close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

మనసు.. ఎందుకింత అలుసు?

తెలిసిన శత్రువుతో నిశ్శబ్ద యుద్ధం
 ఆందోళన.. ఒత్తిడితో కుంగుబాటు
కౌన్సెలింగ్‌కు వెళ్లేందుకు ససేమిరా
 మహానగరంలో 7-8 శాతం మందికి మనోవేదన

* రోజూ బుద్దిగా పాఠాలు వింటూ మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థి ఎందుకిలా మారాడు? ర్యాంకుల యంత్రాలుగా మారిన పిల్లల ప్రవర్తన గురువులకు పట్టదు.
* ఇంజినీరింగ్‌ పూర్తయి రెండేళ్లవుతున్నా ఉద్యోగవకాశాలను అందిపుచ్చుకోలేకపోవటానికి కారణమేంటి? వారిని అడిగే తీరిక కన్నవారికి దొరకదు.
* ఒంటరితనంతో కాలక్షేపం చేస్తూ కుటుంబ సభ్యుల పలకరింపు కోసం కలవరించే పండుటాకుల అంతరంగాన్ని ఈ కాలపు బిడ్డలు గుర్తించట్లేదు. వీలు చిక్కితే స్మార్ట్‌ఫోన్లకు సమయం కేటాయించే వీరికి మాటల విలువ తెలియదు.

ఈనాడు, హైదరాబాద్‌

చాలా చిన్నవిగా కనిపించే సున్నితమైన అంశాలు మానసిక క్షోభకు కారణమవుతున్నాయి. సమయానికి గుర్తించలేక పసిగట్టినా బయటకు చెప్పేందుకు ధైర్యం చాలక మౌనంగా ఉంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం దగ్గరయ్యాక మనసును నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తత్వ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శారీరక బలంతోపాటు మానసిక దృఢత్వం కూడా మనుగడకు కీలకమని సూచిస్తున్నారు. ఆరోగ్యకరంగా జీవించేందుకు మనసు ఎంతటి ముఖ్యపాత్ర వహిస్తుందనే విషయాన్ని తెలియజేసేందుకుక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా అక్టోబరు 10న ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ నిర్వహిస్తోంది. 1996 నుంచి ఏటా ప్రత్యేక థీమ్‌ ద్వారా అవగాహన కల్పిస్తోంది. గతేడాది యువత-మానసిక ఆరోగ్యంతో సాధించే మార్పును అంశంగా తీసుకుని ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ఏడాది ‘40 సెకండ్స్‌ ఆఫ్‌ యాక్షన్‌’ అంశాన్ని ప్రకటించారు. ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే) సందర్భంగా ప్రత్యేక కథనం.

 

హైదరాబాద్‌ మహానగరంలో ప్రతి 100 మందిలో 7-8 మంది కుంగుబాటు, ఆందోళన, మానసిక ఒత్తిడి.. మూడింట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మద్యపానం, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారని మనస్తత్వ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భరించలేని స్థితిలో బలవన్మరణాల వైపు అడుగులు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలలో ఉండే బలమైన భావోద్వేగాలు.. చిన్న కుటుంబాలలో దూరమవటం మానసిక ఒత్తిడి పెరగటానికి ప్రధాన కారణమంటున్నారు మనస్తత్వనిపుణుడు, మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.ఉమాశంకర్‌. మనోవేదన ఎవరితో పంచుకోవాలనేది తెలియక తమలో తాము కుమిలిపోతూ ఆత్మహత్యలకు మొగ్గు చూపుతున్నారని వివరించారు. బడికెళ్లే పిల్లాడి నుంచి కార్పొరేట్‌ సంస్థ సీఈఓ వరకూ ప్రతిస్థాయిలోనూ మనోరుగ్మతలు పెరగటం ఆందోళనకు గురిచేస్తుందని చెప్పారు. తొలిదశలో సమస్యను గుర్తించి వైద్యసాయం తీసుకుంటే బయటపడవచ్చని సూచించారు.

నగరం చోటెక్కడ

మానసిక ఆరోగ్యమంటే..
* తనకు తాను ఎలా ఉంటారో ఇతరులతోనూ అదేవిధంగా నడుచుకుంటారు.
* బలాలు, బలహీనతలను అంచనా వేయగలరు.
* భవిష్యత్‌పట్ల ఆశావహ దృక్పథంలో ఉంటారు.
* కష్టపడి పనిచేయటం, నవ్వుతూ ఉండటం, సరైన ప్రణాళికతో అడుగులు వేస్తారు.
* భావోద్వేగాలపై స్వీయ నియంత్రణ, ఆహార నియమాలు, సరైన నిద్ర, విలువలతో కూడిన జీవనం గడుపుతారు.

మనోరుగ్మతకు మూలాలు
* శక్తి, సామర్థ్యానికి మించిన లక్ష్యాలు.
* సరైన ప్రణాళిక లేకుండా వేసే అడుగులు.
* సమస్య ఎదురైనప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం.
* పరాజితుడు, ఎందుకు పనికిరాను, జీవితం వృథా అనుకోవటం.
* తనను చిన్నచూపు చూస్తున్నారనే ప్రతికూల ఆలోచనలు.
* ఓటమిని అంగీకరించలేని సున్నిత మనస్తత్వం.
* భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవటం.
దీర్ఘకాలిక వ్యాధులు, జన్యుపరమైన కారణాలు, వివాహ సంబంధాలు, కుటుంబపరమైన వివాదాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణమని కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు మోతుకూరి రాంచందర్‌ వివరించారు. ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తిలో ప్రమాద సూచికలను గుర్తించగలిగితే వారిని బలవన్మరణం నుంచి జీవితంవైపు అడుగులు వేయించవచ్చన్నారు.

ఇవిగో సూచికలు
* వ్యక్తి ప్రవర్తనలో మార్పు.
* మానసిక స్థితి సరిగా లేకపోవటం, ఆవేశపడటం, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు.
* ఒంటరిగా తిరగటం, నిరాసక్తత ప్రదర్శించడం.
* దైనందిన కార్యక్రమాలపట్ల నిర్లక్ష్యం.
* నిద్రాహారాలు మానేసి తీవ్రమైన మానసిక ఆందోళనతో ప్రవర్తించటం.

నివారణ మార్గాలు
* అనుమానితుడి కదలికలపై కన్నేయాలి. ఒంటరిగా వదిలేయకూడదు. కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.
* ప్రమాదకరమైన వస్తువులు, విషపదార్థాలను దూరంగా ఉంచాలి.
* కుటుంబసభ్యుల అండదండలుండాలి.

మీ చేతుల్లోనే దృఢమైన మనసు
- డాక్టర్‌ ఎం.ఉమాశంకర్‌, సూపరింటెండెంట్‌,
ప్రభుత్వ మానసిక వైద్యశాల
* మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు గుర్తిస్తే సహాయం తీసుకోవాలి.
* మానసిక వ్యాధులకు వాడే మందులు సైడ్‌ ఎఫెక్ట్‌ ఇస్తాయని అపనమ్మకం వీడాలి.
* వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోవాలి.
* అధునాతన వైద్యవిధానంలో తేలికగా మానసిక వ్యాధులను తగ్గించవచ్చు.
* విద్యార్థి దశలోనే క్రీడాంశాలను అలవాటు చేసి గెలుపోటములను సమానంగా స్వీకరించే లక్షణం అలవడుతుంది.
* నడక, వ్యాయామం, యోగ, ధ్యానం, బ్రీతింగ్‌ టెక్నిక్స్‌ ఒత్తిడి, కుంగుబాటును తగ్గిస్తాయి.
* సామర్థ్యానికి మించిన లక్ష్యాలను నిర్దేశించుకోవద్దు.
* ఉన్నదానితో తృప్తిపడాలి.
* ఆలుమగల కీచులాటల్లో సర్దుకుపోవటం సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.
* మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకోవాలనే సానుకూల ఆలోచన ఎంతో బలాన్నిస్తుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.