close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

ఆస్తిపన్నులో అవినీతికి అడ్డుకట్ట!

ఓసీతోనే మదింపు
15న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌
జీహెచ్‌ఎంసీలో నూతన విధానం
ఈనాడు, హైదరాబాద్‌

ఆస్తిపన్ను మదింపులో బిల్‌కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపులు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. నివాసయోగ్యతాపత్రం(ఓసీ) జారీతోపాటే ఆస్తిపన్ను మదింపును పూర్తి చేయాలని నిర్ణయించింది. యజమానుల సమయాన్ని ఆదా చేయడం, ఆస్తిపన్ను మదింపులో పారదర్శకతకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డీపీఎంఎస్‌(డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)లో ప్రణాళిక విభాగం మార్పులు చేసింది. జారీ అయిన భవన నిర్మాణ అనుమతిలోని విస్తీర్ణం, అంతస్తులు, ఇతర వివరాల ఆధారంగా ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసు జారీ అయ్యేలా కొత్త సదుపాయాన్ని తెరపైకి తెచ్చారు. టీడీఆర్‌(అభివృద్ధి బదలాయింపు హక్కు) యజమానుల వివరాలతో రూపుదిద్దుకున్న వెబ్‌సైట్‌నూ బల్దియా సిద్ధం చేసింది. రెండు సేవలను ఈనెల 15న రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారని కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల నిబంధనల ప్రకారం 200 చ.మీల విస్తీర్ణం, అంతకు మించి చేపట్టే నిర్మాణాలు పది శాతం నిర్మాణ స్థలాన్ని బల్దియాకు తనఖా పెట్టాలి. నిర్మాణ పనులు పూర్తయ్యాక అధికారులు పరిశీలించి, అనుమతి ప్రకారం జరిగినట్లు నిర్ధారించుకున్నాక నివాసయోగ్యపత్రం(ఓసీ) జారీ చేస్తారు. అనంతరం ఇంటి యజమాని బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆస్తిపన్ను వేయాలని కోరతాడు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ఇది. అదే అదనుగా ఇంటి యజమానిని ఆస్తిపన్ను మదింపు పేరుతో పలువురు బిల్‌కలెక్టర్లు, ట్యాక్స్‌ఇన్‌స్పెక్టర్లు ఆందోళనకు గురి చేస్తున్నారు. కొలతల మాయాజాలంతో లేని దానికి, ఉన్న దానికి కలిపి ఆస్తిపన్నును రెండు లేదా మూడింతలు ఎక్కువ చేసి చెబుతున్నారు. బిల్డింగ్‌ ప్లాన్‌కు విరుద్ధంగా కట్టారని బెదిరిస్తున్నారు. యజమానులకు అర్థంకాని భాషలో లెక్కలేస్తారు. అడిగినంత ఇస్తే మామూలుగా పన్ను విధిస్తాం.. లేకుంటే నీ ఇష్టమని మెలికపెడతారు. చేసేదేమీ లేక యజమాని బేరం మాట్లాడుకుని కొంత మొత్తాన్ని లంచంగా ఇస్తున్నాడు.ఇల్లు కట్టుకున్న యజమానికి అలాంటి అవస్థలు ఉండకూడదన్న లక్ష్యంతో అధికారులు ఓసీ జారీతోపాటు ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసు యజమానికి నేరుగా వెళ్లే ఏర్పాటు చేశారు. అనుమతి లేదా ఓసీలో పేర్కొన్న విస్తీర్ణానికి పన్ను విధించి నోటీసు ఇస్తామని, దానిపై అభ్యంతరాలుంటే యజమాని అభ్యంతరం తెలపొచ్చని కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌లో టీడీఆర్‌ బ్యాంకు..
గత కొన్నేళ్లుగా భూమిని కోల్పోయే యజమానికి నగదు బదులు టీడీఆర్‌(అభివృద్ధి బదలాయింపు హక్కు) ఇస్తోంది జీహెచ్‌ఎంసీ. కొత్త విధానం వల్ల బల్దియాకు సగటున ఏటా రూ.250కోట్ల మేర పరోక్షంగా లబ్ధి చేకూరింది. ఇప్పటి వరకు సుమారు 350 మంది టీడీఆర్‌ తీసుకున్నట్లు ప్రణాళిక విభాగం చెబుతోంది. భూసేకరణ చట్టం ప్రకారం సేకరించే ఆస్తులకు నష్టపరిహారం చెల్లించడం బల్దియాకు సాధ్యపడదు. దాంతో ఉభయ తారకంగా ఉండే టీడీఆర్‌ విధానాన్ని అందిపుచ్చుకుంది. దాని ప్రకారం యజమానికి కోల్పోయే భూ విస్తీర్ణానికి నాలుగింతల విలువైన లబ్ధి చేకూరుతుంది. ఎలాగంటే.. రిజిస్ట్రేషన్‌ ధర ప్రకారం రూ.50 లక్షల విలువైన 5000 చదరపు అడుగుల స్థలానికి.. రూ.2 కోట్ల విలువైన 20 వేల చదరపు అడుగుల అభివృద్ధి బదలాయింపు హక్కు దక్కుతుంది. యజమాని దాన్ని ఎన్ని భాగాలుగానైనా విభజించి అమ్ముకోవచ్చు. టీడీఆర్‌తో పరిమితికి మించి ఓ అంతస్తును అదనంగా నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి వాణిజ్య ప్రాంతాల్లో దానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. అదే విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు యజమానులకు వివరిస్తూ.. టీడీఆర్‌ మార్కెట్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఎవరి వద్ద, ఎంత విస్తీర్ణం, ఎంత విలువైన టీడీఆర్‌ ఉందనే విషయాలను డిజిటలీకరణ చేసి ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. టీడీఆర్‌తో అవసరమున్న వారు వెబ్‌సైట్‌ను సందర్శించి యజమానులను సంప్రదించవచ్చన్నారు. టీడీఆర్‌ మార్కెట్‌ పెరిగితే బల్దియాపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.