close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

పొట్టి చెట్టు.. కడదాం జట్టు

 బోన్సాయ్‌ వృక్షాల పెంపకంపై నగర వాసుల ఆసక్తి
  ఇంటి అలంకరణలో పెరిగిన ప్రాధాన్యం
  బహుమతులుగా అందజేసే సంస్కృతి

విద్యా బుద్దులు చెప్పించే చోట, యోగా సాధన ప్రదేశాల్లో బోధి వృక్షాన్ని పెంచుకుంటున్నారు. చూడటానికి మహా వృక్షంగా కనిపిస్తూ చూపరులను అలరిస్తుంది. వీటి వయస్సు ఎంత లేదన్నా 30 ఏళ్లు ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. బహుమతిగా ఎక్కువ మంది ఈ చెట్టును అందజేస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

చూడటానికి రెండు అడుగుల ఎత్తు ఉంది కదా అని మొక్క అనలేం.. కాండం చూస్తే మందంగా మహా వృక్షంలా కన్పిస్తుంది.. చిన్న తొట్టెలో హొయలు పోతూ గుబురుగా పెరిగి ఆకర్షిస్తుంటాయ్‌.. అవే బోన్సాయ్‌ వృక్షాలు. వీటి పెంపకం నగరంలో పెరిగింది. ఇంటి ఆవరణలో స్థలాల కొరతతో మరుగుజ్జు వృక్షాల వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. బహుమతులుగా అందజేసే సంస్కృతీ విస్తరించింది. అలంకరణ కోసం ఎక్కువమంది వీటిని పెంచుకుంటున్నారు. ఆసక్తి కొద్దీ బోన్సాయ్‌ ఆర్ట్‌ను నేర్చకుని మరీ పెంపకంపై దృష్టిపెడుతున్నారు. అలంకరణ, పూల వృక్షాలు మొదలు పండ్ల చెట్ల వరకు బోన్సాయ్‌లో పెంచుతూ మురిసిపోతున్నారు.

ఎలా పెంచుతారు?
పెద్ద వృక్షానికి మినియేచర్‌ రూపమే బోన్సాయ్‌.. కొందరు మరుగుజ్జు చెట్లు అని కూడా అంటున్నారు. ఎందుకో అలా పిలవడం మహా వృక్షానికి వంకపెట్టినట్లు అనిపిస్తోందని వీటిని పెంచుతున్నవారు అంటున్నారు. బోన్సాయ్‌ వృక్షాలంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కావు.. బయట నర్సరీల్లో దొరికే సాధారణ మొక్కలే. నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత మొక్క బతికేవరకే కొంతకాలం అలాగే పెంచుతారు. తర్వాత అల్యూమినియం తీగతో మొక్కల కాండం, కొమ్మలను వేర్వేరు ఆకారాల్లో వంచుతారు. ప్రకృతిలో మనకు కనిపించే వివిధ ఆకృతుల స్ఫూర్తితో బోన్సాయ్‌లో ముఖ్యంగా ఆరు రకాల ఆకృతుల్లోనే పెంచుతుంటారు. మొక్క రకాన్ని బట్టి ఆకృతిని ఎంచుకుంటారు. ఇక్కడే పెంచేవారి కళ తెలుస్తుంది.

దానిమ్మ చెట్టు

* బోన్సాయ్‌ వృక్షాల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. తగినంత ఎండ తగిలే చోటే వీటిని ఉంచాలి. పాక్షికంగా ఎండ తగిలే చోట కొందరు ఏర్పాటు చేస్తుంటారు. నీడనే పెడుతుంటారు. ఇది కూడా సరైంది కాదు. సూర్యరశ్మినే వీటికి ఆహారం.
* రెండు మూడురోజులకు ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది అనుకుంటుంటారు. ప్రతిరోజూ నీళ్లు పోయాలి. ఇండోర్‌లో వారం రోజులకు మించి బతకలేవు.
* కాండంపైన వచ్చే చిగుళ్లను ఎప్పటికప్పుడు తీసేయాలి. ఫలితంగా వృక్షం కాండం మాత్రమే ఎదుగుతుంది. ఆనుకున్న ఆకృతి సంతరించుకుంటుంది.
* బోన్సాయ్‌ వృక్షాలున్న ట్రేలను నేలపై కాకుండా ఎదైనా ఎత్తయిన చోట పెట్టుకుంటే ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

 

ప్రత్యేక తొట్టెల్లో..

మొదట్లో సాధారణ కుండీలు, కవర్లలో పెంచినా.. వయసు పెరిగేకొద్దీ వేళ్లు విస్తరించే క్రమంలో సాధారణ కుండీలు పగిలిపోయే అవకాశం ఎక్కువ. అందుకే ట్రే ఆకారంలో ఉండే సిరామిక్‌ తొట్టెలను వాడుతుంటారు. మహావృక్షమైనా ఇవి తట్టుకోగలవు. మొక్కలకు పోషకాలు మట్టి నుంచి అందుతాయి కాబట్టి 60 శాతం సేంద్రియ ఎరువు, 20 శాతం ఎర్రమట్టి, 20 శాతం ఇసుకతో కలిపి మిశ్రమంలో వృక్షాలను పెంచుతారు. ఇందులో చెట్టు రెండు అడుగుల ఎత్తుకు మించకూడదు కాబట్టి పై భాగంలో పెరిగిన కొమ్మలను, ఆకులను తొలగిస్తుండాలి.

ఇదో కళగా నేర్చుకుంటున్నారు..
జి.లలితశ్రీ, శ్రీ బోన్సాయిస్‌, ఖాజాగూడ

నాకు మొక్కలు పెంచడమంటే ఆసక్తి. భిన్నంగా ప్రయత్నిద్దాం అనుకుని 29 ఏళ్ల కిందట బోన్సాయ్‌ ఆర్ట్‌ నేర్చుకుని పెంచడం మొదలెట్టాను. తరువాత ఈ వృక్షాల పెంపకంపై కార్యశాలలు నిర్వహిస్తున్నాను. పలు కళాశాలల్లో బోధిస్తున్నాను. నాటితో పోలిస్తే ఇప్పుడు వీటిపై నగరంలో అవగాహన పెరిగింది.  అభిరుచితో ఇదో ఆర్ట్‌గా ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ విద్యార్థులు నేర్చుకుంటున్నారు. మా నర్సరీ నుంచి చాలామంది బోన్సాయ్‌ వృక్షాలు తీసుకెళుతుంటారు. కొన్ని రకాల చెట్లు పెంచాలంటే.. కాండం ఆ ఆకృతి వచ్చేవరకు పదిహేను, ఇరవై ఏళ్లు ఎదురుచూడాలి. అందుకే ఖరీదు రూ.500 నుంచి రూ.5లక్షల వరకు ఉండేవీ ఉన్నాయి.
 

* మర్రిచెట్టును ఇంటి పెరట్లో పెంచుకోగలమా? వేళ్లూ పునాదుల్లోంచి చొచ్చుకుపోయి ఇంటి గోడలు ఎక్కడ దెబ్బతింటాయోనని ఆ ఆలోచన కూడా చేయరు. నగరంలో కొందరు ఎంచక్కా బోన్సాయ్‌ మర్రిచెట్లను చిన్న తొట్టిలోనే పెంచుతున్నారు. రెండు అడుగుల ఎత్తు కూడా లేని మర్రి వృక్షం వయసు పాతికేళ్ల వరకు ఉంటుంది.

జమ్మి చెట్టుకు డిమాండ్‌...

దసరా పండగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఆనవాయితీ. ఇంటి ఆవరణలో ఇంత పెద్ద చెట్టును పెంచుకోవడం ఎవరికైనా కష్టమే. ఇప్పుడీ చెట్లు కూడా బోన్సాయ్‌గా నర్సరీల్లో దొరుకుతున్నాయి. పారిశ్రామికవేత్తలు పండగ రోజు పూజ చేసేందుకు.. వారి పెరట్లో పెంచుకునేందుకు వీటిని తీసుకెళుతున్నారు. వీటి వయస్సు 15ఏళ్ల పైమాటే..

చింతచెట్లు సైతం..

గతంలో ఊళ్లలో, రోడ్ల పక్కన ఎక్కువగా భారీ చింతచెట్లు కనిపించేవి.  క్రమంగా సంఖ్య తగ్గుతోంది. బోన్సాయ్‌ రకంలో ఇంటి ఆవరణలోనే ఎర్ర చింతకాయలు కాసే చెట్టును పెంచుకోవచ్చు. మేడిచెట్టు, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, సంత్ర వంటి ఫలాలు ఇచ్చే రకాలనూ పెంచుకుంటున్నారు. ఎక్కువ మంది అలంకరణ వృక్షాలనే ఇష్టపడుతున్నారు. పూలతో ఆకర్షణీయంగా ఉండే రకాలను పెంచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.