close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

పర్యవేక్షణ లేక.. ప్రైవేటు దోపిడీ

ఇష్టానుసారంగా ఛార్జీలు

మొదటి రోజు ఆదాయం రూ. 7.50 లక్షలే

రెండో రోజు పెరిగిన బస్సులు

మద్దతు కూడగడుతున్న కార్మికులు

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

కామారెడ్డిలో ఆందోళన చేస్తున్న కార్మికులు

ప్రైవేటు, అద్దె బస్సుల్లో అధిక ఛార్జీల మోత మోగుతోంది. కార్మికుల సమ్మెతో అరకొరగా ఆర్టీసీ బస్సులు పెద్దసంఖ్యలో ప్రైవేటు వాహనాలే తిరుగుతున్నాయి. ఆర్టీసీ మినహా మిగతా సర్వీసుల్లో ఎక్కితే ప్రయాణికుడి జేబుకు చిల్లు పడినట్లే. వాటిల్లో ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్నా కట్టడి చేసేవారు కరవయ్యారు. సమ్మె రెండో రోజైన ఆదివారం నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో బస్సు సర్వీసులు పెరిగాయి. ప్రయాణికులు కూడా శనివారంతో పోల్చుకుంటే కాస్త పెరిగారు. కార్మిక సంఘాల నేతలు వివిధ పార్టీల నేతలను కలిసి తమ పోరాటానికి మద్దతు కోరారు. మహిళా ఉద్యోగులు నిరసన తెలుపుతూ బతుకమ్మ ఆడారు. బస్టాండ్లలో ఆదివారం ఉదయం కంటే సాయంత్రానికి కొంత రద్దీ పెరిగింది. ప్రయాణికుల సమాచారం ఇవ్వడం, బస్సులు కదిలే సమయాల్లో సహకారం అందించటం వంటి సేవల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. సమ్మె నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా బందోబస్తుగా ఉన్న వీరు, ఆర్టీసీ ఉద్యోగులు చాలినంత లేకపోవటంతో ఆయా పనులు చేస్తూ కనిపించారు. కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా ప్రకటించిన మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరటంతో పాటు కొన్నిచోట్ల సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ పోరాటాన్ని ఉద్ధృతం చేసే అంశాలపై చర్చించారు.

జేబుకు చిల్లు

ఆదివారం ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరిగినప్పటికీ అవి కొన్ని రూట్లకే పరిమితం అయ్యాయి. మొదటి రోజు పల్లె ప్రాంతాలకు అరకొరగా వెళ్లటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా పల్లె వెలుగులు తిప్పారు. హైదరాబాద్‌తో పాటు ఇతర దూర ప్రాంతాలకు అద్దె, ప్రైవేటు బస్సులే అధికంగా తిరిగాయి. వీటిల్లో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు వారు వాపోయారు. గుత్తగా ఒక రేటు నిర్ణయించి ఇంత ఇస్తేనే ఎక్కండని చెప్పినట్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక పర్మిట్లతో రోడ్డెక్కిన ట్రవెల్స్‌ వారిలో అత్యధికులు అద్దె బస్సుల కంటే మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నారని పర్యవేక్షించే వ్యవస్థ ఉంటేనే దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇక పండగ ముందురోజైన సోమవారం ఊళ్లకు వెళ్లేవారు, పండగ ముగిశాక.. తిరుగు ప్రయాణాల నాటికల్లా ఆర్టీసీ సేవలు మెరుగుపడకుంటే ఇబ్బందులు తప్పవనే భావనలో ప్రజలున్నారు.

నిజామాబాద్‌ రీజియన్‌లో...

ఆర్టీసీ సర్వీసులు: 240

అద్దె బస్సులు: 179

పర్మిట్‌ పొందిన వాహనాలు: 43

స్కూల్‌ బస్సులు: 51

మ్యాక్సీ క్యాబ్‌లు: 170

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.