక్షలతో అనుమతిస్తేనే..

బోధన్‌ పట్టణం విద్యాలయాలకు నెలవు. ఇక్కడికి పరిసర మండలాల పరిధిలోని విద్యార్థులు వేలాది మంది తరలివస్తుంటారు. ఉదయం, సాయంత్రం విద్యాలయాల వేళల్లో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి దర్శనమిస్తుంటాయి. పిల్లలు సైకిళ్లపై.... మరికొందరైతే ఏకంగా అర్హత లేకున్నా ద్విచక్ర వాహనాలపై వస్తున్నారు. ఇక సాయంత్రం ఉద్యోగుల రాకపోకలు ఉంటాయి. ఇలాంటి క్లిష్టమైన వాతావరణంలో భారీ వాహనాలు ప్రవేశించడం భయాందోళనలకు గురి చేస్తోంది. బైపాస్‌ రహదారి అధ్వాన పరిస్థితుల నేపథ్యంలో భారీ వాహనాలను పట్టణం మీదుగా అనుమతించాల్సి వస్తే... పట్టణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆంక్షలు విధిస్తే మేలన్న వాదన వినిపిస్తోంది. ‘భారీ’ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పుతుందని పేర్కొంటున్నారు. అధికారులు ఆ దిశలో ఆలోచనలు చేయాల్సిన అవసరముంది.

ఇదీ అంతులేని దారి కథ..

తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాష్ట్ర రహదారి బోధన్‌ మీదుగా ప్రయాణిస్తుంది. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు ప్రయాణించడానికి ఈ దారిని ఉపయోగిస్తుంటారు. ఈ దారిలో ఉన్నదే బోధన్‌ పట్టణం. ద్వితీయ శ్రేణి పట్టణంలో లక్ష జనాభా నివసిస్తుండగా.. ఆయా అవసరాల కోసం పరిసర మండలాల నుంచి పట్టణానికి వచ్చే జనాభా అదనం. ఇలా రోజూ ప్రజా రవాణా వాహనాల రద్దీ పట్టణంలో అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌ సమస్యలు ఉండరాదని బైపాస్‌ నిర్మించారు. ఈ రహదారి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపూర్ణ సేవలు ఎన్నడూ అందించలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు... దారి జలమయమే అవుతోంది. ఈ సమస్యతోనే వాహనాలు పట్టణం మీదుగా ప్రయాణిస్తున్నాయి.

గంజ్‌ రోడ్డుదో కథ..

బోధన్‌ గంజ్‌రోడ్డులోనూ కొత్త సమస్య మొదలైంది. ఇదివరకు భారీ వాహనాలు ఇటువైపు నిషేధం. ఆలయం, విద్యాలయాలు, నివాసాలు ఎక్కువగా ఉండటంతో భారీ వాహనాలను నిషేధించారు. కానీ ఇటీవల కేంద్ర గిడ్డంగులకు బియ్యం తరలించడానికి దారిని వినియోగిస్తున్నారు. విద్యాలయాల తరగతులు ముగిసిన సమయంలోనే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేక భారీ వాహనాలు వచ్చినప్పుడు తికమక పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే అనుకోని ఘటనలు చోటు చేసుకుంటే తల్లిదండ్రులకు కడుపుకోత తప్పదు. పోలీసులు ఈ దారిపై దృష్టి సారించాల్సిన అవసరముంది.●

పనులు ప్రారంభించేలా చర్యలు

- జియాన్‌, ర.భ. జేఈ

బైపాస్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని గుత్తేదారుకు చెప్పాం. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం. వర్షాలతో పనుల్లో జాప్యం నెలకొంది. ఇప్పుడు పనులు చేస్తే రహదారి నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.