close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

ప్రజా సంక్షేమానికే సైన్సు

పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు

ముగిసిన ఇస్రో అంతరిక్ష వారోత్సవాల ప్రదర్శన

వివిధ పోటీల విజేతలను అభినందిస్తున్న పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు

సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా వెంటనే సమాచారమివ్వడంతో పాటు ప్రజాసంక్షేమానికి ఎంతో ఉపయోగపడేది అంతరిక్ష విజ్ఞానమేనని జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) (శ్రీహరికోట) నిజామాబాద్‌లోని నిర్మలహృదయలో గత మూడు రోజులుగా కొనసాగిన విజ్ఞాన ప్రదర్శన-సదస్సు ఆదివారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పాలనాధికారి ప్రదర్శనకు సహకరించిన వివిధ సంస్థల ప్రతినిధులకు, విద్యార్థులకు జ్ఞాపికలతో అభినందించారు. క్విజ్‌, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు. భూగర్భజలాలు, చరవాణి సమాచారం, టెలీమెడిసిన్‌ వంటి వాటికి ఇస్రో ప్రయోగిస్తున్న ఉపగ్రహాల సహకారం ఎంతో ఉందన్నారు. పిల్లల్లో శాస్త్రీయ ఆలోచనలకు అంకురార్పణకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడుతాయన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌ మాట్లాడుతూ..నగర మాస్టర్‌ప్లాన్‌ను శాటిలైట్‌ ద్వారానే రూపొందించామన్నారు. అంతరిక్ష ప్రయోగంలో అన్ని రకాల సైన్సు విషయాలు ఉంటాయన్నారు. గతంలో శ్రీహరికోటలో జీఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను తిలకించే అవకాశం లభించిందన్నారు. జిల్లావిద్యార్థులకు ఈ ప్రదర్శన ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో జీఎం డాక్టర్‌ రఘురాం, అనిల్‌కుమార్‌, నిర్మలహృదయ కరస్పాండెంట్‌ ఫాతిమా, జిల్లా సైన్సు అధికారి గంగాకిషన్‌ పాల్గొన్నారు.

స్పందన బాగుంది : ...ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ రఘురాం

ఇస్రోలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన యువశాస్త్రవేత్తలతో పాటు ఈ జిల్లావాసులు నమ్యాగుప్తా, సుమన్‌ ఉండడంతోనే ఇక్కడ వారోత్సవాలను ఏర్పాటు చేశాం. దసరా సెలవులైనా చాలా మంది సందర్శించారు. పోటీల్లో కూడా విద్యార్థులు తమ ప్రతిభకు పదునుపెట్టారు. విద్యాసంస్థలు, వేదికకు అవకాశం ఇచ్చిన నిర్మలహృదయ యాజమాన్యానికి, అధికారులకు కృతజ్ఞతలు.

ఇస్రోకు రుణపడి ఉన్నాం

...ఇందూరు యువశాస్త్రవేత్తలు సుమన్‌, నమ్యాగుప్తా

ఇస్రోలో శాస్త్రవేత్తలుగా అవకాశం రావడం మా అదృష్టం. మన జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఇస్రో అధికారులకు కృతజ్ఞతలు. జిల్లా విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడింది.

గొప్ప ప్రదర్శన

...తాడ్‌బిలోలి జీడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు

మా భౌతిక శాస్త్ర ఉపాధ్యయురాలు భవానీ వెంట ఉండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. చంద్రయాన్‌, మంగళయాన్‌, ఉపగ్రహాలు, రాకెట్లు, అంతరిక్ష కేంద్రం వంటి ప్రయోగాల ప్రదర్శన గొప్పగా ఉంది. కొత్త విషయాలను తెలుసుకున్నాం. దీని స్ఫూర్తితో సరికొత్త విజ్ఞాన ప్రయోగాలను చేయాలని అనుకుంటున్నాం.

సెలవుల్లో కాకుండా..

...వినీల, నిజామాబాద్‌

జిల్లాకేంద్రంలో ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. దసరా సెలవుల్లో కాకుండా పాఠశాలలు కొనసాగే సమయంలో ఏర్పాటు చేస్తే ఇంకా చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడేది. ఇందులోని ప్రదర్శనలను చూసిన తర్వాత చాలా విషయాలను తెలుసుకున్నాం. చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబర్చాను. బహుమతిని అందుకోవడం సంతోషంగా ఉంది.

శ్రీహరికోటను సందర్శించాలని ఉంది.

...ఊర్మిక, భానుచౌదరి, మెదక్‌

దసరా సెలవుల కోసం మా అమ్మమ్మగారింటికి వచ్చాం. ఇక్కడ ఇస్రో ప్రదర్శన ఉందని తెలిసి వచ్చాం. చాలా బాగుంది. ఇంత మంచి ప్రయోగాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. విజ్ఞానమేళాల్లో ప్రదర్శనలు రూపకల్పన చేసేందుకు ఆలోచనలు వస్తాయి. భవిష్యత్తులో శ్రీహరికోటను సందర్శించేందుకు ఆన్‌లైన్‌లో మా పేర్లను నమోదు చేసుకోవాలని అనుకుంటున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.