close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

నష్టం రూ.670 కోట్లు

13 మండలాలు.. 118 గ్రామాల్లో 70 వేల మంది వరద బాధితులు
ఇద్దరు వ్యక్తులు.. 65 పశువులు మృత్యువాత
300 ఇళ్లు పూర్తిగా, 600 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం

 ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల జిల్లాలో రూ.670 కోట్ల నష్టం వాటిల్లినట్లు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ వెల్లడించారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం వరదలు, రైతు భరోసా, సచివాలయ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ, ఆటో, ట్యాక్సీ ఓనర్‌ కమ్‌ డ్రైవర్లకు ఆర్థిక సాయం తదితర అంశాలపై విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

‘భారీ వర్షాల వల్ల జిల్లాలో తూర్పు ప్రాంతమైన నంద్యాల డివిజన్‌లో 13 మండలాలు.. 118 గ్రామాల్లో 70 వేల మంది వరద తాకిడికి గురయ్యారు. వరద బాధితులకు 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు, వైద్య సాయం, తాగునీటి వసతి సమకూర్చారు. వరదల వల్ల వంద గుడిసెలు, 200 ఇళ్లు పూర్తిగా, 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కలిపి 65 మృత్యువాత పడ్డాయి. భారీ వర్షాల వల్ల 31 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంటలకు, గృహాలకు నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించి నష్ట పరిహారానికి చర్యలు తీసుకుంటామని’ కలెక్టర్‌ తెలిపారు. అటవీ ప్రాంతానికి చేరువలో వరద తాకిడికి గురైన చెంచు గూడేలలో ఐటీడీఏ, డీటీడబ్ల్యూవో శాఖల ద్వారా అన్ని వసతులు సమకూరుస్తున్నామన్నారు. జిల్లాలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా అన్ని గ్రామాల్లో మలేరియా శాఖ ద్వారా ఫాగింగ్‌ చేస్తున్నామని, ప్రజలందరూ మంచినీటిని కాచి వడబోసుకుని చల్లార్చి తాగాలని వైద్యులతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. బుధవారం గోడ కూలి ఒకరు, చాప వాగులో ఓ వ్యక్తి మృత్యువ్యాత పడ్డారు. మనుషులు చనిపోతే రూ.4 లక్షలు, ఆవులు, గేదెలు, ఇళ్లకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందన్నారు. వరద బాధితులకు బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. పంటలు వేసుకుని నష్టపోయిన కౌలు రైతులకు కూడా పంటనష్ట పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 800 ఇళ్లు కొత్తగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

నంద్యాల పద్మావతి నగర్‌లో వరద నీటిలో రాకపోకలు

అర్హులకు రైతు భరోసా  
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద ఆర్‌టీజీఎస్‌ నోడల్‌ ఏజెన్సీ పంపిన ప్రొఫార్మా-1, 2 జాబితాను ఆధారంగా చేసుకుని అర్హత గల రైతులను వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ఎంపిక చేస్తున్నామన్నారు. జిల్లాలో 5.11 లక్షల మంది కర్షకులకు గాను ప్రస్తుతం 4.30 లక్షల మంది వివరాలను క్షేత్రస్థాయిలో వీఆర్వోలు, ఏఈవోలు, ఎంపీఈవోలు, వాలంటీర్లు విచారణ చేస్తున్నారన్నారు. 85 గ్రామాల రైతులకు సంబంధించిన జాబితా ఆర్‌టీజీఎస్‌ నుంచి రావాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగి ఉంటే వాటిని ప్రొఫార్మా-2లో  నివేదిస్తామన్నారు. ఒక రైతు తన పొలాన్ని నలుగురైదుగురికి కౌలు ఇస్తే అందులో ఒక్క కౌలు రైతుకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందన్నారు. కౌలు రైతులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుగా గుర్తించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 3 లక్షల మంది రైతులను విచారణ పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మ్యుటేషన్‌కు సంబంధించి 9 వేల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. అర్హులైన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.12,500 కౌలు రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు, కౌలుదారులు తమ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా అన్నీ సరిగా ఉన్నాయా? లేదా? చూసుకోవాలన్నారు. అర్హుల వివరాలు జాబితాలో లేకపోతే వీఆర్వో, ఎంపీఈవో, తహసీల్దారు, మండల వ్యవసాయాధికారి, ఆర్డీవో, ఏడీఏ, జేసీ-2, వ్యవసాయ శాఖ జేడీల దృష్టికి తీసుకురావాలని వీరపాండియన్‌ సూచించారు.  


ఒక కుటుంబంలో ఒకరికే సాయం 
ఆటో, ట్యాక్సీ యజమాని, డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రయాణికుల ఆటో లేదా ట్యాక్సీకి ఎవరు యజమాని అయితే వారికే ఈ పథకం వర్తిస్తుందన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి రవాణా శాఖ అధికారులు తక్షణమే లైసెన్సులు జారీ చేయాలని ఆదేశించామన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే ఎంపీడీవోలకు తెలియపరచాలన్నారు. ఒక్కో కుటుంబానికి ఒకరు మాత్రమే అర్హులన్నారు. వాహనం ఎవరి పేరు మీద ఉంటుందో వారికే ఆర్థిక సాయం అందుతుందన్నారు. 


23, 24, 25 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన 
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చాయి. అర్హులైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఈనెల 21, 22 తేదీల్లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. 21 నుంచి కాల్‌లెటర్లు పంపుతామన్నారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో జిల్లా పరిషత్‌లో పది వేల మంది అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ, క్రీడలు, మాజీ సైనికులు, స్టడీ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మెరిట్, రోస్టర్‌ ప్రకారం క్యాటగిరీ వారీగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈనెల 28న కౌన్సెలింగ్‌ ఇస్తామన్నారు. ఈనెల 30, వచ్చే నెల 1, 2 తేదీల్లో ఎంపికైన ఉద్యోగులకు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 14వ తేదీలోపు ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు రాకపోతే వారిని ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. అక్టోబరు 2న ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభిస్తామన్నారు. సచివాలయంలో ఏయే సదుపాయాలు ఉండాలో అవన్నీ కల్పిస్తామని, ఇంటర్నెట్, ఫర్నీచర్, ఇలా అన్నిరకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కొలువులకు ఎంపికైన ఉద్యోగులకు మూడు మాసాల పాటు శిక్షణ ఉంటుందని వెల్లడించారు. 


ఓటరు నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం 
ఓటరు తన పేరు ఉందా? లేదా? తప్పులు ఏమైనా ఉన్నాయా అని స్వయంగా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో పరిశీలించు కోవచ్చన్నారు. అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మంచి అవకాశం కల్పించిందన్నారు. ఓటరు పరిశీలన జిల్లాలో పురోగతి లేదన్నారు. ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్‌ కేంద్రాల పెంచనున్నట్లు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ చేసి ఎన్నికల సంఘానికి నివేదికలను పంపాల్సి ఉందన్నారు. 18 సంవత్సరాల వయసు ఉన్న యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.   

ఆయా శాఖల్లో నష్టానికి సంబంధించి శాశ్వత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలిలా..

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.