close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

లభించని భరోసా  

 లక్ష కుటుంబాలకు దక్కని ఫలం

 అధికారుల తీరుతో అర్హులకు మొండిచేయి

 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి సంబంధించి జాబితాలో అర్హులకు అన్యాయం జరిగింది. జిల్లాలో ఏకంగా లక్ష కుటుంబాలు ఈ పథకానికి దూరమయ్యాయి. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వ పథకాలు చాలామందికి అందని ద్రాక్షాలా మారుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా మండల కేంద్రాల్లో కూర్చుని వివరాలు నమోదు చేసేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కర్షకులు జిల్లా సరిహద్దుల్లో భూములు సాగు చేస్తున్నారు. రైతు భరోసా పథకం తమకెందుకు వర్తింపజేయడం లేదంటూ జోగులాంబ గద్వాల జిల్లాతోపాటు సరిహద్దు ప్రాంత రైతులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు.

జిల్లాలో 2015 జనాభా లెక్కల(అంచనా) ప్రకారం 7.31 లక్షల రైతుల ఖాతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 7.96 లక్షలకు పెరిగింది. జిల్లాలో 6.92 లక్షల రైతుల ఖాతాలను పరిశీలించి అందులో 5.24 లక్షల ఖాతాలను అంగీకరించి రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్‌టీజీఎస్‌) ద్వారా జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఆర్‌టీజీఎస్‌ సూచనలమేరకు కుటుంబానికి ఒక ఖాతాను లెక్కలోకి తీసుకుని జిల్లాలో 3,94,686 లక్షల రైతుల కుటుంబాలు ఉన్నాయని అధికారులు మరోసారి వివరాలు పంపారు. వాస్తవానికి ప్రధానమంత్రి కిసాన్‌ పోర్టల్‌లో 3,36,330 రైతుల కుటుంబాలు ఉన్నాయి. దీనికి అదనంగా 58,356 కుటుంబాలను మాత్రమే అధికారులు కొత్తగా చేర్చారు. వాస్తవానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గత ప్రభుత్వ హయాంలో అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 5.01 లక్షల కుటుంబాలు ఉన్నాయని రికార్డుల్లో రాసుకున్నారు. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం 3.94 లక్షల కర్షకుల కుటుంబాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద 5.01 లక్షల కుటుంబాలు ఉండగా ప్రస్తుతం 1,06,314 కుటుంబాలు ఎలా తగ్గిపోయాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఐదేళ్లపాటు కొనసాగింపు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకాన్ని కొనసాగిస్తున్నాయి. మొదట రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 ఇవ్వాలని నిర్ణయించగా ప్రస్తుతం తాజాగా మరో రూ.1,000 పెంచింది. ఈ లెక్కన రాష్ట్రం రూ.7,500 ఇవ్వనుంది. మొదట నాలుగేళ్లపాటు ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఐదేళ్లపాటు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పెట్టుబడి సాయాన్ని మూడు విడతలుగా అందించనున్నాయి. రైతులకు మేలో రూ.7,500, రబీ అవసరాలకు రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు కలిపి మొత్తం రూ.13,500 ఇవ్వనున్నాయి. ప్రస్తుతం తాజాగా రబీ అవసరాలకు కేవలం రూ.4 వేలు మాత్రమే జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సోమవారం ప్రకటించారు.

వచ్చే నెల 15 వరకు గడువు పొడిగింపు

సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్న ఖాతాదారుల వివరాలు, వెబ్‌ ల్యాండ్‌లో మార్పులు, చేర్పులు, అన్ని అర్హతలున్న అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద నవంబరు 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. అర్హులైన రైతులందరికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకుగాను ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అర్హులైనవారు నవంబరు 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ జిల్లా వ్యవసాయ శాఖకు ఉత్తర్వులు పంపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.