close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

అడుగడుగునా అపరిశుభ్రతే!

అమ్మేవారికి.. కొనేవారికీ తప్పని అవస్థలు
చెత్త కుప్పల మధ్యే కూరగాయల అమ్మకాలు
అభివృద్ధి, ఆధునిక వసతుల కల్పన ఉత్తమాటే
నగరంలో రైతు బజార్ల దైన్య స్థితి
ఈనాడు - హైదరాబాద్‌

తాజా కూరగాయలను చూస్తే ఎవరికైనా కొనాలనిపిస్తుంది.. అప్పుడే పంట పొలం నుంచి వచ్చిన ఆకు కూరలు చూసి ఇంటికి పట్టుకెళ్లాలనిపిస్తుంది.. ఎలా వండితే, వండించుకుంటే బాగుంటుందో ఊహించుకొని మరీ కొంటాం.. తాజా కూరగాయల్లో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలుంటాయని వైద్యులు, నిపుణులు చెప్పిన మాటలు కూడా స్ఫురణలోకొస్తాయి.

జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సూచనల ప్రకారం.. నిత్యం ప్రతి ఒక్కరూ 350 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు తినాల్సిందే. తాజా పళ్లు, కూరగాయలు తీసుకుంటే అనారోగ్యం దరి చేరదని ఆ సంస్థ చెబుతోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలు రైతు బజార్లకు వెళితే.. అక్కడి వాతావరణం మాత్రం పూర్తి భిన్నంగా ఉంటోంది.. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించాల్సిన స్థాయిలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఎటు చూసినా వర్షాలకు బురదగా మారిన ఆవరణ.. కుల్లిన చెత్తకుప్పలు, కనీస వసతుల లేమి.. అలాంటి దుర్గంధ పరిసరాల్లో కూరగాయలు కొనడానికీ వెనుకాడాలిన్సన దుస్థితి.. మరో గత్యంతరం లేక మాత్రమే రైతుబజార్లను ఆశ్రయించాల్సి వస్తోందన్నది సగటు నగర జీవి మాట. నగరంలో ఉన్న రైతు బజార్లలో పరిస్థితిపై ‘ఈనాడు’ జరిపిన పరిశీలన వివరాలివీ....

ఏదో ఒకటి.. రెండు చోట్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పలేని పరిస్థితి.. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో అపరిశుభ్ర పరిస్థితులే కొనసాగుతున్నాయి. నగరమంతా కలిసి పదకొండే ఉన్నా వాటి నిర్వహణలో అనేక లోపాలున్నాయి. సరైన మురుగు నీటి వ్యవస్థ లేదు. మరుగుదొడ్లు ఉండవు.. ఉన్నా దుర్గంధభరితమే. ఇంట్లో కిలో కూరగాయలు కోసి వండినప్పుడే బుట్ట నిండిపోయేంత చెత్త వస్తుంది. అలాంటిది క్వింటాళ్లు, టన్నుల కొద్దీ కూరగాయలు రైతుబజార్లకు వస్తుంటాయి. వాటి ద్వారా వచ్చే చెత్తను ఊహించవచ్చు. రైతు బజార్లలో ఇదే ప్రధాన సమస్యగా ఉంటోంది. ఎప్పుడు చూసినా చెత్త కుండీలు నిండిపోయి కనిపిస్తున్నాయి. ప్రతి రోజూ తరలిస్తేనే అంతంతమాత్రంగా ఉండే పారిశుద్ధ్యం.. ఒకటి రెండు రోజులు చెత్త ఎత్తకపోవడంతో మరింత అధ్వానంగా మారి జనాన్ని భయపెడుతోంది. నేలకు సమాంతరంగా రైతు బజార్లుండటంతో వర్షం పడితే పరిసరాలన్నీ నీటి కుంటలుగా మారుతున్నాయి. వందలు, వేలాదిగా తరలి వచ్చిన వినియోగదారుల అడుగులకు చిత్తడవుతున్నాయి. కూరగాయల అమ్మకందారులు నిత్యం వేసే చెత్త కుప్పలుగా పేరుకుపోయి కుళ్లిపోయిన పరిస్థితి అన్ని రైతు బజార్లలో కనిపిస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ, రైతుబజార్‌ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనుగోలుదారులు, రైతులకు శాపంగా మారింది.

ఎన్ని.. ఎక్కడ?
నగరంలో 11 రైతు బజార్లు..
సరూర్‌నగర్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, వనస్థలిపురం, మీర్‌పేట, ఫలక్‌నుమా, అల్వాల్‌, ఆర్‌కేపురం, మేడిపల్లి, ఎల్లమ్మబండ
అభివృద్ధి మాటే వినిపించదు..
నగర జనాభా 40 లక్షల మంది ఉన్నప్పుడు రైతు బజారు వ్యవస్థ వచ్చింది. మధ్య దళారీలు లేకుండా.. రైతుకు గిట్టుబాటు ధర.. వినియోగదారులకు అందుబాటులో ఉండేలా రైతు బజార్లు పని చేయాలని పాలకులు భావించారు. నగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించగా జనాభా కోటి దాటింది.. నియోజకవర్గానికి ఒకటి చొప్పున కనీసం 27 రైతు బజార్లు ఉండాలి. ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, సరూర్‌నగర్‌, మెహిదీపట్నం మార్కెట్లలో రోజూ రూ. 10లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి. ప్రతి బజారుకు 10 వేల మంది దాకా వినియోగదారులు వస్తుంటారు. శని ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో ఆదరణ ఉన్నా ఏ ఒక్క రైతు బజారు ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. మెహిదీపట్నం రైతు బజారును ఒక నమూనాగా తీర్చిదిద్దాలని ఏళ్ల కిందటే తలచారు.. ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎర్రగడ్డ రైతు బజారును కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అక్కడికి వెళ్లగానే చెత్త వాతావరణం మనల్ని వెక్కిరిస్తుంది. పది రైతు బజార్లలో అన్ని రకాలుగా అవస్థలే కొనసాగుతున్న పరిస్థితి. ఇక రెండేళ్ల కిందటే ఏర్పాటుచేసిన ఎల్లమ్మబండ రైతు బజారులో 60 దుకాణాలుండగా 8 మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇక్కడ సౌకర్యాలున్నా చుట్టూ వారాంతపు సంతలుండడంతో రైతులతో పాటు వినియోగదారులు రావడం లేదు.

ప్రగతి పరిమితం.. కంపు అధికం
అల్వాల్‌

అల్వాల్‌: అల్వాల్‌ రైతుబజార్‌ అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమైంది. 1.40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మార్కెట్‌ను సిద్దిపేటలోని మోడల్‌ మార్కెట్‌ను తలపించేలా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించి 2018లో తొలి విడతగా ఓ వైపు షెడ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుమీదే సంతలా మారింది తప్ప రైతుబజారు అనే ఆనవాళ్లు లేవు. ఆవరణలోకి నేరుగా మురుగు ప్రవహిస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించడంలేదని వినియోగదారులు వాపోతున్నారు. పందుల స్వైర విహారంతో వ్యాధుల బారిన పడుతున్నామని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. రెండు దశలో భాగంగా మార్కెట్‌ ముందు భాగంలోని స్థలంలో రూ.90లక్షలతో అభివృద్ధికి ప్రతిపాదించినా మోక్షం లభించడం లేదు. అది జరిగితేనే క్యాంటీన్‌, మరుగుదొడ్లు, వాహన పార్కింగ్‌ సమస్యలకు సైతం పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం వర్షం వస్తే మార్కెట్‌ అంతా బురదమయమే. రాజీవ్‌ రహదారిపై వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయం లేక మిగిలిపోయిన కూరగాయలను ఆవరణలోనే పడేయాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.

మీకు తెలుసా?
రెండు దశాబ్దాల కిందట.. 1999 జనవరి 26వ తేదీన మెహిదీపట్నం రైతుబజార్‌ను ప్రారంభించారు. ఈ ప్రయోగం సఫలం కావడంతో ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతు బజార్లు ప్రారంభ  మయ్యాయి.

దేశంలోనే ప్రథమం.. సౌకర్యాల్లో అధమం
మెహిదీపట్నం రైతు బజార్‌

మెహిదీపట్నం: దేశంలో ప్రప్రథమంగా ఏర్పాటైన మెహిదీపట్నం రైతుబజార్‌ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. దాదాపు 1.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రైతుబజార్‌లో 175 షెడ్లు, పప్పులు, బియ్యం విక్రయించే 26 దుకాణాలు ఉన్నాయి.  డ్రైనేజీ, వర్షపు నీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేక చినుకుపడితే ఆవరణంతా నీరు నిలిచిపోతోంది. స్థలం చాలక రైతులు ఎండకు, ఎండి వానకు తడుస్తూ నడక బాటలోనే విక్రయాలు చేస్తున్నారు. నగరంలోని ప్రతి చోట నుంచి మెహిదీపట్నం ప్రాంతానికి బస్సుల రాకపోకలు ఉండటంతో ప్రతి రోజు సాయంత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ మార్కెట్‌లో నిత్యం దాదాపు 500 కిలోల వ్యర్థాలు వెలువడుతాయి. కుండీల్లో చెత్తను వేస్తారు. బల్దియా వారు వారం పాటు శుభ్రం చేయకపోడంతో ఈ ప్రాంతమంతా కంపు కొడుతోంది. కూరగాయల వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీకి యూనిట్‌ను ఏర్పాటుచేసినా పనిచేయడం లేదు. ఐదేళ్ల కిందట ఏర్పాటైన కోల్డ్‌ స్టోరేజీ ప్రారంభించకుండానే మూత పడింది. బజార్‌లోని అధికారిక బోర్డు.. విక్రయాల ధరకు పొంతన ఉండటం లేదని విక్రేతలు, వినియోగదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ రైతుబజార్‌ను ఆధునికంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలున్నా కార్యరూపం దాల్చడం లేదు.

వ్యర్థాల కంపు.. తప్పవు వెతలు
ఎర్రగడ్డ..

అమీర్‌పేట: గుట్టలుగా పేరుకుపోతున్న కుళ్లిన కూరగాయల వ్యర్థాలు, అధ్వానంగా మరుగుదొడ్లు, పనిచేయని సీసీకెమెరాలు, భద్రతా లోపం, పెరుగుతున్న చోరీలు.. ఈ సమస్యలన్నీ ఎర్రగడ్డలోని మోడల్‌ రైతుబజార్‌లో కనిపిస్తాయి.  2000 వ సంవత్సరంలో మానసిక చికిత్సాలయం ఆవరణలోని 2.23 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేశారు. 280 స్టాళ్లుండగా నిత్యం 10వేలు, ఆదివారం 15వేల మంది వరకు కొనుగోలుదారులు వస్తుంటారు. నగరంలోనే అత్యధికంగా రద్దీ ఉండే ఈ రైతుబజార్‌లో ప్రతిరోజూ 1.5టన్నుల కూరగాయల వ్యర్థాలు వెలువడుతుంటాయి. వీటిని ఏ రోజుకారోజు తరలించాల్సి ఉన్నా మూడు, నాలుగు రోజుల వరకు తీయకుపోవడంతో కుళ్లిపోయి, వీటి నుంచి మురుగు ఊరుతూ రైతుబజార్‌ రహదారులపై ప్రవహిస్తోంది. తీవ్ర దుర్వాసనతో రైతులు, కొనుగోలుదారులు, రైతుబజార్‌ సిబ్బంది కూడా ముక్కులు మూసుకుని ఉండాల్సి వస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ గుత్తేదారుకు ఇచ్చినా పనిచేయించడం అధికారులకు సాధ్యం కావడం లేదు. మరుగుదొడ్లు పాడైపోయాయి. శుద్ధమైన తాగునీటి ఏర్పాట్లు లేవు. కుళాయి, ట్యాంకులను ఎప్పుడూ శుభ్రం చేయరు. ఆవరణలో వాటర్‌ ఏటీఎం పని చేయదు. వర్మీకంపోస్టు ఏర్పాట్లను మధ్యలో వదిలిపెట్టారు. రైతులు కూరగాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీ సదుపాయం కూడా లేదు. భద్రతలో భాగంగా ఆరు సీసీ కెమెరాలున్నా పనిచేయవు. నిఘా వ్యవస్థ లేక తరచూ సరకులు దొంగల పాలవుతున్నాయి.

స్థలం ఉన్నా.. సౌకర్యాలు సున్నా
సరూర్‌నగర్‌

చైతన్యపురి: రెండెకరాల విస్తీర్ణంలో సరూర్‌నగర్‌ రైతుబజారు ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు గడుస్తున్నా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని పలు కాలనీలు, మలక్‌పేట ప్రాంతంలోని వినియోగదారులు కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తారు. రైతుల ముసుగులో ఇక్కడ దళారులే తిష్ఠ వేసినా పట్టించుకునే వారు లేరు. విశాలమైన స్థలం ఉన్నా అధికారుల పర్యవేక్షణ సరిగా లేక వ్యాపారులు నడక దారిని కూడా సరకులతో ఆక్రమిస్తున్నారు. దీంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రద్దీ సమయాల్లో ఒకరికొకరు తాకుతూ నడవాల్సిన దుస్థితి. రూ.లక్షల వ్యయంతో శాశ్వత షెడ్ల నిర్మాణం చేసినా వ్యాపారులు అంతటా ప్లాస్టిక్‌ కవర్లు, గోనె బస్తాలు కట్టడం ప్రమాదకరంగా మారింది. అనుకోని ప్రమాదమేదైనా జరిగితే కష్టమే. మన కూరగాయల పథకం ప్రారంభించిన సమయంలో మినీ శీతల గిడ్డంగిని నిర్మించినా ఇప్పుడు వినియోగంలో లేదు. అది పనిచేస్తున్నా కూరగాయలు నిల్వ ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తాగునీటి ఏటీఎం నెలలుగా పనిచేయడంలేదు. ఇక్కడ మాత్రమే పారిశుద్ధ్యం పనులు, మరుగుదొడ్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.

తాత్కాలిక ప్రాంగణం.. సమస్యలమయం
కూకట్‌పల్లి

కేపీహెచ్‌బీకాలనీ: కూకట్‌పల్లి రైతుబజారు సమస్యల వలయంలో కొట్టమిట్టాడుతోంది. కేపీహెచ్‌బీ పరిధి జేఎన్‌టీయూ రోడ్డులో ఉన్న రైతుబజారును ఆధునికీకరించే క్రమంలో తాత్కాలికంగా నాలుగో ఫేజ్‌ సమీపంలోని హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ వంతెన కిందికి మార్చారు. ఆదిలోనే అధికారులు రైతులు, వినియోగదారులకు వసతులు కల్పించడంలో అశ్రద్ధ వహించారు. సాయంత్రం 5 గంటలు దాటితే దోమలు విజృంభిస్తున్నాయి. ఎంటమాలజీ సిబ్బంది ఫాగింగ్‌ చేయడం లేదు. ఇక వర్షం పడితే వారి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వంతెన పైనుంచి వర్షపు నీరు కారి కింద స్టాళ్లలోని రైతులు, వినియోగదారులపై పడుతోంది. వీరు వర్షానికి తడవకుండా వంతెన స్తంభాల బీమ్‌ల కింద నిల్చోవాల్సిన దుస్థితి. స్టాళ్లు తడిసి ముద్దవుతున్నాయి. ప్రాంగణంలో ఎటుచూసినా కూరగాయలు, చెత్త వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. రైతులకు కలుషిత తాగునీరే దిక్కు. మొబైల్‌ మరుగుదొడ్లు ఉన్నా వ్యర్థాలు వెళ్లేందుకు సరైన అవుట్‌లెట్‌ లేక దుర్వాసన వెదజల్లుతోంది. మరుగుదొడ్ల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో అన్నం తినలేకపోతున్నామని, మధ్యాహ్నం వరకు ప్రాంగణం ముందు రహదారిలో ట్రాఫిక్‌ రద్దీతో బేరాలు ఉండటంలేదని రైతులు వాపోతున్నారు.

మరి కొన్ని చోట్ల.. ఇలా..

* 2004లో రెండెకరాల్లో ఏర్పాటైన వనస్థలిపురం రైతుబజార్‌లో తాత్కాలిక షెడ్‌లలోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. ఆర్‌వో ప్లాంటున్నా బోరు నీరు సరిగా రావడం లేదు. కూరగాయల నిల్వకు కోల్డ్‌ స్టోరేజీ లేదు. పార్కింగ్‌కు కొంత స్థలం మాత్రమే ఉండటంతో నిత్యం ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
* షాపూర్‌నగర్‌ మార్కెట్‌లో తాగునీరు, మూత్రశాలలు లేకపోగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. రోజుల పాటు చెత్తను తరలించడం లేదు. 2001లో నిర్మించినా సరైన వసతులు లేక ఆదరణ కరవై 2015లో మార్కెట్‌ యార్డుగా మార్చారు. నాలా పక్కనే రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారు. ఉప్పల్‌, పాతనగరంలోని ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో రైతుబజార్లను కూడా అధ్వాన పారిశుద్ధ్యం, వసతుల లేమి వేధిస్తున్నాయి.
* ఇక రామకృష్ణాపురం, ఎల్లమ్మబండ రైతు బజార్లది అన్నింటికీ భిన్నమైన పరిస్థితి. ఆర్కేపురంలో 78 స్టాళ్లున్నా కనీసం 20 మంది రైతులు కూడా కూరగాయలు అమ్మేందుకు రారు. ఎల్లమ్మ బండలో 60 దుకాణాలుండగా 8 మాత్రమే నడుస్తున్నాయి. చుట్టూ వారాంతంపు సంతలుండటంతో ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. సౌకర్యాలున్నా ఇక్కడ వ్యాపారాలు జరగడంలేదు.
- న్యూస్‌టుడే, వనస్థలిపురం, షాపూర్‌నగర్‌, డిఫెన్స్‌ కాలనీ


 
 
 
 
 
 

మరిన్ని వార్తలు

మాయదారి యాప్‌లు!

ఏది కొనాలన్నా.. విక్రయించాలనుకున్నా.. క్లిక్‌ కొడితే చాలు. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు లావాదేవీలకు వేదికగా మారాయి. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ రాగానే పాతవాటిని తక్కువ ధరకు విక్రయించేందుకు యువత, కార్పొరేట్‌ ఉద్యోగులు ఆసక్తిచూపుతున్నారు.  ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లు మరమ్మతులు ఉన్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లు రీఫర్బిష్డ్‌ (పునరుద్ధరించినవి) విక్రయిస్తుంటాయి. కొత్త వాటితో పోల్చితే ధరలో సుమారు 30శాతం తేడా ఉంటుంది. ఈ సంస్థలు వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విక్రయానికి సిద్ధంగా ఉంచుతాయి. కొనుగోలు చేసిన అనంతరం ఏదైన సమస్య వస్తే సదరు సంస్థలకు ఫిర్యాదు చేస్తే రిప్లెస్‌మెంట్‌(మరో వస్తువు) చేస్తారు. ఈ నిబంధన ఆరు నెలల పాటు ఉంటుంది.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.