close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

వదల బొమ్మాళీ.. వదలా..

పర్యావరణానికి, మానవాళికి తీవ్ర నష్టం చేస్తున్న ప్లాస్టిక్‌ రాకాసి

 నిషేధం ఉన్నా విచ్చలవిడిగా విక్రయాలు.. వినియోగం

 కొరడా ఝుళిపించని పురపాలక అధికారులు


నిషేధిత కవర్లలో ఉన్న పూలు

ప్లాస్టిక్‌ ప్రపంచాన్ని భూతంలా పట్టిపీడిస్తోంది. నిన్నమొన్నటి వరకు భూగోళంలో ప్రమాదకరమైనది అణుబాంబేనని భావించే వారు. దానికంటే ప్రమాదకరమైన వస్తువుగా ప్రస్తుతం ప్లాస్టిక్‌ను భావించాల్సి వస్తోంది. దీని ద్వారా పంచభూతాలు కలుషితమైపోతున్నాయి. జీవనశైలిని సులభతరం చేసుకునే చర్యల్లో భాగంగా ప్లాస్టిక్‌ను వినియోగించడం ప్రారంభమైంది. బరువు లేకుండా, సులభంగా పదార్థాలను, వస్తువులను ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లడంలో ప్లాస్టిక్‌ ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగం కాస్తా దురలవాటుగా మారి ప్రజలు ప్లాస్టిక్‌కు బానిసలుగా మారిపోయారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలుచేస్తోన్న పట్టణం జిల్లాలో ఒక్కటీ లేకపోవడం బాధాకరం. ఒక సంచి భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్ల సమయం పడుతుందని, అంతవరకు అది విషతుల్యంగా ఉంటూ రసాయన చర్యల ద్వారా ప్రమాదకరమైన వాయువులను విడుదల చేస్తుందని తెలిసినా ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు.

● ఆళ్లగడ్డ నగర పంచాయతీలో గత నెలలో ప్లాస్టిక్‌ నిషేధంపై అధికారులు హడావుడిగా కార్యక్రమాలు, అవగాహన సమావేశాలు, ప్రకటనలు చేశారు. అసలైన విషయం ప్లాస్టిక్‌ నిషేధానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోనూ ఈ నిషేధం తూతూమంత్రంగా అమలవుతోదంటే జిల్లా మొత్తంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్ఛు

● జిల్లాలో రోజుకు సగటున 1.5 నుంచి రెండు లక్షల వరకు ఒకసారి వాడిపారేసే గ్లాసులు, 1.5 నుంచి 2 లక్షల వరకు టీ, కాఫీ కప్పులు, 40 వేల వరకు ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ ప్లేట్లు, 2 లక్షల వరకు నిషేధిత క్యారీ బ్యాగులు, 40 వేల నీటి సీసాలు వినియోగిస్తున్నట్లు అంచనా. బిస్కెట్లు, సబ్బులు, నూనెలు, షాంపూలు తదితరాలు ప్లాస్టిక్‌ సంచుల్లోనే లభ్యమవుతున్నాయి. ఇలా రోజుకు ఇంత భారీ స్థాయిలో ఈ వ్యర్థాలు జిల్లావ్యాప్తంగా పోగవుతున్నాయి. మురుగు కాల్వల్లో, జలాశయాల్లో, కాల్వల్లో కలిసి పర్యావరణానికి భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి.

● జిల్లాలో రోజుకు సగటున 28 టన్నుల నిషేధిత ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఏడాదికి దాదాపు 10,220 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుబడుతున్నాయి.

ఎవరిలో మార్పు రావాలి

నిషేధం అమలు కావాలంటే ప్రజలు మారాలని అధికారులు... ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తే మేము వాడే అవకాశమే లేదు కదా అంటూ ప్రజలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లే సమయంలో చేతి సంచితో వెళ్లడాన్ని ప్రజలు ఇంకా అలవాటు చేసుకోలేకపోతున్నారు. దుకాణదారులు కూడా వినియోగదారులకు సహకరించకుంటే తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని చాటుమాటుగా ప్లాస్టిక్‌ సంచుల వినియోగాన్ని కొనసాగిస్తున్నారు. ఇక అధికారులు దాడులు నిర్వహించడమో, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేసి సిమెంట్‌ కంపెనీలకు విక్రయించడమో చేయాలి. ఆదోనిలో వ్యర్థాలను మహీంద్రా బయోగ్యాస్‌ వారికి విక్రయిస్తున్నారు. ప్రజలు సైతం తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ సిబ్బందికి అందిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి.

ఉద్యమంలా చేపడతాం - ఎ.వి.రమేష్‌ బాబు, కమిషనర్‌, ఆళ్లగడ్డ

ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇప్పటికే పలు అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు సహకరించాలి. చేతి సంచుల వాడకాన్ని పెంచాలి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి మా సిబ్బందికి అందించాలి. ఆళ్లగడ్డలో ఇప్పటికే ప్లాస్టిక్‌ వినియోగ, విక్రయదారులపై కేసులు నమోదు చేశాం. రాబోయే రోజుల్లో భారీ జరిమానా విధిస్తాం.

అందరూ చేయి కలపాలి - నాగేంద్ర, తెలుగు అధ్యాపకుడు, ఆళ్లగడ్డ

ప్లాస్టిక్‌ నిషేధం అనుకున్నంత కష్టం కాదు. ప్రజల్లో మార్పు రావాలి. ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలు తెలుసుకోవాలి. అటు అధికారులు, ఇటు ప్రజలు ఒకే లక్ష్యంతో సాగితేనే నిషేధం సాధ్యమవుతుంది. ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను అధికారులు చేపట్టాలి. ప్లాస్టిక్‌ సంచులను వాడే, విక్రయించే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.