close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

దుర్గుణాలను దహనం చేద్దాం

దసరా నుంచి మంచి అలవాట్లను స్వాగతిద్దాం
స్వీయ నియంత్రణ పాటిద్దాం..ఉన్నతంగా ఎదుగుదాం..
ఉత్తమ వ్యక్తిత్వంతోనే లక్ష్యం వైపు  ప్రయాణం
ఈనాడు, హైదరాబాద్‌

దో సాధించాలనే తపన.. ఎంచుకున్న గమ్యం చేరాలనే ఆలోచన.. నడిచే దారిలో అడ్డంకులను అధిగమించే ఆత్మవిశ్వాసం.. విమర్శలకు ఎదురీదుతూ నిలదొక్కుకోగల మనోనిబ్బరం.. వంటివి జీవితాన్ని ప్రారంభించే సమయంలో మనసులో మొలకెత్తే భావనలు. కొన్ని అడ్డంకులు అనుకోకుండా ఎదురవుతాయి. మరికొన్ని ఆహ్వానం పలకగానే వచ్చి మకాం వేస్తాయి. సంకల్పం దృఢంగా ఉన్నా.. చుట్టూ బలంగా నాటుకుపోయిన అవలక్షణాలు వెంటాడుతుంటాయి. లక్ష్యాన్ని చేరకుండా నిలువరిస్తుంటాయి. కుటుంబంతో బంధాన్ని.. సమాజంతో అనుబంధాలను దూరం చేస్తుంటాయి. అధోగతి పాల్జేసే దురలవాట్లు.. వ్యక్తిత్వ లోపాలను అధిగమించినపుడే పరిపూర్ణత గల వ్యక్తులుగా ఎదగగలమంటున్నారు సామాజికవేత్తలు. తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ముందుగా ఎవరికి వారు తమలోని దుర్గుణాలను గుర్తించాలంటున్నారు. పరస్త్రీ వ్యామోహంతో సీతాదేవిని చెరబట్టిన రాక్షసరాజు రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించిన రోజుగా విజయదశమిని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు పండుగ జరుపుకొంటాం. కాలం మారినా.. ఏదో ఒకచోట అవలక్షణాలు.. మనిషిలోని రాక్షసుడిని వెలికి తీస్తుంటాయి. ప్రత్యక్షంగా.. కుటుంబం.. పరోక్షంగా సమాజంపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. కోటి ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో పెరుగుతున్న నేరాలు.. ఘోరాలకు కారణం.. అధికశాతం వ్యక్తిగత లోపాలు వ్యక్తిత్వానికి శాపంగా మారటమే అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కాస్త మనసుబెడితే.. అంతర్గతమైన దుర్గుణాలను గుర్తించి.. వాటిని జయించడమెలాగో సూచిస్తున్నారిలా...

ధూమపానం
కాఫీక్లబ్‌లు, పబ్‌లు, విద్యాలయాలు.. ఇలా ప్రతిచోట స్నేహితులు నేర్పిన సరదా అలవాటు గ్రహపాటుగా మారుతోంది. ఇది పక్కవారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. శ్వాసను నెమ్మదిగా దూరం చేస్తూ.. ఊపిరిని ఆపేస్తోంది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇదొక మార్గంగా భావిస్తున్న వారు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. అసోచామ్‌ గణాంకాల ప్రకారం భారత్‌లో పొగాకు ఉత్పత్తుల మార్కెట్‌ విలువ రూ.11,79,498 కోట్లు. హైదరాబాద్‌ వాటా సుమారు 4-5శాతం.
మార్పు ఇలా సులభం:  పొగాకు ఉత్పత్తుల వాడకం నుంచి బయటపడేందుకు వైద్య పద్ధతులను అనుసరిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దైనందిన జీవితంలో ఆచరించే కొన్ని చిట్కాల ద్వారా, కుటుంబ సభ్యుల తోడ్పాటుతో మానేయడం సులువు అంటున్నారు వైద్య నిపుణులు.
బద్దకం..వాయిదా పద్ధతి
చేద్దాం.. చూద్దామంటూ వాయిదా వేసే బద్దకంరాయుళ్ల సంఖ్య నగరంలో క్రమంగా పెరుగుతోంది. శరీరాన్ని కష్టపెట్టేందుకు ఇష్టపడకపోవటం అవలక్షణానికి ప్రధాన  కారణం. కరెంట్‌ బిల్లు, పిల్లల బడిఫీజులు, ఆదాయపన్నులు, వైద్యపరీక్షలు ఇలా.. ప్రతి స్థాయిలో రేపు మాపనే స్వభావం కుటుంబం పరంగానే గాకుండా.. కెరీర్‌లోనూ వెనక్కి లాగేస్తుంది. పొదుపు చేద్దామనే ఆలోచన చేసినా.. ఏవో సాకులు వెతుకుతూ చివర్లో అప్పులు పాలయ్యేవారు నగర జనాభాలో 25శాతం ఉంటారంటూ ఓ మనస్తత్వ నిపుణుడు విశ్లేషించారు.
మార్పు ఇలా సులభం: నెలలు, సంవత్సరాల నుంచి ఉన్న అలవాట్లు మార్చుకునేందుకు కొంత సమయం పడుతుంది. రోజూ ఒకే సమయానికి నిద్రలేవటం, నిద్రపోవటంతో ఈ అవలక్షణాల నుంచి బయటపడవచ్చు. నిత్యం చేయాల్సిన వ్యక్తిగత, కుటుంబ, కార్యాలయ పనులు కాగితంపై రాసుకుని అప్రమత్తంగా ఉంటూ పూర్తి చేసి జాబితాలో టిక్‌ చేస్తుండాలి. వ్యక్తిగత క్రమశిక్షణపై మనసు కేంద్రీకరించాలి.

ఊబకాయం
కాలు కదపాల్సిన పనిలేదు. క్లిక్‌ చేస్తే చాలు.. అన్నీ కాళ్లముందు వాలిపోతున్నాయి. సౌకర్యం పేరిట శరీరం శ్రమను మరచిపోతుంది. ఫలితంగా.. అంతర్గత అవయవాల స్పందనలో తేడాలొస్తున్నాయి. దీనంతటికీ కారణం అధిక బరువు, ఊబకాయం.. నగరంలో 30 శాతం మంది ఇటువంటి ఇబ్బంది పడుతున్నారు. మూడు పదుల వయసుకే మోకాళ్ల నొప్పులు.. హ్రుద్రోగ సమస్యల వంటివి వస్తున్నాయి. ఈ పరిస్థితి వ్యక్తిగతంగానూ, సామాజిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది.

ఆత్మ విశ్వాసం

మార్పు ఇలా సులభం: ఆహారంలో మేలైన మార్పులు, రోజూ 30 నిమిషాల వ్యాయామం, నడక వంటి వాటితో సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. సరదాగా అలా నడచివచ్చామని గాకుండా.. బ్రిస్క్‌వాకింగ్‌ ద్వారా బరువును నియంత్రించవచ్చు. తృణధాన్యాలు శరీరంలోని కొవ్వును తగ్గించుకునేందుకు చక్కగా ఉపయోగపడతాయంటున్నారు వైద్య నిపుణులు.

మద్యపానం
నాలుకపై చేరగానే మెదడు మొద్దుబారుతుంది. సాఫీగా సాగే సంసారంలో చికాకులకూ ఇదే కారణం. ఏటా 2000-2500 వరకూ భార్యభర్తలు గొడవలతో విడిపోయేందుకు ఈ మహమ్మారి చిచ్చుపెడుతోంది. మూడు పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో ప్రతినెలా 3000-3500 డ్రంకన్‌డ్రైవ్‌ కేసులు నమోదవుతుంటాయి. మద్యం అలవాటుతో కాలేయం దెబ్బతిని సుమారు 1000-1500 మంది వరకూ అవయవ మార్పిడికి దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
మార్పు ఇలా సులభం: అలవాటు మానేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాయి. డీఅడిక్షన్‌, పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అధునాతన చికిత్స విధానంతోనూ మార్పు సాధ్యమంటున్నారు వైద్యనిపుణులు. పుస్తకపఠనం, చక్కని అభిరుచులతోనూ తమను తాము సంస్కరించుకోవచ్చు.
అతి కోపం
హాయిగా సాగే కాపురంలో కలతలకు 30-40శాతం కోపతాపాలే కారణమంటున్నారు కౌన్సెలింగ్‌ నిపుణులు. ఎవరో ఒకరు కొద్దిసేపు ఓర్పుగా ఉంటే చాలంటున్నారు. ఇంటా, బయటా కోపానికి గురయ్యే వారిలో అధికశాతం నగరవాసులే ఉంటున్నారు. నగరంలో జరిగే హత్యల్లో మద్యపానం తరువాత ఆవేశంతో నిగ్రహించుకోలేక చేసినవే ఉంటున్నాయి. వృత్తిపరమైన ఒత్తిడి.. అస్తవ్యస్త ట్రాఫిక్‌ కూడా అదుపు తప్పడానికి మరికొన్ని కారణాలు.
మార్పు ఇలా సులభం: కుటుంబ విషయాల్లో భావోద్వేగాలపై నియంత్రణ పెంచుకోవాలి.. యోగా, ధ్యానం వంటివి ఉపకరిస్తాయి. స్థాయిని మించి సాయం చేయడం మానుకోవాలి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలి. కొన్ని అంశాల్లో మొహమాటం     వదిలేయాలి.
రావణుడి చేతిలోని ఖడ్గం కచ్చితమైన నిర్ణయానికి ప్రతీక.. ముందడుగు వేయాలనే స్థిరమైన నిర్ణయం..అవరోధాలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం అందిస్తుంది.
మానసిక ఒత్తిడి
పోటీ ప్రపంచంలో పరుగులు.. ఎదుటివారిని దాటేయాలనే వేగం. మనసును చుట్టుముట్టే ఆలోచనలతో ఆందోళన పెరుగుతోంది. నిశ్శబ్దంగా కబళించే ఒత్తిడి వలలో చిక్కుతున్నామనేది గమనించడం లేదు. పక్కవారితో పోలిక, అనుకున్నది క్షణాల్లో వాలిపోవాలనే తపన, కష్టమని తెలిసినా తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకోవడం మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి. అవి రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులకు దారి తీస్తున్నాయి.
మార్పు ఇలా సులభం:  బడికెళ్లే పిల్లాడి నుంచి కార్పొరేట్‌ సంస్థ సీఈఓ వరకూ అన్ని స్థాయిల్లో ఒత్తిడి సర్వసాధారణంగా మారింది. శక్తిని మించిన లక్ష్యాలను నిర్దేశించుకోవద్దు. ఎదుటివారితో పోలిక,  బిడియం వదిలేయాలి. మంచి స్నేహితులతో గడపడం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, మనసుకు ఊరటనిచ్చే చక్కటి అలవాట్లు ఉపకరిస్తాయి.
ప్రతిష్ఠను దిగజార్చిన అవలక్షణాలు
తనలో చొరబడిన పరస్త్రీ వ్యామోహం వంటి అవలక్షణాలను వదిలించుకోలేక శిఖర సమానమైన ప్రతిష్ఠను దారుణంగా దిగజార్చుకుని రావణుడు రాక్షసుడిగా మారిన తీరును నేటి సమాజం గుణపాఠంగా తీసుకోవచ్చు.  దశకంఠుడు తన శక్తిసామర్థ్యాలను ద్విగుణీకృతం చేసుకునేందుకు విరామమెరుగని కృషి.. ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకోవడంలో అచంచల దీక్ష వంటి సద్గుణాలను ఈ క్రమంలో కోల్పోయాడు. ప్రతి ఒక్కరిలో రాక్షసుడు ఉండకపోవచ్చుకానీ.. అలాంటి కొన్ని దుర్గుణాలు జీవితంపై ప్రభావం చూపుతాయి. వాటిని అధిగమించేందుకు విజయదశమి రోజు సంకల్పం తీసుకుందాం.

సత్కార్యం సాధించాలనుకునే వారికి సంకల్పమే పూర్తి బలం. అది ఎంచుకున్న మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను అడ్డుకునేందుకు డాలులా ఉపయోగపడుతుంది. కానీ రావణుడు తన మనోబలాన్ని చెడు పనులకు వినియోగించాడు.

స్నేహితులు
ఎంతటి కష్టమైనా వారితో పంచుకుంటే ఉపశమనం. వారి సలహాలు అపదల వేళ అండగా నిలుస్తాయి. చిక్కుల నుంచి బయటపడేసే మంత్రాలుగా ధైర్యాన్నిస్తాయి. సీతాపహరణ చేసినపుడు హితోక్తులు వినక రావణుడు సర్వం కోల్పోయాడు.
ఎంత గొప్ప శక్తిమంతుడికైనా నిలదొక్కుకునేందుకు ఊతం కావాలి. అందుకు హితులు, కుటుంబ సభ్యులు దోహదం  చేస్తారు
దుబారా
డబ్బు వృథా చేయడం మాత్రమే కాదు.. పరుగెత్తే కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం కూడా దుబారాగానే భావించాలంటున్నారు ఆధునిక సామాజికవేత్తలు.  కొందరు సరదాలను ఆస్వాదించాల్సిన వయసుగా భావించి యవ్వన కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చేతినిండా సొమ్ములు సంపాదిస్తున్న సమయంలో భవిష్యత్‌ను మరచిపోయి వృథాకు ద్వారాలు తెరుస్తున్నారు. కష్టం కళ్లెదుట కనిపించాకనే తాము చేసిన తప్పిదాన్ని గుర్తెరుగుతున్నారు.
మార్పు ఇలా సులభం: అతిగా చేసే నీటి వినియోగాన్ని ఆరికట్టడం, అవసరం మేరకే విద్యుత్‌ ఉపయోగం, కుటుంబ అవసరాలకు తగినట్టుగానే వస్తువుల కొనుగోలు.. వంటివన్నీ దుబారాను అరికట్టే సూత్రాలు. ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందలేనివి కాలం, డబ్బు. ఇవి రెండూ జీవితాన్ని సాఫీగా కొనసాగించేందుకు అత్యవసరం అని గుర్తించాలి.
నిర్లక్ష్యం
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి.. మహిళలను గౌరవించాలి.. చట్టాన్ని అనుసరించాలి.. ఇలా వినేందుకు చాలా చక్కగా ఉండేవాటిని ఆచరిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ నిబంధనలు ఉల్లంఘించటమే హీరోయిజంగా భావిస్తున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌ ప్రయాణం, ప్లాస్టిక్‌ వాడకంలో నిలువెల్లా నిర్లక్ష్యం. ఎదుటివారు చెబితే తాను చేయాలా అనే నిర్లక్ష్య ధోరణి తమను ప్రమాదపు అంచుల్లోకి తీసుకెళతాయని మరచిపోతున్నారు.
మార్పు ఇలా సులభం: నీతి నియమాలు, నిబంధనలు, నైతిక విలువలను అనుసరించటమే నిర్లక్ష్యానికి సమాధానం. సకాలంలో పన్నులు చెల్లించటం, వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనపుడు కాలయాపన చేయకుండా సత్వరమే స్పందిస్తేనే పరిష్కారం దొరుకుతుంది.
అనైతిక బంధాలు
విచక్షణ మరచి క్షణకాలపు ఆనందం కోసం జీవితాన్ని పణంగా పెడుతున్నారు. విలువలను వదిలేసి నైతికంగా దిగజారటం వల్ల కుటుంబం నడిబజార్లో నిలబడుతోంది. నగర వాతావరణంలో సహజీవనం విస్తరిస్తోంది. అనైతికబంధాలు పెరుగుతున్నాయి.ఆధునిక అడుగులుగా భావిస్తూ తప్పటడుగులు వేస్తున్నారు. తలవొంపులు తెచ్చుకుంటున్నారు.
మార్పు ఇలా సులభం: ఆలుమగల మధ్య అన్యోన్యత నిలబెట్టుకుంటే కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది. పిల్లలు ఉన్నతంగా ఎదిగేందుకు మార్గం ఏర్పడుతుంది. నిండైన సంసారం ఆభాసుపాలవకుండా తప్పులు సరిదిద్దుకునేందుకు మార్గాలను గుర్తించాలి. అవసరమైతే కుటుంబసభ్యుల తోడ్పాటు కోరాలి. బయటపడాలని అనుకుంటే చేయూత ఇచ్చేందుకు మానసిక నిపుణులు అందుబాటులోనే ఉన్నారు.
సామాజిక మాధ్యమాల దుర్వినియోగం
ప్రపంచాన్ని దగ్గరగా చేసిన సాంకేతిక పరిజ్ఞానం.. సరికొత్త శత్రువుగా మారుతోంది. ఆన్‌లైన్‌, వీడియో గేమ్స్‌తో సమయాన్ని ఆస్వాదిస్తున్నామని భావిస్తున్న యువత.. జీవితాన్ని కోల్పోతున్నామని మరచిపోతున్నారు. మత్తు పదార్థాలకు మించి సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు.
మార్పు ఇలా సులభం:  సామాజిక హోదా పేరుతో పిల్లలకు సెల్‌ఫోన్‌ కొనివ్వడం తగ్గించాలి. వారు ఉపయోగించే అంతర్జాలం, సామాజిక మాధ్యమాల ఖాతాలపై ఓ కన్నేయాలి. సమయాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో వారు గుర్తించేలా చేయాలి. నిద్రలేమి, కంటిజబ్బులు, మానసిక రుగ్మతలు, మనసుపై నియంత్రణ కోల్పోవటానికి వీడియోగేమ్స్‌, సామాజిక మాధ్యమాలు కారణమని తెలియజెప్పాలి.
కుటుంబ సభ్యులు
భరోసా, మనోధైర్యాన్ని ఇచ్చేది కుటుంబం. సన్మార్గంలో నడిపించే అమ్మానాన్నలు, తాత బామ్మలు, క్షేమం కోరే భార్య ప్రతి ఇంటి సంపదలు. సీతను రాముడికి అప్పగించి యుద్ధాన్ని నివారించమని కోరిన భార్య మండోదరి మాటలు పెడచెవిన పెట్టిన దశకంఠుడు చివరకు హతమయ్యాడు. అందుకే కుటుంబ సభ్యుల సలహాలు వింటే సగం సమస్యల నుంచి బయటపడినట్టే.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.