close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

తల్లి ఆరోగ్యం బిడ్డకూ మహా భాగ్యం

పోషకాహార ఉత్సవాల్లో భాగంగా..  రాజధాని సహా విస్తృత ప్రచారం
గర్భిణులకు పలు వైద్యపరీక్షలు
బాలికలకు రాగి లడ్లు
ఈనాడు, హైదరాబాద్‌

హానగరంలో పోషకాహార లోపం తల్లీపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమ్మ ఆరోగ్యమే పుట్టనున్న శిశువుకు మహాభాగ్యం. బొజ్జలోని బుజ్జాయి చక్కగా ఎదిగేందుకు ఆమె తీసుకునే ఆహారమే ఎంతో కీలకం. అలాగే యుక్తవయసు ఆడపిల్లలకూ విటమిన్లు, ప్రొటీన్లు ఉన్న ఆహారపదార్థాలు అత్యవసరం. పలు సమస్యలకు పరిష్కార మార్గం ఒక్కటే.. పోషక విలువలున్న ఆహారాన్ని సకాలంలో స్వీకరించడం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ‘పోషణ్‌ అభియాన్‌’ పేరిట పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాజధాని సహా అంతటా ‘ఇంటింటా పోషణ’ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలలకు పోషకాహారం అందజేస్తున్నారు.

చేతులు కలుపుదాం
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్ధిక పరిస్థితుల కారణంగానే అనేకమంది..ముఖ్యంగా గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. మొత్తంమీద 29శాతం మేరకు నవజాత శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారు. ప్రజాప్రతినిధుల మార్గదర్శకత్వం, ఇతర ప్రభుత్వశాఖల సహకారం, స్వచ్ఛంద సంస్థల అండదండలతో భారీస్థాయిన కార్యాచరణ ప్రణాళిక చేపట్టామని సంక్షేమ శాఖాధికారిణి ఝాన్సీలక్ష్మీబాయి తెలిపారు. జిల్లాలో 912 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 11,085 మంది గర్భవతులున్నారు. 7 నెలల మొదలు 6 సంవత్సరాల వయసు గల చిన్నారులు 1,37,787 మంది ఉన్నారు. నవజాత శిశువులు 1136 మంది ఉంటారు. పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా, ఐదేళ్లలోపు బాలబాలికలకు అధికారులు అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం అందిస్తున్నారు. గర్భిణుల రక్తహీనత గుర్తించేందుకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యలోనే బడి మానేసినప్పటికీ, ఆయా బాలికలకు రాగి లడ్లు అందజేస్తున్నారు. ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ మాత్రలు తీసుకోవడం;  ప్రసవానికి ముందు జరగాల్సిన ఏఎన్‌సీ పరీక్షలు, వ్యక్తిగత శుభ్రత అంశాలపైనా సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.

పరిశుభ్రతకే పెద్దపీట
పోషకాహారం అంటేనే ఖరీదుతో కూడుకున్నదన్న అభిప్రాయం కొందరిలో ఉంది. తక్కువ ధరలో దొరికే ఆకుకూరలు, పప్పుదినుసులు, కాయగూరల్లోనూ పుష్కలమైన పోషకాలుంటాయని.. బస్తీలు, కాలనీల్లోని మహిళలకు సిబ్బంది ప్రచారాల ద్వారా చెబుతున్నారు.అపోహలు తొలగిస్తున్నామని గోల్కొండ డివిజన్‌ సీడీపీవో లోక రేణుక చెప్పారు. వివిధ రకాల వ్యాధులకు పరిసరాల అశుభ్రతే మూలమని వివరిస్తున్నామన్నారు. పసిపిల్లల ఎత్తు, బరువు చూడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశదం చేస్తున్నట్లు చెప్పారు. మూడు నాలుగు ఆకుకూరలు కలిపి తినటం బలవర్ధకమని నచ్చచెబుతున్నామన్నారు. అంగన్‌వాడీలు అందించే ‘బాలామృతం’ వారికి పుష్కలమైన పోషకాలనిస్తోంది. గర్భం ధరించినప్పటినుంచి బిడ్డకు రెండేళ్లు వచ్చే దాకా ఏం చేయాలన్నది తల్లులకు తెలియజేస్తున్నట్లు ఆమె వివరించారు. మహిళలకు మరింత అవగాహన పెరిగితేనే ఆ కుటుంబం ఎంతైనా ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారపు అలవాట్ల పట్ల తగినంత జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపైనే దృష్టి సారించాలంటూ సదవగాహన పెంచుతున్నామని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.