close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

కామికాన్‌ హైదరాబాదే ఐకాన్‌!

‘కాస్‌ప్లేయర్స్‌ హైదరాబాద్‌ క్లబ్‌’ కీలక పాత్ర
వస్త్రాలందిస్తారు.. పాత్రలకు జీవం పోస్తారు..!
12, 13 తేదీల్లో నగరంలో కార్యక్రమం
  ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

కామికాన్‌... నగరానికి పరిచయమైన ఓ విదేశీ సంస్కృతి. దేశంలోని ప్రధాన నగరాల్లో దీనికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఏ నగరంలో ఈవెంట్‌ జరిగినా దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల నుంచి కాస్‌ప్లేలో పాల్గొనడానికి యువజనులు ఆసక్తి చూపుతుంటారు. నచ్చిన పాత్ర వేషం వేసుకొని కార్యక్రమానికి హాజరైనవారిని అలరిస్తుంటారు. పాత్ర వేషధారణ సాధారణ విషయం కాదు. కార్యక్రమానికి నెల రోజుల ముందే కసరత్తు ప్రారంభిస్తారు. దుస్తులు, మేకప్‌ తదితరాలకు వెతుకులాట ప్రారంభిస్తారు. హాలీవుడ్‌ సినిమాలు, యానిమేషన్‌, గేమింగ్‌ తదితర రంగాల్లో సూపర్‌ హీరోలు, హీరోయిన్లు, జోకర్లు, విలన్లు, దెయ్యాలు తదితర పాత్రల ఎంచుకొని అచ్చం వారిలాగా కనిపించేందుకు ముమ్మర కసరత్తు చేస్తారు. కొందరికీ ఈ వేషధారణ సులువుగా అబ్బితే.. మరికొందరు చాలా కష్టపడుతుంటారు. ఇలాంటి వారికి సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు ‘కాస్‌ప్లేయర్స్‌ క్లబ్‌ హైదరాబాద్‌’ సభ్యులు. నచ్చిన వస్త్రాలను(కాస్ట్యూమ్‌)ను తయారు చేస్తామని చెబుతున్నారు.


హైదరాబాద్‌లో 2013లో తొలి కామికాన్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న కొందరు ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు. కొన్నాళ్లకు ఫేస్‌బుక్‌లో కాస్‌ప్లే క్లబ్‌ పేరుతో పేజీని తెరిచారు. తొలుత చేరిన సాయిప్రకాష్‌, రోనిత్‌ రాయ్‌, శ్రీమాన్‌కుమార్‌ మరింత మంది సభ్యులను చేర్చే పనిచేపట్టారు. తొలుత 40 మంది మాత్రమే చేరారు. ప్రస్తుతం 1000కి పైగా సభ్యులున్నారు. 600 మంది భాగ్యనగరవాసులుండగా, మిగతావారు ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర నగరాలవాళ్లున్నారు. దేశవ్యాప్తంగా 5000కు పైగా మంది సభ్యులున్నట్లు కాస్‌ప్లే హైదరాబాద్‌ క్లబ్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఎక్కడ కాస్‌ప్లే కార్యక్రమం జరిగితే అక్కడ వీరంతా పాల్గొంటారు.

మూడు నెలలకోసారి ‘మీటప్‌’
కార్యక్రమం జరిగినప్పుడే కాకుండా సభ్యులు ప్రతి మూడు నెలలకోసారి ‘మీటప్‌’ పేరిట కలుస్తుంటారు. కనీసం 50-60 మంది హాజరవుతుంటారు. కాస్‌ప్లే గురించి చర్చలు, ఇతరులకు సాయం చేయడం, కొత్తగా వచ్చే పాత్రలు, వాటి దుస్తులు, మేకప్‌ ఇతరత్రా గురించి చర్చలు సాగుతాయి. సభ్యుల్లో చాలా మంది ఉన్నతోద్యోగాల్లో స్థిరపడినవారే. కళాశాలల విద్యార్థులూ ఉండడం విశేషం. ఇంజినీర్లు, లెక్చరర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. వీరిలో 16 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసుల వారూ కన్పిస్తారు.

ఆసక్తి ఉంటే పాల్గొనొచ్చు
కాస్‌ప్లేలో పాల్గొనాలనుకునేవాళ్లు ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. అందుబాటు ధరల్లోనే రోజుకు కొంత చొప్పున చెల్లించి ఆ రోజంతా ఆ కార్యక్రమంలో నచ్చిన వేషధారణలో తిరగొచ్చు. మేకప్‌ ఖర్చులు అదనం. సాధారణ మేకప్‌ ఉండే క్యారక్టర్లను ఎంచుకుంటే కేవలం నమోదు ఫీజు భరిస్తే సరిపోతుంది.

ఎక్కువగా పోషిస్తున్న పాత్రలు
ఐరన్‌మ్యాన్‌, థోర్‌, జోకర్‌, బ్యాట్‌మ్యాన్‌, డీసీ మార్వెల్‌ సినిమాల్లోని పాత్రలు. సైనడై అండ్‌ హ్యాపీనెస్‌ అనే కామిక్‌ క్యారెక్టర్‌ను వేసినప్పుడు కేవలం రూ.30 మాత్రమే ఖర్చయ్యాయి.

అటు ఉద్యోగం.. ఇటు కాస్‌ప్లే: సాయి ప్రకాష్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌, కాస్‌ప్లేయర్స్‌ హైదరాబాద్‌ క్లబ్‌ సభ్యుడు

కాస్‌ప్లేకు విశేష స్పందన లభిస్తోంది. నేను చార్టెడ్‌ అకౌంటెంట్‌ను. సరదాగా ఇందులో పాల్గొంటున్నాను. ఖాళీ సమయాల్లో నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్‌ సినిమాలు, యానిమేషన్‌ను చూసి పాత్రలను ఎంచుకుంటాం. ఒకే అభిరుచి ఉన్నవాళ్లంతా కలిసి ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ఈవెంట్లలో పాల్గొనేవారు పాత్రలకు తగిన దుస్తులు తయారు చేసుకోవడంలోనే ఇబ్బందులు పడుతుంటారు. వారికి క్లబ్‌ తరఫున సాయం అందిస్తున్నాం. నామమాత్రపు రుసుం తీసుకుని దుస్తులు తయారు చేస్తున్నాం. పాత్రకు తగ్గట్టు క్లబ్‌లో ఒక్కొక్క సభ్యుడు ఒక్కో భాగాన్ని తయారు చేయడంలో సిద్ధహస్తులు. అంతర్జాలంలో, ట్యుటోరియల్‌ వీడియోల ద్వారా తయారీ విధానం నేర్చుకున్నాం. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడేవాళ్లు ఆయా పాత్రలను పోషించేందుకు ఇష్టపడుతుంటారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.