close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

దోమలున్నాయ్‌ జాగ్రత్త!

నగరంలో 389 సమస్యాత్మక ప్రాంతాలు, 1.5లక్షల ఇళ్లు
చర్యలు తీసుకుంటున్నామంటున్న జీహెచ్‌ఎంసీ
ఈనాడు, హైదరాబాద్‌

భాగ్యనగరం దోమలమయంగా మారింది. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా నగరమంతా దోమలు విజృంభిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 389 ప్రాంతాల్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. అక్కడ డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యాయని, నివారణ చర్యల్లో భాగంగా ఆయా కాలనీల్లో సిబ్బందిని పెద్ద ఎత్తున మొహరించామని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ తెలిపారు. ప్రతి డివిజన్‌లో రోజుకు 36కి.మీల మేర ఫాగింగ్‌ చేస్తున్నామని, సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి దోమలను గుడ్డు దశలో నిర్మూలించే చర్యలు చేపడుతున్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్లు, ఇంటి పరిసరాల్లో దోమలు ఉత్పత్తి అయ్యేందుకు అవకాశమున్న నీటి నిల్వ ప్రాంతాలను తొలగించాలని కోరారు.

పలు సమస్యాత్మక కాలనీలు..
మలేరియా, డెంగీ కేసుల ఆధారంగా జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. వ్యాధుల బారిన బడిన ఇంటి చుట్టూ సిబ్బంది దోమల నివారణ మందులను పిచికారి చేసి.. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ఎన్ని ఇళ్లు సమస్యను ఎదుర్కొంటున్నాయో గుర్తించారు. అలా కాలనీలవారీగా వచ్చిన సమాచారం ప్రకారం నగరవ్యాప్తంగా 1,51,413 ఇళ్లు దోమలతో సతమతం అవుతున్నాయి. ఆయా కాలనీల్లో సాయినగర్‌ (కాప్రాడివిజన్‌)లోని వేయి ఇళ్లలో దోమల ప్రభావం ఉండగా, వంపుగూడ 550, జమ్మిగడ్డ 400, బీజేఆర్‌నగర్‌ 320, అంబేడ్కర్‌నగర్‌ 350, ఐజీకాలనీ 320, ఎన్టీఆర్‌నగర్‌ 360, ఓల్డ్‌మీర్‌పేట్‌ 386, నెహ్రూనగర్‌ 390, సూర్యానగర్‌ 409, ఎర్రకుంట 320, బాబానగర్‌ 340, అంబేడ్కర్‌నగర్‌(నాచారం డివిజన్‌) 429, బీరప్పగడ్డ 460, న్యూరామ్‌నగర్‌ 520, గణాది గిరిజనబస్తీ 420, జేఎస్‌ఎన్‌కాలనీ 350, ఇందిరానగర్‌ 360, రామిరెడ్డినగర్‌ 490, కుమ్మరిబస్తీ 520, సౌత్‌స్వరూప్‌నగర్‌ 400, లక్ష్మినారాయణకాలనీ 450, నాగోల్‌-సర్వే నెం.58లో 500, బ్లైండ్స్‌కాలనీ 300, నువ్వులబండ 400, అయ్యప్పకాలనీ 350, శుభోదయకాలనీ 400 గృహాలతో అవస్థలు పడుతున్నాయి. ఇలాంటి మరిన్ని కాలనీలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది గుర్తించారు. అక్కడ నిత్యం ఇంటింటికీ తిరిగి దోమలను అంతం చేసే మందులను పిచికారి చేస్తున్నామని కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు ఇలా..
ప్రస్తుతం నమోదైన కేసులు, గత మూడేళ్లలో నగరంలో నమోదైన డెంగీ, మలేరియా కేసుల ఆధారంగా బిల్దియా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. అలాంటి కాలనీల్లోని 86,200 ఇళ్లలో ఇప్పటి వరకు దోమల నివారణ మందును పిచికారి చేశమని కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.