close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

అంతా చెత్త.. రోగాల చింత!

 వీధుల్లో, కాలనీల్లో చెత్తకుప్పలు
 తరలింపు కేంద్రాల్లో నిలిచిన వ్యర్థాలు
 పండుగ పేరుతో అధికారుల నిర్లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్‌

అసలే వరస పండుగలు. ఆపై వర్షాలు. ఇలాంటి పరిస్థితుల్లో నగరవ్యాప్తంగా అలముకొన్న అపరిశుభ్ర వాతావరణం  ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. జీహెచ్‌ఎంసీ మాత్రం.. వాహనాల కొరత పేరుతో తరలింపు కేంద్రాల్లోని చెత్తను అలాగే వదిలేస్తోంది. ఫలితంగా కాలనీల్లో చెత్తకుప్పలు కొండల్లా పెరుగుతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతోపాటు, పాదచారులు నడవలేని దుస్థితి తలెత్తుతోంది. పండగ పేరుతో చూపిస్తోన్న నిర్లక్ష్యమే అందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌ మహానగరంలో సాధారణ రోజుల్లో ప్రస్తుతం 5వేల మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. గత రెండు నెలలుగా వరసగా పండుగలు రావడంతో సగటున రోజుకు 5,500 టన్నుల చెత్త వస్తోంది. దసరా సందర్భంగానూ నగరవ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. బక్రీద్‌, వినాయకచవితి పండగలకు అదనపు వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు దసరా నవరాత్రుల అంశాన్ని విస్మరించారు. దాంతో వారం రోజులుగా  చెత్త సేకరణ అటకెక్కాయి.  నిబంధనల ప్రకారం.. ఆయా తరలింపు కేంద్రాలకు వచ్చిన చెత్తను.. ఏ రోజుకు ఆ రోజు జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లాలి.  ట్రక్కులు తక్కువగా ఉన్నాయంటే అధికారులు తరలింపు కేంద్రాలను పట్టించుకోవడం మానేశారు. దాంతో ఖాళీగా కనిపించాల్సిన కేంద్రాల్లో చెత్త పేరుకుపోయింది.

ఒక్కో కేంద్రంలో ఒక్కో తీరు..
జనావాసాల నుంచి సేకరించిన చెత్తను ఆటోలు, ఇతర వాహనాలు తరలింపు కేంద్రానికి తీసుకెళ్తాయి. అధికారులు అక్కడ పోగయ్యే వ్యర్థాలను ట్రక్కుల్లో నింపి జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు తరలిస్తారు. గత వారం రోజులుగా చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలు రెండూ నిలిచిపోవడంతో రెండు రకాలుగా పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల మధ్యలో వెలుస్తోన్న చెత్తకుప్పలతో కాలనీలు అపరిశుభ్రంగా తయారవుతుంటే.. తరలింపు కేంద్రాల్లో కొండల్లా పేరుకుపోయిన వ్యర్థాలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి.   కేపీహెచ్‌బీ కాలనీల్లోని చెత్తను కైతలాపూర్‌ కేంద్రానికి, కొంత భాగం ఖైరతాబాద్‌ జోన్‌ వ్యర్థాలు లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు తరలుతాయి. కైతలాపూర్‌ వ్యర్థజలాలతో కైతలాపూర్‌ గ్రామం, పక్కనే ఉన్న వాంబే గృహసముదాయాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మూసాపేట-హైటెక్‌సిటీ మార్గంపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. లోయర్‌ట్యాంక్‌ బండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ ప్రధాన రోడ్డు పక్కనే ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం చెత్తమయమై వాహనాలు అటుగా వెళ్లలేని దుస్థితి నెలకొంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ప్రయాణించే రోడ్డు మార్గం నిత్యం పూర్తి వ్యర్థాలమయంగా దర్శనమిస్తుంటుంది. ఏ రోజు చెత్త ఆ రోజు డంపింగ్‌యార్డుకు తరలకపోవడంతోనే ఈ సమస్య. పండుగ పేరుతో అధికారులు, సిబ్బంది పారిశుద్ధ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలొస్తున్నాయి.

నగరంలోని 19 తరలింపు కేంద్రాలు ఇవీ..
రాజేంద్రనగర్‌, దేవేందర్‌నగర్‌(సర్కిల్‌2), మల్లాపూర్‌(సర్కిల్‌1), దీప్తిశ్రీనగర్‌ (సర్కిల్‌17), నేరెడ్‌మెట్‌, మచ్చబొల్లారం, సాకేత్‌నగర్‌, హెచ్‌ఎంటీపైపులైనురోడ్డు, అంబర్‌పేట, ఇమ్లిబన్‌, యూసఫ్‌గూడ, నల్లగండ్ల, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, నాగోల్‌, కైతలాపూర్‌, జియాగూడ, పటాన్‌చెరు, మౌలాలి, ఆర్‌సీపురం.
* నగరంలో సాధారణ రోజుల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలు..: 5000 మెట్రిక్‌ టన్నులు
* పండుగల సమయంలో.. : 5500 మెట్రిక్‌టన్నులు
* తరలింపు కేంద్రాల సంఖ్య.. : 19
* నిబంధనల ప్రకారం.. : తరలింపు కేంద్రాలకు వచ్చే చెత్త సాయంత్రానికి ఖాళీ కావాలి
* గత వారం రోజులుగా.. : చెత్తను జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లే ప్రక్రియ నత్తనడకను తలపిస్తుండటంతో సగటున ఒక్కో కేంద్రంలో 100టన్నుల చెత్త నిలిచింది. వీధులు, కాలనీల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.