close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

వరించిన కాలం

రికార్డుస్థాయిలో వరి పంట
తోటలనూ పొలాలుగా మార్చిన అన్నదాతలు
సమృద్ధిగా ఉన్న నీటి వనరులతో పంట మార్పిడి
మద్దతు ధర పెంపు మరో కారణం

ఈసారి జిల్లాలో అంచనాలకు మించి వరి వేశారు. మునుపెన్నడూ లేనంతగా రైతన్నలు రికార్డు స్థాయి సాగుకు శ్రీకారం చుట్టారు. సీజన్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఒకానొక దశలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేశారు. కాలం కలిసిరాదనుకున్న సమయంలో వరుణ దేవుడు కరుణించాడు. ఎంతలా అంటే సాధారణ వర్షపాతాన్ని మించేలా, పంట తడి ఆరిపోకుండా వరుస వర్షాలతో ఊరటనిచ్చాడు. మరో పక్షం రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఇక చేతికందడమే తరువాయి. ఆశించిన దిగుబడులొస్తే ఇందూరు అన్నదాత వ్యవసాయ ముఖచిత్రమే మారిపోతుంది.
న్నపూర్ణ జిల్లాగా పేరున్న ఇందూరు ఈ ఏడు నిజంగానే ధాన్యాగారంగా నిలుస్తోంది. నలుదిక్కులా ఎటూ చూసినా పచ్చని పంటపొలాలే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా వర్ని, బోధన్‌, ఎడపల్లి, కోటగిరి, రుద్రూర్‌, రెంజల్‌, నవీపేట, నందిపేట, నిజామాబాద్‌ రూరల్‌, భీమ్‌గల్‌ మండలాల్లో సుమారు 90 శాతానికి పైగా వరికే అన్నదాతలు మొగ్గుచూపడం విశేషం. మిగతా మండలాల్లోనూ సగానికి పైగా ధాన్యం సాగుకే సై అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి పొలాలు పెద్దగా చీడపీడల బారిన పడకుండా పొట్టదశను దాటాయి. ఆశించిన మేర దిగుబడులు వస్తాయని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.

జిల్లా వార్షిక సగటు వర్షపాతం: 1042.4 మి.మీ.
ఇప్పటి వరకు పడింది: 1063.1 మి.మీ.
సాధారణ వర్షం పడిన మండలాలు: 8
సాధారణం కంటే ఎక్కువ పడిన మండలాలు: 21

వాణిజ్య పంచేలేసే చోటా..
ఏటా ఒకే రకమైన పంటలేసే జిల్లా రైతులు ఈసారి వరి వేసేందుకు ఉవ్విళ్లూరారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్లలోని చాలా మండలాల్లో ఆరుతడి, ఇతర వాణిజ్య పంటలేసే చోట ధాన్యం పండించేందుకే ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సోయాబీన్‌, చెరకు, పత్తి, పప్పుదినుసులు వేసే తోట మడులన్నీ పొలంగా మార్చేశారు. వీటంతటికి ప్రధాన కారణం నీటి వనరులు పెరగడమేనని రైతులు చెబుతున్నారు.

జిల్లా సాగు విస్తీర్ణం పరిస్థితి (ఎకరాల్లో..)
జిల్లా సాధారణ సాగు: 4,23,850
గతేడాది సాగైంది: 4,42,915
ఈ ఖరీఫ్‌ సీజన్‌కు అంచనా వేసింది: 4,46,143
ఇప్పటివరకు చేస్తున్న సాగు: 4,52,474

గతిని మార్చేసిన వరుణుడు
రైతులు జూన్‌లోనే జోరుగా వరి నార్లు పోసుకున్నారు. అయితే జులై మాసాంతం వరకు సరైన వర్షాలు లేకపోవడంతో ఇక ఖరీఫ్‌నకు కష్టకాలమేనని అంతా భావించారు. ఆగస్టు మొదటివారంలో వరుణుడు కరుణతో మొదలైన వర్షాలు ఇప్పటికీ నిరంతరాయంగా పలకరిస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాంతటా సాధారణ వర్షం దాటింది. వానాకాలం పూర్తికాకముందే వార్షిక సగటు వర్షం దాటిపోవడం గమనార్హం.
క్వింటాలు ధాన్యం ధర రూ.1,815
గత సీజన్‌లో ధాన్యం ధర క్వింటాలు రూ.1,750 ఉండేది. ఈసారి రూ.65 పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడం సాగుపై ప్రభావం చూపింది. ఇతర పంటలతో పోలిస్తే సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు అలవోకగా ఉండటం, యాంత్రీకరణను ఎక్కువ ఉపయోగిస్తుండటం, మద్దతు ధరతో సర్కారే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుండటంతో వరి సాగుకు ఊతమిచ్చినట్లయింది. ఈ సీజన్‌లో పండిన పంట క్వింటాలుకు రూ.1,815 ధర రానుంది. ఎకరాలకు సగటున 30 క్వింటాళ్ల ధాన్యం పండినా.. ఇప్పుడున్న సాగు విస్తీర్ణంతో లెక్కిస్తే సుమారు 8 లక్షల క్వింటాళ్ల పంట చేతికి రానుంది. అంటే రూ.1,450 కోట్ల విలువైన ఉత్పత్తన్నమాట.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.