close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

ఆశలు ఫలించే.. ఎలమందా!

రెండో విడత గొర్రెల పంపిణీకి కసరత్తు
మంత్రి ప్రకటనతో లబ్ధిదారుల్లో ఆనందం
జిల్లాకు 13 వేల యూనిట్లు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ వ్యవసాయం

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ చేసిన ప్రకటన లబ్ధిదారుల్లో ఆశలు రేపుతోంది. రాయితీ గొర్రెల కోసం నిరీక్షిస్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతుండగా, పలు కారణాలతో వాయిదా వేస్తూ రావడం ఆందోళన రేపింది. గొల్ల, కుర్మల కుటుంబాల్లో వెలుగులు నింపాలని తెరాస ప్రభుత్వం తొలిసారి బాధ్యతలు చేపట్టిన క్రమంలో రాయితీ గొర్రెల పథకానికి అంకురార్పణ చేసింది. ఈ క్రమంలో పశుసంవర్థక శాఖ అధికారులు లబ్ధిదారులను గుర్తించి జాబితాను రూపొందించగా తొలి, మలి విడతల వారీగా గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. తదనుగుణంగా తొలి విడత ప్రక్రియ చేపట్టగా ఎన్నికలు, వివిధ కారణాలతో ఇంకా పూర్తవకపోగా తాజా ప్రకటనతో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 25 నుంచి రెండో విడత పంపిణీ ఉంటుందని స్పష్టం చేయడంతో తొలి విడత లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

రెండో విడత 13,439 యూనిట్లు
జిల్లాల్లో మొత్తం 190 సంఘాలున్నాయి. మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ మినహా కరీంనగర్‌ రూరల్‌, చొప్పదండి, గంగాధర, రామడుగు, తిమ్మాపూర్‌, గన్నేరువరం, చిగురుమామిడి, సైదాపూర్‌, వీణవంక, శంకరపట్నం, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్‌, మానకొండూర్‌ మండలాల్లో గొర్రెల కాపరుల సంఘాలున్నాయి. మొదటి విడతలో 13,519 యూనిట్ల గొర్రెలను గొల్ల, కుర్మలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడతలో 12,997 యూనిట్లు, రెండో విడతలో 13,439 యూనిట్లు పంపిణీ చేసేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పథకం ప్రారంభంలో మొదటి విడతలో 13,519 యూనిట్లకు గాను 12,997 యూనిట్లను పంపిణీ చేశారు. దాదాపు అన్ని మండలాల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి తొలి విడత సగం, రెండో విడత మిగతా సగం మందికి రాయితీ గొర్రెలను ఇవ్వాలని కార్యాచరణ రూపొందించారు.

తొలి విడతే ఇంకెపుడో..
రాష్ట్ర వ్యాప్తంగా పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొదటి విడతలో మాత్రమే గొర్రెల పంపిణీ జరిగింది. రెండో విడత కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పలేదు. మొదటి విడత 2017 జూన్‌ 20లో ప్రారంభించి 2018 వరకు పంపిణీ చేశారు. రెండో విడత గతేడాది జూన్‌, జులైలో పంపిణీ చేయాల్సి ఉండగా వర్షాలు పడటంతో గొర్రెలు ఆరోగ్యంగా ఉండవనే సాకు చూపి వాయిదా వేశారు. అనంతరం ఎన్నికలు రావడంతో పథకం అమలుకు నోచుకోలేదు. జిల్లావ్యాప్తంగా 1015 యూనిట్లకు తొలి విడతలో గొర్రెలు అందాల్సి ఉండగా 850 మంది లబ్ధిదారులకు అందించారు. మరో 165 మంది డీడీలు కట్టి ఏడాదికి పైగా నిరీక్షిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారు రూ.32,750 డీడీ చెల్లించారు. డీడీలు కట్టి 17 నెలలు దాటగా ఇంకా ప్రయోజనం చేకూరకపోవడం గమనార్హం. కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, హుజూరాబాద్‌, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి, రామడుగు, ఇల్లందకుంట, మానకొండూర్‌, తిమ్మాపూర్‌ తదితర మండలాల్లో డీడీలు చెల్లించినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. జూన్‌ నెలలో డీడీలు చెల్లించగా ఇప్పటి వరకు రాలేదని కొత్తపల్లికి చెందిన మల్లయ్య వాపోయారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.1.26 లక్షలు కాగా లబ్ధిదారు రూ.32,750 చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వ రాయితీ 93,250.. ఇదిలాఉంటే గ్రౌండింగ్‌ అయిన 850 యూనిట్లకు చెల్లింపులు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది.

నిఘా బృందాలను పటిష్ఠం చేస్తే సరి
రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మలు గొర్రెల ద్వారా ఉపాధి పొందేలా శాశ్వత ప్రయోజనం దృష్ట్యా రాయితీ గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాది పాటు గొర్రెలను పోషించుకుని వాటి ద్వారా వచ్చే సంతానాన్ని మాత్రమే విక్రయించాలనేది నిబంధన.. కానీ రాయితీ గొర్రెలు చేతికి చేరాయో లేదో అమ్మకానికి ఆసక్తి చూపుతున్నారు. విచ్ఛలవిడిగా గొర్రెలను విక్రయిస్తుండగా తొలి విడతలో సుమారు 4 వేల యూనిట్ల వరకు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో రెండో విడత పంపిణీ సక్రమంగా జరగడంతో పాటు కాపరులు వాటిని మేపుతూ ఉపాధి పొందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.