close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

రసాయన బాంబులు..!

దడ పుట్టిస్తున్న రసాయన పరిశ్రమలు
అనుమతుల్లేకున్నా.. అటువైపు చూడని పీసీబీ
ఈనాడు, హైదరాబాద్‌

500 అడుగుల ఎత్తులో బాంబుల్లా పేలుతున్న రసాయన డ్రమ్ములు.. పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. పక్కనున్న పరిశ్రమలకు అంటుకుంటున్న మంటలు.. దట్టంగా కమ్మేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నల్లని పొగ.. మంటలను అదుపులోకి తెచ్చే వరకు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని భయభయంగా గడుపుతున్న స్థానికులు.. నగరంతోపాటు శివారుల్లోని రసాయన పరిశ్రమల్లో నిర్వాహకుల కాసుల కక్కుర్తితో రసాయన బాంబుల పేలుళ్లు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కార్తీకేయ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

రసాయన పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే అటు పీసీబీ అధికారులు, ఇటు నిర్వాహకులు కాస్త తెలివిగా వ్యవహరిస్తున్నారు. తమ తప్పు బయటపడకుండా ‘షార్ట్‌ సర్క్యూట్‌’తోనే ప్రమాదం జరిగిందంటూ తప్పించుకుంటున్నారు. పరిశ్రమల నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అత్యంత కీలకమైన రియాక్టర్లలోనూ కక్కుర్తి పడుతున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ రియాకర్టను కొనుగోలు చేసి అత్యధిక ఉష్ణోగ్రతలో వేడి చేస్తూ మధ్యంతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అంత ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం వాటికి లేకపోవడంతో అవి పేలిపోతున్నాయి. ఒక్కో రసాయనాన్ని వినియోగించేటప్పుడు ఒక్కో రకమైన రక్షణ చర్యలను తీసుకోవాలి. ఉదాహరణకు.. ఫ్లోరిన్‌ను వాడేటప్పుడు ఉష్ణోగ్రత, రియాక్టర్‌ వాల్వ్‌ తెరిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే తదితర అంశాలపై సేఫ్టీ రిపోర్ట్‌ను తప్పనిసరిగా అనుసరించాలి. సాంకేతిక విద్యను పూర్తి చేసిన వారికి ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లించాల్సి వస్తుండటంతో నిర్వాహకులు నిరక్షరాస్యులను పనిలో పెట్టుకుంటున్నారు.

80శాతం అనుమతి లేనివే..
నిర్వాహకులు రియాక్టర్లలో  వివిధ రసాయనాలను మిళితం చేసి మధ్యంతర ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. ఆ ఉత్పత్తులను డ్రమ్ముల్లో సంబంధిత పరిశ్రమలకు చేరవేస్తుంటారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జీడిమెట్ల, దూలపల్లి, పాశమైలారం, గుమ్మడిదల తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పీసీబీ అనుమతుల్లేని రసాయన పరిశ్రమలు 80 శాతం వరకు ఉంటాయని సంబంధిత అధికారులే ఒప్పుకొంటున్నారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మాముళ్ల మత్తులో పీసీబీ అధికారులు..!
తనిఖీలు చేసి కొరడా ఝుళిపించాల్సిన పీసీబీ అధికారులు చోద్యం చూస్తున్నారు. మాముళ్లు అందుతుండటంతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తన పరిధిలోని రసాయన పరిశ్రమల నిర్వాహకులందరి నుంచి ఓ అధికారి ప్రతి నెలా రూ.5 లక్షలు తీసుకుంటున్నట్లుగా పీసీబీ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి.

భయం భయంగా స్థానికులు..!
జనావాసాల మధ్య పరిశ్రమలు ఉండకూడదని నిబంధనలు చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. రసాయన పరిశ్రమల వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం తలెత్తుతుందోనని పారిశ్రామికవాడలకు సమీపంలో ఉండే స్థానికులు భయభయంగా జీవిస్తున్నారు.

పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
షాపూర్‌నగర్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడ అయిదో ఫేజ్‌లోని కార్తికేయ కామాక్షి రసాయన పరిశ్రమలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే రియాక్టర్‌ పేలిపోవడంతో మంటలు పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో పనిచేస్తున్న 20 మంది సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం జరగలేదు. జీడిమెట్ల సీఐ రమణారెడ్డి, ఎస్సైలు సత్యం, చంద్రయ్య తదితరులు పరిస్థితిని సమీక్షించారు. మూడేళ్లుగా మూతపడి ఉన్న ఈ పరిశ్రమను పది నెలల క్రితమే ప్రారంభించారు. శనివారం తెల్లవారుజామున సోడియం బ్యాగులు ఉన్న ప్రాంతంలో సీపీడీ రసాయనం చుక్కలు చుక్కలుగా పడి విద్యుదాఘాతం జరిగి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. రసాయనాల విషయంలో కనీస పరిజ్ఞానం లేని కార్మికులు పనిచేస్తుండటం.. అనుభవజ్ఞలైన సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో రియాక్టర్‌లో ఉష్ణోగ్రతను నియంత్రించడంలో విఫలం కావడంతో మంటలు చెలరేగినట్లు మరో వాదన వినిపిస్తోంది. రియాక్టర్‌ పేలడంతో ఇనుపముక్కలు పరిశ్రమ గేటును బద్దలుకొట్టుకొని రోడ్డుకు అవతలివైపు ఇంటి గోడలను ధ్వంసం చేశాయి. మంటలు ఆర్పే క్రమంలో ఫైర్‌ కానిస్టేబుల్‌ చాంద్‌పాషా కాలికి గాయమైంది. పరిశ్రమకు అగ్నిమాపక అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించిన కేసు నమోదు చేస్తామని డీఎఫ్‌ఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.