close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

కుందూ.. కన్నీటి ముందు

వరద నీటితో పంటల మునక

జల దిగ్బంధంలో పలు గ్రామాలు

కనిపించని శాశ్వత పరిష్కార చర్యలు

కోవెలకుంట్ల వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది

కర్నూలు, కడప జిల్లాల్లోని 140 గ్రామాలకు సాగు, తాగునీరు అందించే నది కుందూ.. సాధారణంగా సుమారు 20 వేల క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహిస్తుంది. కృష్ణా పరిధిలో వరద వచ్చినప్పుడు.. స్థానికంగా కుంభవృష్టితో అంచనాలకు మించి లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తూ ప్రజలకు తీరని నష్టం మిగులుస్తోంది. కుందూకు కరకట్టల నిర్మాణంతోపాటు వంతెనల ఏర్పాటు, ఇతర శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలంటున్నారు తీరప్రాంత ప్రజలు.

- న్యూస్‌టుడే, కోవెలకుంట్ల

ఓర్వకల్లు మండలంలోని ఎర్రమల కొండల్లో కుందూ ఆవిర్భవిస్తుంది. 2008, 2009, 2013, ప్రస్తుత కుంభవృష్టితో వరద లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవహించింది. గాలేరు, సంగాల వాగు, పాలేరు, వక్కిలేరు, భవనాసి వంటి కాల్వలు, ఉపనదుల నీరు కూందూలో కలవడంతో గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇదే సమయంలో అలగనూరు, గోరుకల్లు, వెలుగోడు, బనకచర్ల పథకాల నుంచి కుందూ నదికి నీరు పెద్ద  ఎత్తున చేరుతోంది. వర్షాకాలం వస్తుందంటే చాలు ప్రజలు భీతిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. 2009లో వచ్చిన వరదలతో నంద్యాల మండలం 20 రోజుల పాటు జలదిగ్బంధంలో చిక్కుకుంది. 


 మూడుచోట్ల జలాశయ ప్రతిపాదనలు
నీటి పారుదల శాఖ అధికారులు అలగనూరు జలాశయం దిగువ భాగంలో, కోవెలకుంట్ల మండలం జోలదారాశి వద్ద, చాగలమర్రి మండలంలోని రాజోలి వద్ద కుందూ నదిపై జలాశయాల ఏర్పాటుకు 2007లో ప్రతిపాదించారు. జోలదారాశి, రాజోలి వద్ద జలాశయాల నిర్మాణం కోసం 2008 డిసెంబర్‌లో కడప జిల్లా పెద్దముడియం వద్ద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రాజోలి జలాశయం ఏర్పాటైతే కర్నూలు, కడప జిల్లాల్లోని 10 గ్రామాలు, 10 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతాయి. 


కుందూ పోరాట సమితి డిమాండ్లు
* నదిలో ప్రతి రెండు కిలోమీటర్లకు రెండు మీటర్ల ఎత్తులో చెక్‌డ్యాం నిర్మాణం.

* అన్ని వంతెనల వద్ద నీటిని నిల్వ చేసుకొనేలా వరద సమయంలో పైకి ఎత్తేలా షట్టర్లు ఏర్పాటు చేయాలి.

* నది ఒడ్డున అనువైనచోట 3 బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణం.

* సాగుచేసే ప్రతి ఎకరం ఆయకట్టు స్థిరీకరణ, నికర జలాల కేటాయింపు.

* జల దిగ్బంధంలో చిక్కుకుంటున్న గ్రామాల్లో వంతెనల ఏర్పాటు. 


నది స్వరూపం ఇలా..
ప్రారంభం: ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు
పొడవు: 160 కిలోమీటర్లు
పరివాహక గ్రామాలు: 110
ఆయకట్టు ఎకరాలు: లక్ష
రక్షిత మంచినీటి పథకాలు: 140
కేంద్ర రక్షిత నీటి పథకాలు: 40
ఎత్తిపోతల పథకాలు:  45
పెన్నాలో విలీనం: కడప జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద 

వరద నీటిలో తప్పని నడక.. కుందూ తీరంలో ఇలాంటి గ్రామాలు పదుల సంఖ్యలో ఉన్నాయి..

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఇలా..
ః వరదలకు కోవెలకుంట్లలోని తగ్గుబజార్‌ ముంపునకు గురవుతుంది. ఎం.గోవిందిన్నె గ్రామంలో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గుల్లదుర్తి, చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల, వల్లంపాడు, లింగాల, భీమునిపాడు, బిజినవేముల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకొని రాకపోకలు నిలిచిపోతున్నాయి.  ః పాలేరు వాగుతో ముదిగేడు- ముక్కమల్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ముక్కమల్ల, ఎగ్గోని, ఆల్వకొండ, ముచ్చలపురి, ఆకుమల్ల గ్రామాల ప్రజలు రోజుల తరబడి రాకపోకలు సాగించలేకపోతున్నారు. పాలేరు వాగు వంతెనల ఎత్తు పెంచితే తప్ప సమస్య పరిష్కారం కాదని ప్రజలు పేర్కొంటున్నారు.  ః  సంజామల సమీపంలోని వెంకటేశ్వరాలయం వద్ద వాగు ఉంది. దీనికి కల్వర్టు ఏర్పాటు చేయలేదు. నీటి ఉద్ధృతి తగ్గేవరకు కోవెలకుంట్ల నుంచి తిమ్మనాయునిపేటకు రాకపోకలు ఆగిపోవాల్సిందే. ః  కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు, కల్వటాల గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ వంతెన ఏర్పాటు చేయడం లేదు. జమ్మలమడుగు, తాడిపత్రికి ఇదే రహదారి కావడంతో సుమారు 15 గ్రామాల ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ః  బనగానపల్లిలోని కైపు వాగుపై వంతెన తక్కువ ఎత్తులో ఉంది. దీనివల్ల ప్రతిసారి పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్రనష్టం సంభవిస్తోంది.


గ్రామాన్ని ఖాళీ చేశాం - సత్యరాజు, ఎం.గోవిందిన్నె
మా గ్రామం కుందూ నదికి అతి సమీపంలో ఉండటంతో గ్రామాన్ని ఖాళీచేసి దూరంగా ఇళ్లు నిర్మించుకున్నాం. పొలాలు నది ప్రవాహంలో మునిగిపోతున్నాయి. కోతకు గురై పంటలు దెబ్బతింటున్నాయి. దిగుబడులు రాక ఆర్థిక నష్టాలకు గురవుతున్నాం. ఈ పరిస్థితి దీర్ఘకాలం ఉన్నా శాశ్వత పరిష్కార మార్గాలు చేపట్టలేకపోతున్నారు. వాగులు ఉన్నచోట వంతెనలు నిర్మించడం, తక్కువ ఎత్తులో ఉన్నచోట ఎత్తు పెంచడం వంటి చర్యలు చేపట్టడం లేదు. 


20 ఏళ్ల నుంచి పోరాటం - వేణుగోపాలరెడ్డి, కేపీఎస్‌ కన్వీనర్, కోవెలకుంట్ల
కుందూ నదిపై జలాశయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా లిఖిత పూర్వకంగా అంగీకరించారు. జోలదారాశి గ్రామ పరిసర ప్రాంతాల్లోని బంజరు భూముల్లో జలాశయం నిర్మించాలని 20 ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తున్నాం. వర్షపునీటిని వరద నీటిని నిల్వచేసుకుంటే నష్టాల నుంచి గట్టెక్కవచ్చు. కుందూ నది నీటితో పంటలు దెబ్బతిని రైతాంగం కోలుకోలేకపోతోంది. 


ప్రభుత్వానికి ప్రతిపాదనలు  - నారాయణశెట్టి, నీటిపారుదల శాఖ ఈఈ, కర్నూలు
జోలదారాశి జలాశయం ఏర్పాటుకు (00.8 టీఎంసీ) రూ.264 కోట్లు, రాజోలి జలాశయం (3టీఎంసీ) కోసం రూ.830 కోట్లు అవసరమని ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. పనులు కార్యరూపం దాల్చి నిర్మాణాలు పూర్తయితే కుందూ నది జీవనదిలా మారుతుంది. రైతులు రెండు కార్లు పంటలు పండించుకొనే అవకాశం ఉంటుంది. 

మరిన్ని వార్తలు

అధికారుల చర్యలతో దిగివచ్చిన వ్యాపారులు

టమోటాలు కొనుగోలు చేస్తామని చెప్పి శుక్రవారం సాయంత్రానికి మొహం చాటేసిన వ్యాపారులు అధికారుల చర్యలతో దిగి వచ్చారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ పత్తికొండ మార్కెట్‌ సమస్యపై స్పందించారు. రైతులను పడిగాపులు కాసేలా చేసి వారి సహనానికి పరీక్ష పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ ఆర్జేడీ సుధాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు శనివారం ఉదయం కల్లా మార్కెట్‌ యార్డులో కొనుగోలు చేసేందుకు రాకపోతే మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేసి రైతు బజార్లకు సరకును తరలిస్తామని తేల్చి చెప్పటంతో వ్యాపారులు ఉదయం 10కల్లా మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే సరకును కొనుగోలు చేస్తామని చెప్పి వేలం ప్రారంభించారు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.