close

గురువారం, అక్టోబర్ 24, 2019

ప్రధానాంశాలు

కల్తీ భూతంపై సర్కారు కత్తి

ఖాళీ చౌక దుకాణాలకు త్వరలో కొత్త డీలర్లు
మహిళా సంఘాలకు ఆహారశుద్ధి కేంద్రాలు
బలోపేతం కానున్న ప్రజాపంపిణీ వ్యవస్థ

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

రోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆహార పదార్థ్థాల కల్తీపై రోజురోజుకూ ఆందోళనలు వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ఉమ్మడి పాలమూరులోనూ ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న వైనాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా పండ్లలో కార్బైడ్‌, ఇతర రసాయనాలు కలిపి మాగపెడుతున్నారు. వాటిని తిన్న ప్రజలు ఉదర సంబంధ రోగాలబారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని దుకాణాల్లో పండ్లకు రసాయనాలు వాడుతున్నారని వారం రోజుల కిందట ఇద్దరు యువకులు జిల్లా ఆహార కల్తీ నివారణ అధికారులకు ఫిర్యాదు సైతం చేశారు. పాలు కూడా కల్తీ అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ పాలు ఇచ్చేందుకు పశువులకు హానికరమైన ఇంజెక్షన్లను ఇస్తున్నారు. పలు కిరాణం దుకాణాల్లో సైతం వంట సామగ్రి కల్తీ చేస్తున్నారు. జిల్లా ఆహార కల్తీ నివారణ అధికారులు అడపా దడపా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో కల్తీలను నిరోధించలేకపోతున్నారు.
* కల్తీ ఆహార పదార్థాల నిరోధకంలో భాగంగా రేషన్‌ డీలర్ల వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న డీలరు పోస్టులను భర్తీ చేసి కమీషను పెంచుతామని ప్రకటించడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చౌకధరల దుకాణాల్లో పది శాతానికి పైగా డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పక్క డీలర్లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇవ్వడంతో వారిపై తీవ్రమైన భారం పడుతోంది. కొన్నిచోట్ల డీలర్లు మృతి చెందడం, మరికొన్నిచోట్ల రాజీనామాలు చేయడంతో చౌకధరల దుకాణాలు డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తామని చెప్పడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 224 రేషన్‌ దుకాణాలకు కొత్త డీలర్లు రానున్నారు. దీంతోపాటు కొన్ని చౌకధరల దుకాణాల్లో 1,600 వరకు ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇలాంటి దుకాణాలను విడగొట్టి కొత్తవి ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రేషన్‌ దుకాణాలతోపాటు డీలర్ల సంఖ్య కూడా పెరగనుంది.
* పాలు, పండ్లు కల్తీ అవుతున్న నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన పదార్థాలను అందించేందుకు ఆహారశుద్ధి కేంద్రాల్లో మహిళాసంఘాలకు ప్రాధాన్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహిళా సంఘాలో నాలుగు లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలను నెలకొల్పేలా ప్రొత్సాహించాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే మామిడి, సీతాఫలం వంటి ఆహారశుద్ధి పరిశ్రమలు పాలమూరులో ఉన్నాయి. ఇదే తరహాలో మిగతా పండ్లతోపాటు పాలు, ఇతర సామగ్రి పరిశ్రమలను ఏర్పాటుచేసి వారితో అమ్మకాలను నిర్వహించడం ద్వారా కల్తీలకు అడ్డుకట్ట వేయనున్నారు.

చివరకు చిన్నపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారు. రాష్ట్ర  ప్రజలకు కల్తీ లేని పరిశుభ్రమైన ఆహారం అందిస్తాం. మహిళా స్వయం సహాయక బృందాల్ని పటిష్ఠం చేసి పాలు, గుడ్లు, తాజా కూరగాయలు ఎక్కడికక్కడ సరఫరా చేస్తాం. ప్రజాపంపిణీ వ్యవస్థతో అన్నీ అనుసంధానం అవుతాయి. కల్తీ ఆహార పదార్థాల అమ్మకాన్ని అరికట్టడానికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోనుంది. ఖాళీగా ఉన్న చౌక దుకాణాల డీలర్లను భర్తీ చేస్తాం. మహిళా సంఘాలను క్రియాశీలకంగా మార్చి ఆహారశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.

- అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన

ఉమ్మడి జిల్లాలో సిబ్బంది కొరత
ప్రతి జిల్లాకు ఒక ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారితోపాటు ఇద్దరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల చొప్పున అయిదు జిల్లాలకు అయిదుగురు జిల్లా అధికారులు, పదిమంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు ఒక్క జిల్లా అధికారి, ఒక్క ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే ఉన్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆహార పదార్థాల తనిఖీలు చేపడుతున్నాం. కేసులు నమోదు చేస్తున్నాం. ఆహార పదార్థాల కల్తీల నివారణకు వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. కార్యశాలలు ఏర్పాటుచేసి అవగాహన కల్పిస్తున్నాం.

- అశోక్‌కుమార్‌, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.