close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

రోడ్లపై ‘ప్రసవ’ వేదన!

 గుంతలమయంగా నగర బాటలు
 వర్షం కురిస్తే గో‘దారులే’
 మలక్‌పేటలో వాహనదారుల నరకయాతన
ఈనాడు, హైదరాబాద్‌, చంచల్‌గూడ, న్యూస్‌టుడే

అడుగుకో గుంతతో నగర రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. సాధారణ వాహనదారులు ప్రసవ వేదనకు గురవుతుంటే.. నిండు గర్భిణులు ఆసుపత్రులకు తీసుకెళ్లేలోపే ప్రసవిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చినుకుపడితే మలక్‌పేట ప్రధాన రహదారి నరకాన్ని తలపిస్తోంది. కోఠి నుంచి మలక్‌పేట రైల్వేస్టేషన్‌, నల్గొండ క్రాస్‌ వరకూ రెండు వైపులా ట్రాఫిక్‌ స్తంభిస్తున్నా జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోవడంలేదు. గట్టిగా పది నిమిషాలు వర్షం కురిస్తే.. మలక్‌పేట గంజ్‌ నుంచి కోఠికి చేరుకోవాలంటే కనీసం 45 నిమిషాలు పడుతోంది. వర్షం కురిసినప్పుడు ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు చిక్కుకుంటున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదు. బుధవారం రాత్రి నెలలు నిండిన మహిళను కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తున్న 108 అంబులెన్సుకు దారి దొరక్క నల్గొండ చౌరస్తాలో ట్రాఫిక్‌ మధ్యే నిలిపేసి పైవంతెన కింద 108 సిబ్బందే పురుడు పోశారు. ఈ సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు, అదనపు ట్రాఫిక్‌ డీసీపీ కరుణాకర్‌ శుక్రవారం పర్యటించి క్షేత్ర స్థాయిలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇకనైనా ఈ సమస్యను పరిష్కరిస్తారా? లేదా? అన్నది చూడాలి మరి.

సొరంగ మార్గాలు అంతంతే...
మలక్‌పేట రైల్వేవంతెన కింద ఐదు అడుగుల వరదనీటి ప్రవాహం ప్రవహిస్తుంటుంది. వరదనీటిని తరలించేందుకు రహదారిని తవ్వకుండా అధునాతన సాంకేతికతను వినియోగించి భూగర్భంలో సొరంగ మార్గం ద్వారా తరలించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారుల చర్యలు చేపట్టారు. రూ.కోట్లు వెచ్చించి అక్షయ హోటల్‌, నల్గొండ చౌరస్తా, కాలాడేరా వద్ద పనులు పూర్తిచేశారు. వీటి ద్వారా ఫలితం లభించలేదు. మెట్రోపనుల వల్ల చాదర్‌ఘాట్‌, నల్గొండ చౌరస్తా, మలక్‌పేట మార్కెట్‌, దిల్‌సుఖ్‌నగర్‌ రోడ్డులో  పాతకాలం నాటి వరద నీటి కాలువలు పూడిపోయాయి. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్ల పరిశోధనలో తేలింది. వర్షాలు వచ్చినప్పుడు తలెత్తే వరద సమస్యకు ఇంజినీరింగ్‌ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో మలక్‌పేట రహదారిపై వాహనదారులు నరకాన్ని చవి చూశారు. రహదారులపై వరద నీరు ఉండిపోయి వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసింది.

మూసీ మెటర్నిటీ ఆసుపత్రి వద్ద కీలకం
మలక్‌పేట రైల్వేస్టేషన్‌, నల్గొండ చౌరస్తా మధ్య దారిలో మూసీ మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ఒక్కటే వరద గుంత ఉండటంతో గంటల కొద్దీ వరదనీరు నిలిచి పోతోంది. సమస్య తలెత్తినపుడల్లా ట్రాఫిక్‌ సిబ్బంది మాత్రమే రంగంలోకి దిగి తాత్కాలికంగా పరిష్కరిస్తున్నారు. ఈ రోడ్డుపై రెండు అంతకంటే అధికంగా వరద కాల్వలను ఏర్పాటు చేస్తే.. నీరంతా వాటిల్లోకి వెళ్తుంది. వర్షం కురిసినప్పుడంతా నీళ్లు నిలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం వరదనీటి కాల్వ మూసుకుపోవడంతో జలమండలి సిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారులు మలక్‌పేట ట్రాఫిక్‌ సిబ్బందితో కంకరను తొలగించేందుకు గంటల తరబడి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.

రహదారులు.. గుంతల మయం
కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. గుంతలమయంగా మారి పోయిన రోడ్లపై వాహనదారులు భయం భయంగా వాహనాలను నడుపుతున్నారు. చాదర్‌ఘాట్‌ చౌరస్తా నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు, నల్గొండ చౌరస్తా నుంచి రహదారి నిర్వహణ హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌(హెచ్‌ఆర్‌డీసీ) పరిధిలోకి వస్తుంది. దీంతో ఈ రహదారులను ఇటు మెట్రో అధికారులు అటు ఆర్‌అండ్‌బీ అధికారులు వదిలేశారు. చాదర్‌ఘాట్‌, మలక్‌పేట రైల్వే వంతెన, చంచల్‌గూడ రహదారులపై అన్నీ గుంతలమయంగా మారాయి. గర్భిణులు, బాలింతలు ఉస్మానియా ఆసుపత్రికి, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రికి, ఆజంపురా మెటర్నిటీ ఆసుపత్రికి ఈ రహదారులపై నుంచే ప్రయాణించాలి. గుంతల వల్ల నెలలు నిండిన వారికి ఈ మార్గంలో తీవ్ర ఇబ్బంది తలెత్తుతోంది. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడి సమస్యలను దక్షిణమండలం జోనల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామని సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మార్గంలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.